గ్రూప్- 1 పరీక్షలు మే 26కు వాయిదా
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్-1కేడర్ పోస్టుల భర్తీకి మార్చి 31న నిర్వహించాల్సిన ప్రిలిమ్స్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.
ఈ పరీక్షలను మే 26న ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నట్లు మార్చి 13న ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్- 1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు గత కొంతకాలంగా కమిషన్‌ను కోరుతున్న విషయం తెలిసిందే. సిలబస్‌లో మార్పులు చేయడం, ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, అలాగే నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిలిమ్స్‌కు కనీసం 120 రోజుల వ్యవధి ఇవ్వాల్సి ఉన్నా లేకపోవడంతో ఈ పరీక్షలపై అభ్యర్థులు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఉద్యోగులంతా ఆ విధుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఉద్యోగులు తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 సహా పలు పరీక్షల షెడ్యూళ్లలో ఏపీపీఎస్సీ మార్పులు చేపట్టింది. అసిస్టెంట్ తెలుగు ట్రాన్‌సలేటర్, ఏఈఈ, గణాంకశాఖ అసిస్టెంట్ డైరక్టర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తదితర పోస్టుల మెయిన్‌స పరీక్షల్లోనూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని మార్చి 14న ప్రకటించే అవకాశం ఉంది.
Published date : 14 Mar 2019 05:01PM