Skip to main content

పరీక్ష కేంద్రంలోనే ప్రశ్నపత్రాల ముద్రణ

సాక్షి, విజయవాడ: ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ సర్వసాధారణంగా మారింది. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో ఈ బెడద మరింత ఎక్కువయింది.
దీన్ని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఒక కొత్త విధానాన్ని ఎంచుకుంది. బుధవారం నుంచి ప్రారంభమైన 2011 గ్రూప్-1 మెయిన్స్ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. పరీక్ష తేదీలకు చాలా ముందుగా మూడు లేదా నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను రూపొందించడం, వచ్చిన దరఖాస్తులను అనుసరించి వాటిలో రెండింటిని ముద్రణకు ఇచ్చి, నేరుగా ఆ ప్రశ్నపత్రాలు ఆయా కేంద్రాలకు చేర్చడం ఇప్పటివరకు జరుగుతున్న విధానం. దీనివల్ల ఏదో ఒక సందర్భంలో ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి రెండు సెట్ల ప్రశ్నపత్రాలు లీకవ్వడం తీవ్ర గందరగోళానికి దారితీయడం తెలిసిందే. దీంతో మూడోసారి ఎంసెట్‌ను నిర్వహించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు తీవ్ర వ్యయప్రయాసలకు లోనయ్యారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి వీఎస్‌టీ సాయిలు ఈసారి కొత్త పంథాను ఎంచుకున్నారు. నిపుణులతో రూపొందించిన నాలుగైదు సెట్ల ప్రశ్నపత్రాలను సాఫ్ట్‌కాపీల రూపంలో తమ వద్దే భద్రపరుచుకున్నారు. బుధవారం పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఒక సెట్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసి ఆయా కేంద్రాలకు ఆన్‌లైన్ ద్వారా సాఫ్ట్‌కాపీలను పంపారు. పరీక్ష కేంద్రాల్లో వాటిని ప్రింట్ తీయించి అభ్యర్థులకు అందించడానికి సీసీ కెమెరాలతో సహ ప్రత్యేక భద్రతతో గదిని కేటాయించారు. హైస్పీడ్ ప్రింటర్ల సాయంతో కాపీలను ప్రింట్ తీసి వాటిని ప్యాక్ చేసి సీల్ వేసి ఆయా గదుల్లోని ఇన్విజిలేటర్లకు పంపిణీ చేయించారు. చివరి నిమిషం వరకు ప్రశ్నపత్రం ఏదనేది ఏపీపీఎస్సీలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
Published date : 16 Sep 2016 12:58PM

Photo Stories