Skip to main content

మధ్యయుగం నాటి భారతదేశ ఆర్థిక స్వరూపం

భారతదేశ ఆర్థిక చరిత్రకు సంబంధించి మధ్యయుగం నాటి స్థితిగతులు వినూత్నమైనవి. మన దేశానికి అరబ్బుల ఆగమనం నుంచి సుగంధ ద్రవ్యాల వాణిజ్యం ఖండాంతర విస్తృతమైంది. గెజిటీర్లు, కైఫీయత్‌లు, విదేశీ రచనలు ఈ విషయాలను ధ్రువపరుస్తున్నాయి. ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడ్డాయి. దక్కన్‌లో మహమ్మద్ గవాన్, షేర్షా, అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్‌మల్ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాలు ఆనాటి రాజ వంశీయుల ఆర్థిక విధానాల విశిష్టతను తెలియజేస్తున్నాయి.
అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)మార్కెటింగ్ సంస్కరణలు
మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెటింగ్ సంస్కరణలు, ధరల నియంత్రణ విధానాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ విజేత కావాలనే ఆకాంక్షతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ పెద్ద సంఖ్యలో సైనిక బలాన్ని సమకూర్చుకున్నాడు. వారికి జీతభత్యాల రూపంలో పెద్ద మొత్తంలో చెల్లించడానికి తగిన ధనం తన ఖజానాలో లేదు. దీంతో ఏడాదికి ఒక సైనికుడికి చెల్లించే 234 టంకాల జీతంతోనే సైనికులకు అవసరమైన అశ్వాల పోషణ, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు, పశువులు మొదలైన ధరలను నిర్ణయించి వాటి అమలుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాడు. సైన్యాలుండే కేంద్రాల్లో తాను నిర్ణయించిన ధరలకే సైనికులకు వస్తువులను అమ్మడానికి కొందరు వర్తకులకు లెసైన్‌‌సలు జారీ చేశాడు. మార్కెటింగ్ సంస్కరణలను అమలు పర్చడానికి దివాన్-ఇ-రియాసత్‌కు తోడుగా మరో అధికారి షహానా-ఇ-మండిని నియమించాడు. సైనికులకు ఖిల్జీ చెల్లించే 234 టంకాల జీతంలోనే వారు తమ అన్ని అవసరాలు తీర్చుకొని కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొనేవారని ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

ఘియాసుద్దీన్ తుగ్లక్ (1320-25)
తుగ్లక్ వంశం ఢిల్లీ సుల్తానత్‌ను సుమారు దశాబ్దం పాటు పాలించింది. మొదటి పాలకుడైన ఘియాసుద్దీన్ తుగ్లక్ తన ఐదేళ్ల పాలనా కాలంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. పంట పొలాలకు కొత్త నీటి వనరులను కల్పించి భూమి శిస్తును పంటలో ఐదో వంతుకు తగ్గించాడు. నూతన రహదారుల నిర్మాణం, దొంగల బారి నుంచి ప్రజల రక్షణ, అంచెలంచెలుగా గుర్రాలపై వార్తలను పంపే తపాలా పద్ధతిని చేపట్టాడు.

మహ్మద్ బిన్ తుగ్లక్ (1325-1351)
ఘియాసుద్దీన్ కుమారుడైన జునాఖాన్... మహ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు. ఢిల్లీ సుల్తానత్ చరిత్రలోనే కాకుండా మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదుడైన సుల్తాన్‌గా ఇతణ్ని చరిత్రకారులు వర్ణించారు. ఆధునిక చరిత్రకారులు ఇతడిని ప్రిన్‌‌స ఆఫ్ మనీయర్‌‌సగా పేర్కొన్నారు. ఇతడు సింహాసనాన్ని అధిష్టించే నాటికి దేశంలో వెండి, బంగారు లోహాల కొరత ఉండటంతో నాణేల ముద్రణకు రాగిని ఉపయోగించాలని ఆదేశించాడు. అయితే నియంత్రణ లోపం వల్ల దేశంలో అనేక మంది (కంసాలి) ఇళ్లు నాణేల ముద్రణ (టంకశాల) కేంద్రాలుగా మారాయి. ఫలితంగా రాజ్యంలో ద్రవ్య చెలామణీ విపరీతంగా పెరిగి ద్రవ్యం విలువ పడిపోయింది. దీన్ని సరిదిద్దడానికి మార్కెట్లో ఉన్న నకిలీ రాగి నాణేలకు బదులు వెండి, బంగారు నాణేలను ఇచ్చే పథకాన్ని ప్రారంభించడంతో కోశాగారం దివాలా తీసింది.

