Skip to main content

డాక్టర్‌ రోబోకు పేటెంట్‌ ప్రయత్నం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థినులు రూపొందించిన ‘డాక్టర్‌ రోబో’కు విశేష స్పందన లభిస్తోంది. దీనికి పేటెంట్‌ హక్కులు తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది.
A patent attempt for a doctor robot
డాక్టర్‌ రోబోకు పేటెంట్‌ ప్రయత్నం

విశాఖపట్నం మధురవాడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం–సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన విద్యార్థులు జెస్సికా(పదో తరగతి), కె.వర్షిణిప్రియాంక, కె.రేష్మాబిందు(తొమ్మిదో తరగతి)లు ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ డాక్టర్‌ టి.రాంబాబు పర్యవేక్షణలో ‘డాక్టర్‌ రోబో’ కాన్సెప్ట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌(ఏటీఎల్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్‌ 2021–22 టాప్‌ టెన్‌ ప్రాజెక్ట్‌ల్లో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. ఏటీఎల్‌–మారథాన్‌ 2021–22ను ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఇంటర్న్‌షిప్‌ పేరుతో 2023 జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన 1,600 మంది విద్యార్థులు 7 వేల ప్రాజెక్ట్‌లను ప్రదర్శించగా.. టాప్‌ టెన్‌లో డాక్టర్‌ రోబో ఎంపికైంది.  

చదవండి: NMA: కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!.. ఎన్‌ఎంఏ కీలక సూచనలివీ...

ఇలా చేస్తే మరింత మేలు.. 

అయితే, దీనికి కొద్దిపాటి మార్పులు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సాంకేతిక నిపుణులు భావించి పలు సూచనలు చేశారు. రోబోకు చక్రాలు అమర్చడం ద్వారా ఒక చోట నుంచి మరో చోటకు కదిలించడం సులభం అవుతుంది. వైద్య పరీక్షల రిపోర్టులను ఈ రోబో వద్ద స్కానింగ్‌ చేసే సదుపాయంతో పాటు వాటి ఆధారంగా తగిన వైద్య సేవలు, మందులు సూచించేలా అప్‌డేట్‌ చేస్తే బాగుంటుంది. దీనిపై పలు సాంకేతిక(టెక్‌) సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అవి ముందుకొస్తే కొద్దిపాటి మార్పులతో మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంతో పాటు పేటెంట్‌ హక్కులు కూడా పొందుతారు.

చదవండి: Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ల‌క్ష్య‌మిదే..

మందులిస్తుంది.. డాక్టర్‌తో మాట్లాడిస్తుంది..  

కాగా, కృత్రిమ మేధస్సుతో పనిచేసే డాక్టర్‌ రోబో వైద్య సేవల్లో డాక్టర్లకు సహాయకారిగా పనిచేస్తుందని భావిస్తున్నారు. దీన్ని ఏప్రిల్‌ 9 నుంచి 13 వరకు బెంగళూరులో ప్రపంచ దేశాలకు చెందిన నిపుణుల బృందం వద్ద ప్రదర్శించగా.. వారు పలు సూచనలు చేశారు. ఈ రోబోకు రోగి తన పరిస్థితిని వివరిస్తే.. రోగి వాడాల్సిన మందులను స్క్రీన్‌పై డిస్ప్లే చేయడంతో పాటు రోబో ముందు భాగంలో ఉన్న ర్యాక్‌ ద్వారా మందులిస్తుంది. రోగికి మరింత సాయం అవసరమైతే.. రోబోకు ముందు బిగించి ఉన్న స్క్రీన్‌పై డిస్ప్లే వచ్చేలా ప్రత్యేక వైద్యులకు వీడియోకాల్‌ చేసి కనెక్ట్‌ చేస్తుంది. రోగి వీడియో కాల్‌లో వైద్యుడితో మాట్లాడి సాయం పొందొచ్చు. దీంతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యులున్నారు? ఏ రోగానికి ఏ వైద్యుడిని సంప్రదించాలి? అవసరమైన వైద్యులు బిజీగా ఉంటే.. తిరిగి వారు ఏ సమయంలో అందుబాటులోకొస్తారు? వంటి విషయాలకు సంబంధించిన సమాచారాన్ని డాక్టర్‌ రోబో అందిస్తుంది.

చదవండి: ఈ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి

Published date : 22 Apr 2023 04:07PM

Photo Stories