ఏపీపీఎస్సీ ఇన్‌చార్జ్ చైర్మన్ నియామక ఉత్తర్వుల అమలు నిలిపివేత
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇన్‌చార్జ్ చైర్మన్‌గా జింకా రంగ జనార్దనను నియమిస్తూ కమిషన్ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు తాత్కాలికంగా మంగళవారం వరకు నిలిపేసింది.
ఈ మేరకు డిసెంబర్ 21న (శనివారం)మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జ్ చైర్మన్‌ను నియమించే అధికారం కమిషన్ కార్యదర్శికి ఎక్కడ ఉందో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిషన్ కార్యదర్శి, తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తనను చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనీయకుండా.. ఇన్‌చార్జ్ చైర్మన్‌గా జింకా రంగ జనార్దనను నియమించారంటూ ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు.
Published date : 23 Dec 2019 03:14PM