Skip to main content

ఏపీపీఎస్సీకే ‘కటాఫ్’ నిర్ణయాధికారం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో కటాఫ్ మార్కులపై ఇకపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్ణయం తీసుకోనుంది.
ఈ మేరకు ఏపీపీఎస్సీకే బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య 25 వేలకు మించి ఉంటే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ప్రభుత్వం ఇంతకు ముందు ఆదేశించింది. స్క్రీనింగ్ టెస్టు ద్వారా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున(1:50 నిష్పత్తి) మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలని నిబంధన విధించింది. ప్రస్తుతం ఈ విధానమే అమలవుతోంది. మెయిన్‌‌సను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తుండడంతో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలు దొరక్కపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1:50 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో రిజర్వ్‌డ్ పోస్టులకు అభ్యర్థులు లభించడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించడానికి స్క్రీనింగ్ టెస్టు ద్వారా మెయిన్స్ కు కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడానికి కటాఫ్ కింద కనీస అర్హత మార్కులను నిర్ణయించుకొనే అధికారాన్ని ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీలకు కటాఫ్ కింద కనీస అర్హత మార్కులు నిర్ణయించిసివిల్స్ తరహాలో 1:12 లేదా 1:15 నిష్పత్తిలో మెయిన్‌‌సకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య, స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన వారి సంఖ్యను అనుసరించి ఆయా కేటగిరీల వారీగా కటాఫ్‌కు కనీస అర్హత మార్కులను నిర్ణయించే అధికారం ఈ జీఓ ద్వారా ఏపీపీఎస్సీకి సంక్రమించనుంది. రిజర్వ్‌డ్ కేటగిరీల పోస్టులకు అభ్యర్థులను మెయిన్‌‌సకు ఎంపిక చేసే అవకాశం దీనివల్ల దక్కుతుంది.
Published date : 06 Jan 2018 11:14AM

Photo Stories