Skip to main content

ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి: నిరుద్యోగ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: లక్షలాది మంది నిరుద్యోగ విద్యావంతులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ ప్రాంతాలకు తరలి వెళ్తున్నందున, వారికి వెసులుబాటు కలిగేలా ఏప్రిల్‌లో నిర్వహించతలపెట్టిన ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేసింది.
ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిలకు విన్నవించారు. ఏపీపీఎస్సీ పరీక్షల కోసం హైదరాబాద్‌తో సహ వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్తే మూడు నాలుగు రోజులు వృధా అవుతుందన్న భయం అభ్యర్థుల్లో నెలకొందన్నారు. దీనిపై నిరుద్యోగులు ఏపీపీఎస్సీకి ఎన్ని వినతులు చేసినా ఏ మాత్రం ఆలోచన లేకుండా ముందుకు వెళ్తోందని ఆవేదన వ్యక్తపరిచారు. అయిదేళ్ల పాటు నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించి సరిగ్గా ఎన్నికల సమయంలో షెడ్యూల్ ఉండేలా ఏపీపీఎస్సీ తేదీలు నిర్ణయించడం అన్యాయమన్నారు. దీనిపై ఎన్నికల సంఘం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Published date : 12 Apr 2019 02:35PM

Photo Stories