73 మందికి తహసీల్దార్లుగా పదోన్నతి
Sakshi Education
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న 73 మందికి తహసీల్దార్లుగా త్వరలో పదోన్నతి లభించనుంది.
రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డాక్టర్ మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గల శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఈ మేరకు వీరి పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ అక్టోబర్ 25న సచివాలయంలో సమావేశమై చర్చించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ కమిటీ 73 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. జోన్ల వారీగా ఎవరెవరికి పదోన్నతులు ఇవ్వాలో ఈ కమిటీ ఖరారు చేసింది. కాగా, 1999లో గ్రూప్-2కు ఎంపికై రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్లుగా విధుల్లో చేరిన వారిలో చాలామంది ఎప్పుడో తహసీల్దార్లుగా పదోన్నతులు పొందారు. వీరిలో కొందరు డిప్యూటీ కలెక్టర్లుగా కూడా పదోన్నతి పొంది రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ)గా పనిచేస్తున్నారు. అయితే ఇదే బ్యాచ్‌లో గ్రూప్-2కు ఎంపికై వేరే విభాగాల్లో చేరి తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ శాఖలోకి వచ్చిన వారు మాత్రం ఒక్క పదోన్నతికి కూడా నోచుకోకుండా డిప్యూటీ తహసీల్దార్లుగానే ఉండిపోయారు. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని వీరు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గత సర్కారు పట్టించుకోలేదు. జగన్ సర్కారు వీరి విజ్ఞప్తిపై స్పందించింది.
Published date : 26 Oct 2019 05:36PM