Skip to main content

ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు ఇక చెల్లుచీటీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా చేపట్టే ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంపై నిపుణులు, విద్యావేత్తలు, నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనిద్వారా ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు తెరదించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
ఆ ఉదంతాలు కోకొల్లలు...
ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 తదితర ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తున్నారు. రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపిన అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో కలిపి గరిష్టంగా మార్కులు సాధించిన వారిని ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. అయితే రాత పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడం వల్ల ఉద్యోగానికి ఎంపిక కాని ఉదంతాలు కొకొల్లలుగా ఉన్నాయి.

నష్టపోతున్న గ్రామీణ విద్యార్థులు :
పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ కొంత తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పర్యవసానంగా ఇంటర్వ్యూల్లో వెనకబడుతున్నామంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో పోల్చితే గ్రామీణ విద్యార్థులు రాత పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపినా ఉద్యోగాలు దక్కించుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పారదర్శకతకు గీటురాయి
ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నా. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగనమోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకం. ప్రతిభకు కొలమానం రాత పరీక్ష మాత్రమే. ఇంటర్వ్యూ కానే కాదు.
- డాక్టర్ వై.వెంకటరామిరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్

సమూల ప్రక్షాళన..
ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడం ద్వారా ఏపీపీఎస్సీని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమూలంగా ప్రక్షాళన చేశారు. దీనివల్ల ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు అవకాశం ఉండదు. రాత పరీక్షలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపుతారు. ఉద్యోగానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం తక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసే సమయంలో అవి అలవడతాయి.
- కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్

నిరుద్యోగుల డిమాండ్ నెరవేరింది..
ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చినటై్లంది. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే ధ్యేయం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల నిజమైన ప్రతిభావంతులకే ఉద్యోగాలు దక్కుతాయి. సీఎం నిర్ణయం పట్ల లక్షల మంది నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు చేయడం ద్వారా ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. - షేక్ సలామ్‌బాబు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
Published date : 18 Oct 2019 11:59AM

Photo Stories