ఫిరోజ్‌షా తుగ్లక్ (1351-1388)
మహ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన తర్వాత 1351లో అతని పిన తండ్రి కుమారుడైన ఫిరోజ్ షా తుగ్లక్ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు చాలావరకు యుద్ధ వ్యతిరేకి. అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అయితే హిందువులపై జిజియా పన్ను విధించాడు. ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు. ఇతడి పాలనలో భూమిశిస్తును న్యాయబద్ధంగా వసూలు చేశాడు. జాగీర్దారీ విధానాన్ని పునరుద్ధరించాడు. నీటిపారుదల అభివృద్ధి కోసం యమునా నది నుంచి ఫిరోజాబాద్‌కు, సట్లెజ్ నది నుంచి ఘాఘర్ వరకు, మండవ నుంచి హిస్సార్ వరకు కాలువలు నిర్మించాడు. ఆదా, బిఖ్ అనే రెండు కొత్త నాణేలను వెండి, రాగి మిశ్రమంతో తయారు చేయించి ప్రవేశపెట్టాడు. పేదలకు, వితంతువులకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి దివాన్-ఇ-ఖైరాత్ (దానధర్మాల శాఖ) అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో దార్-ఉల్-షఫా అనే వైద్యశాలను నెలకొల్పాడు.

దక్షిణ భారతదేశం-మధ్యయుగం- కాకతీయులు
కాకతీయ పాలకులైన రుద్రమదేవి, రెండో ప్రతాపరుద్రుడు.. తెలుగు వారందరినీ సమైక్యపర్చడమే కాకుండా సుస్థిర పాలన అందించారు. శూద్రులైన కాకతీయులు ప్రజలపై పన్నుల భారం ఎక్కువ మోపలేదు. వీరి కాలంలో కులవృత్తులు సర్వతోముఖాభివృద్ధి సాధించాయి. వివిధ రకాల ఉత్పత్తులు వర్తక, వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డాయని శాసనాలు, సమకాలీన సాహిత్యం, మార్కోపోలో రాసిన ది ట్రావెల్స్ గ్రంథం తెలియజేస్తున్నాయి. వీరి కాలంలో విదేశీ వ్యాపారం వర్ధిల్లింది. వ్యవసాయాభివృద్ధికి కాకతీయులు విశేష కృషి చేశారు. వీరి కాలంలో అనేక కాలువలు, చెరువుల నిర్మాణం జరిగింది.

దక్షిణ భారతదేశం - మధ్యయుగం - విజయనగర సామ్రాజ్యం
క్రీ.శ.1336లో హరిహర, బుక్కరాయలు సోదరులు తుంగభద్రానదీ తీరాన స్థాపించిన విజయనగర రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలకు చెందిన 29 మంది రాజులు 1680 వరకు పాలించారు. విజయనగర పాలకుల్లోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు పొందాడు. వ్యవసాయాభివృద్ధికి అనేక చెరువులు తవ్వించాడు. నాగులాపురం చెరువు ఇతని నిర్మాణమే. ఇతని కాలంలో వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. గ్రామాల్లో కుల, చేతివృత్తులు విరాజిల్లాయి. నేత, కుండలు, నూనె, వజ్రాలు, ఇనుము, ఉక్కు, బంగారు నగల పరిశ్రమలు వర్ధిల్లాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. వ్యవసాయం, పశుపోషణ ప్రధాన వృత్తులుగా కొనసాగాయి.

