నవంబర్ 25న ఏపీపీఎస్సీ ఓపెన్ హౌస్ సెమినార్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు నిర్ణయం మేరకు ప్రతిభే కొలమానంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా.. ఉద్యోగార్థుల్లో సంపూర్ణ విశ్వాసం ప్రోది చేసేలా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది.
‘ఎక్కడా, ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా సంపూర్ణ పారదర్శకంగా, జవాబుదారీగా ఏపీపీఎస్సీ నియామకాలు ఉండాలి. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాలు వస్తాయనే సంపూర్ణ విశ్వాసాన్ని ఉద్యోగార్థులో ప్రోది చేసేలా నియామక ప్రక్రియను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీపీఎస్సీకి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఇదే లక్ష్యంతో నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాలులో ఓపెన్ హౌస్ సెమినార్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. దీనికి విద్యావేత్తలు, మేధావులు, యువజన సంఘాలు, నిరుద్యోగ ప్రతినిధులు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తోంది. ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టే విధానాన్ని వివరించడంతోపాటు అన్నివర్గాల అభిప్రాయాలను సదస్సు నుంచి తీసుకుంటామని సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 20 Nov 2019 02:47PM