Skip to main content

జనరల్ స్టడీస్ పేపర్‌ను ఆంగ్లంలోనే రాయాలి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు కొత్త సమస్య వచ్చిపడింది. నోటిఫికేషన్ల సమయంలో పేర్కొనని అంశాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలకు ముందు తెరపైకి తీసుకొస్తోంది.
ఇప్పటివరకు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ ప్రశ్నలను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇచ్చేవారు. నచ్చిన భాషలో సమాధానాలు రాసేందుకు అవకాశం ఉండేది. ఏ కేటగిరీ పోస్టులో అయినా సబ్జెక్టు పేపర్లు ఆంగ్లంలో ఉంటే పేపర్-1 కూడా అదే భాషలో ఉంటుందని ఏపీపీఎస్సీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. 14 నోటిఫికేషన్లకు సంబంధించి ఈ కొత్త నిర్ణయాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఇటీవల వెబ్‌నోట్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్ బోయలర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్, అసిస్టెంట్ డెరైక్టర్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, టౌన్‌ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్‌సీర్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్, సెరికల్చర్ ఆఫీసర్, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్‌ను అభ్యర్థులు ఆంగ్లంలోనే రాయాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు మూడు నెలల క్రితం వెలువడ్డాయి. జనరల్ స్టడీస్ పేపర్‌ను ఆంగ్లంలో రాయాలని అందులో పేర్కొనలేదు. అభ్యర్థులు పాత పద్ధతిలోనే పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. జనరల్ పేపర్ పరీక్షను కేవలం ఆంగ్లంలోనే రాయాలని నిబంధన విధించడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్‌ను తెలుగులో, మరికొన్నింటికి కేవలం ఆంగ్లంలోనే రాయాలన్న ఈ కొత్త నిబంధన అన్యాయమని వాపోతున్నారు. తెలుగు మాధ్యమంలో ప్రిపేర్ అయ్యామని, ఇప్పుడు అకస్మాత్తుగా ఆంగ్లంలోనే రాయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకే..
అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ చెప్పారు. 2016 నోటిఫికేషన్‌లో జనరల్ స్టడీస్ పేపర్‌తోపాటు ఇతర కొన్ని సబ్జెక్టుల పేపర్లను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇచ్చినప్పుడు తాము రెండింటినీ సరిచూసుకోవడంతో తికమక పడ్డామని, సమయం వృథా అయి్యందని, సబ్జెక్టు పేపర్‌ను ఆంగ్లంలోనే రాస్తున్నందున జనరల్ స్టడీస్‌ను కూడా అదే భాషలో ఇవ్వాలని వారు కోరారని పేర్కొన్నారు. తెలుగు మాధ్యమంలో పేపర్ ఇస్తామని నోటిఫికేషన్‌లో ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు.
Published date : 23 Feb 2019 03:37PM

Photo Stories