Skip to main content

గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌ 73.56 శాతం హాజరు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రూప్-2 కేడర్‌లో 982 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఈనెల 26న నిర్వహించిన ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు) ప్రశాంతంగా ముగిసింది.
ఈ పరీక్షకు 6,57,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,83,321 (73.56శాతం) మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,462 కేంద్రాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఏపీలో 1,376, తెలంగాణలో 86 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా అన్నిచోట్లా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. ఉదయం 9.45 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఉరుకులుపరుగులు పెట్టారు. కొన్ని కేంద్రాల్లో ఒకటి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని కూడా పరీక్షకు అనుమతించారు. మరికొన్నిచోట్ల అనుమతించకపోవడంతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో వెనుతిరిగారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించిన గ్రూప్-2 పోస్టులకు అత్యధికం గా 6,57,010 మంది దరఖాస్తు చేయడం విశేషం. మొత్తం 5.81 లక్షల మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేనివారు పరీక్ష కేంద్రాలకు చేరుకొని అక్కడి అధికారులకు తమ సమస్యను వివరించారు. వారు నిజమైన అభ్యర్థులని నిర్ధారించుకున్నాకే పరీక్షకు అనుమతించారు.

250 కేంద్రాల్లో ప్రత్యేక నిఘా :
గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసినప్పుడే కొందరు అభ్యర్థులు ఒక బృందంగా దరఖాస్తు చేశారని, వారికి పక్కపక్కనే హాల్‌టిక్కెట్ నంబర్లు వచ్చినట్లు ఫిర్యాదులు రావడంతో ఏపీపీఎస్సీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకే సమయంలో, ఒకే ఐపీ నంబర్ ద్వారా అందిన దరఖాస్తులపై దృష్టి పెట్టారు. అలాంటి వారు పరీక్ష రాసే 250 కేంద్రాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక కేంద్రంలో 300, మరో కేంద్రంలో 1,000 మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కేంద్రాల కేటాయింపు తారు మారైంది. 300 మందికి ఉద్దేశించిన పరీక్ష కేంద్రానికి ఒకేసారి ఎక్కువమంది రావడంతో అక్కడి అధికారులు ఏపీపీఎస్సీని సంప్రదించారు. ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాల్లో అభ్యర్థులను పెద్ద కేంద్రానికి తరలించి, అక్కడే పరీక్ష రాయించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ ‘కీ’ని ఒకటి రెండు రోజుల్లో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి చివరి వారంలో ఈ పరీక్ష ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మే 20, 21 తేదీల్లో మెయిన్స్‌ నిర్వహించనున్నారు.
Published date : 27 Feb 2017 01:52PM

Photo Stories