Skip to main content

మే 5నే ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 5న గ్రూప్-2 పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షను యథాతథంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది.
గ్రూప్-2 కింద 446 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే, సాధారణ ఎన్నికలు రావడంతో ప్రిపరేషన్‌కు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయని, పరీక్షను నెలపాటు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు, పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధానాధికారికి విన్నవించారు. అయితే, పరీక్షను ముందుగా ప్రకటించిన విధంగా మే 5నే నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులంతా చాలాకాలం నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నారని, ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం వల్ల వారంతా నిరాశానిసృ్పహలకు లోనవుతారని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పరీక్షను వాయిదా వేస్తే ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడానికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి. పరీక్ష వాయిదా వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందని, అందుకే సకాలంలో పరీక్ష నిర్వహించాలని వివరిస్తున్నాయి. గ్రూప్-2 పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 773 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష పెన్ను-పేపర్ (ఓఎమ్మార్ పత్రాలు) విధానంలో జరగనుంది. తప్పు సమాధానాలకు 1/3 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.

446 పోస్టుల్లో 110 పాత పోస్టులే..
మొత్తం 446 గ్రూప్-2 పోస్టుల్లో 110 పోస్టులు పాత నోటిఫికేషన్లలో భర్తీ కాకుండా క్యారీ ఫార్వార్డ్ కింద ఈ నోటిఫికేషన్‌లో చేరాయి. 446 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 154 కాగా, తక్కినవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులే. క్యారీ ఫార్వార్డ్ కింద చేరిన 110 పోస్టుల్లో 16 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, తక్కినవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి.

వైట్నర్ పెడితే తిరస్కరణ :
కాగా, ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షల్లో పలువురు అభ్యర్థులు అనేక పొరపాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ గుర్తించింది. కొంతమంది ఓఎమ్మార్ పత్రాల్లో వివరాలను సరిగా నింపలేదు. కొంతమంది బబ్లింగ్ కూడా సరిగా చేయలేదు. కొంతమంది బబ్లింగ్ చేసి తర్వాత వాటిని వైట్నర్‌తో చెరిపేసి మళ్లీ బబ్లింగ్ చేశారు. ఇలా చేయడంతో ఆయా అభ్యర్థుల పత్రాలు స్కానింగ్ సమయంలో తిరస్కరణకు గురవుతాయని కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయొద్దని సూచిస్తున్నాయి.

ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరి..
మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో కొన్ని కేటగిరీల వారికి ‘ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్’ టెస్టును తప్పనిసరి చేశారు. మొత్తం 15 విభాగాల పోస్టుల అభ్యర్థులు దీన్ని రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ లో మెరిట్ సాధించి పోస్టులకు ఎంపికయ్యే అవకాశాలున్నా ఈ ప్రొఫిషియెన్సీ టెస్టులో కూడా ఉత్తీర్ణత సాధిస్తేనే వారిని పోస్టుకు ఎంపిక చేస్తారు. ప్రొఫిషియెన్సీ టెస్టు తర్వాత మాత్రమే అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.

జూలై 18, 19 తేదీల్లో మెయిన్ పరీక్షలు...
ప్రిలిమ్స్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించినవారిని వారి రిజర్వేషన్లకనుగుణంగా 1:12 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు తగినంతమంది మెయియి పరీక్షలకు ఎంపిక కాకుంటే ఆ కేటగిరీల వరకు కటాఫ్ మార్కులు తగ్గించి మిగతా వారిని మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. ఇలా ప్రత్యేక కటాఫ్ మార్కుల మినహాయింపు ద్వారా మెయియి పరీక్షలు రాసి మెరిట్ సాధించినవారు జనరల్ కోటా పోస్టులకు కాకుండా రిజర్వుడ్ కోటా పోస్టులకు మాత్రమే పరిమితమవుతారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపికై నవారికి జూలై 18, 19న కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
Published date : 30 Apr 2019 02:58PM

Photo Stories