Skip to main content

ఏపీపీఎస్సీలో త్వరలో 20 నోటిఫికేషన్లు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెలాఖరులోగా మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్- 1, గ్రూప్- 3 పోస్టులతో పాటు మరికొన్ని ఇతర పోస్టులకు కూడా నోటిఫికేషన్లు వెలువరించనుంది. మొత్తం 20 నోటిఫికేషన్లలో 2,000 పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు ఏపీపీఎస్సీ గ్రూప్- 3లో 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ పోస్టులకు ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ నిర్వహించనుంది. ప్రస్తుతం 1:50 చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేసేలా నిబంధనలు ఉన్నాయి. అయితే దాన్ని 1:12కి మార్పు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక గ్రూప్- 1 కింద 94 పోస్టులకు కూడా ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 504 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. అలాగే డిప్యూటీ సర్వేయర్లు 259, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 100, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 49, స్పెషల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 77, మెడికల్ ఆఫీసర్లు 53 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు.
Published date : 21 Dec 2016 02:24PM

Photo Stories