Skip to main content

వారం రోజుల్లో సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి

సాక్షి, అమరావతి: జిల్లాలో ఇంకా కొనసాగుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ వారం రోజుల్లో ముగించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అక్టోబర్ 18న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ, వలంటీర్ల వ్యవస్థ అమలుపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అక్టోబర్ 18నజిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ సమావేశంలో పాల్గొన్నారు. మండలంలో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టులను భర్తీ చేసుకునే అధికారం ఆ ఎంపీడీవోకు, పట్టణ ప్రాంతంలో ఖాళీ ఉన్న వలంటీరు పోస్టుల భర్తీ అధికారం ఆ మున్సిపల్ కమిషనర్‌కే ప్రభుత్వం అప్పగించబోతుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని.. తర్వాత ఉత్తర్వుల రూపంలో ఈ సమాచారం తెలియజేస్తామన్నారు. అక్టోబర్ నెలాఖరుకల్లా ప్రతి గ్రామ సచివాలయానికి ఇంటర్‌నెట్ వసతి కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలని.. జనవరి నెల నుంచి అన్ని చోట్ల గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 

 వినతుల పరిష్కారానికి జిల్లాకో అధికారి..
 సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి అందిన వినతులు వేగంగా పరిష్కరించేందుకు జిల్లాకో సూపర్‌వైజరు అధికారికి బాధ్యత అప్పగించారు. సచివాలయ ఉద్యోగ రాతపరీక్ష సమయంలో జిల్లాకొక సూపర్‌వైజర్ ఆఫీసరుగా నియమితులై కమిషనర్ కార్యాలయంలో పనిచేసే అధికారులకే జిల్లాల వారీగా వినతుల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. 
Published date : 19 Oct 2019 02:39PM

Photo Stories