Skip to main content

రేపు `ఏపీపీఎస్సీ గ్రూప్ 1`పై తీర్పు

సాక్షి, అమరావతి: గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షపై దాఖలైన వ్యాజ్యాల్లో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు తీర్పును రిజర్వ్ చేశారు.
ఈ నెల 22న దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. వివరాలు.. 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించగా.. 120 ప్రశ్నల్లో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ప్రిలిమనరీ పరీక్షా ఫలితాలపై స్టే విధించారు. అనంతరం సీజే ధర్మాసనం సూచనల మేరకు ఈ వ్యాజ్యాలపై తిరిగి సింగిల్ జడ్జిచే విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జస్టిస్ రఘునందన్‌రావు ఎదుట సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 26 ప్రశ్నలకు సంబంధించి తెలుగు అనువాదంలో తప్పులు దొర్లాయని తెలిపారు. ఈ ప్రశ్నలను తొలగించిన తర్వాత మెరిట్ జాబితాను తయారుచేసేలా ఏపీపీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఏపీపీఎస్సీ న్యాయవాది మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ.. తప్పులు దొర్లిన 25 ప్రశ్నలను తొలగించిన తర్వాతే కీ విడుదల చేశామని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తిన 26 ప్రశ్నల్లో ఈ 25 ప్రశ్నలున్నాయా? అని ప్రశ్నించారు. దీనిపై అధికారులతో మాట్లాడి బుధవారం వివరణ ఇస్తానని మల్లికార్జునరావు తెలిపారు. దీనిపై ఈ నెల 22న తీర్పును వెలువరిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Published date : 21 Oct 2020 01:51PM

Photo Stories