బహమనీ రాజ్యం (క్రీ.శ.1347-1482)
మహ్మద్ బిన్ తుగ్లక్ అధికారుల్లో ఒకడైన అల్లా ఉద్దీన్ హసన్ గంగూ బహమనీ.. గుల్బర్గా కేంద్రంగా 1347లో విజయనగర సామ్రాజ్యానికి పొరుగున తన రాజ్యాన్ని స్థాపించాడు. మహ్మద్ గవాన్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో బహమనీ రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. బహమనీ రాజ్యంలో వ్యవసాయం, పరిశ్రమలు వర్ధిల్లాయి. వీరు స్వదేశీ, విదేశీ వ్యాపార అభివృద్ధికి కృషి చేశారు. వీరి కాలంలో జిజియా పన్ను వసూలు చేశారు. దేశంలో జనాభా అధికమని, పల్లె జీవితాలు దీన స్థితిలో ఉన్నాయని, సర్దార్లు విలాస జీవితం గడిపేవారని చరిత్రకారులు పేర్కొన్నారు.

షేర్షా పాలనా సంస్కరణలు - భూమి శిస్తు విధానం (1540-45)
మధ్యయుగ పాలనా దక్షుల్లో షేర్షా పేరును ముందు వరుసలో పేర్కొనవచ్చు. ఇతడి పాలనా కాలం ఐదేళ్లే అయినా, తన విధానాల ద్వారా అక్బర్‌కి మార్గదర్శి అయ్యాడు. తనకు సహకరించడానికి నలుగురు మంత్రులను షేర్షా నియమించుకున్నాడు. వారు..
  • రాజ్య ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించి, నియంత్రించడానికిదివాన్-ఇ-వజీర్ (ఆర్థిక శాఖ అధిపతి)
  • సైనికుల నియామకం, శిక్షణ, వారి జీతభత్యాల పర్యవేక్షణకు-దివాన్-ఇ-అర్‌‌జ (రక్షణ మంత్రి)
  • విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి- దివాన్-ఇ-రసాలత్ (విదేశీ వ్యవహారాల శాఖ)
  • రాజ్యానికి సంబంధించిన ఉత్తర్వులు, సుల్తాన్ ప్రకటనలు ఇవ్వడానికిదివాన్-ఇ-ఖాస్ (ఆంతరంగిక వ్యవహారాల శాఖ) ఏర్పాటు చేసుకున్నాడు.
  • న్యాయ విషయాలను పర్యవేక్షించడానికి దివాన్-ఇ-ఖాజా (న్యాయశాఖ)
  • గూఢచర్యం వ్యవహారాలను పర్యవేక్షించడానికి దివాన్-ఇ-బరీద్ (ఇంటెలిజెన్‌‌స విభాగం)
  • షేర్షా కాలంలో రాజ్య ఆదాయంలో సింహభాగం భూమిశిస్తు ద్వారానే లభించేది.
  • అలాగే వ్యాపారంపై పన్ను, ఖమ్స్ (యుద్ధంలో సాధించిన సంపదలో 5వ భాగం) ద్వారా కూడా ఆదాయం లభించేది.
  • సైన్యం జీతభత్యాలు, యుద్ధాలు, అధికారుల జీతభత్యాలు, అంతఃపురంలోని వారి పోషణ ముఖ్యమైన ఖర్చులుగా ఉండేవి. షేర్షా భూమిశిస్తు విధానం రెండు అంశాలపై ఆధారపడి ఉండేది. అవి..
1) రైతుల సంక్షేమం
2) రాజ్యానికి అంతరాయం లేకుండా ఆదాయం సమకూరడం.

షేర్షా సంస్కరణలన్నింటిలో భూమిశిస్తు విధానం కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిలోని ముఖ్యాంశాలు..
  • భూసారాన్ని బట్టి భూమిని ఉత్తమ, మధ్యమ, అధమ అనే భాగాలుగా విభజించారు.
  • భూమిని అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన కొలతలతో కొలిచేవారు.
  • ఉత్పత్తిలో మూడో వంతు శిస్తుగా వసూలు చేసేవారు.
  • భూమి శిస్తును ధనం లేదా వస్తు రూపంలో వసూలు చేయడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉండేది.
  • భూమిశిస్తు వసూళ్లలో మధ్యవర్తుల ప్రమేయం లేదు. జమీందారీ పద్ధతిని రద్దు చేసి, రైత్వారీ పద్ధతిని అవలంబించాడు.
  • రైతులకు పట్టాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
  • రైతుల నుంచి కబూలియత్ పత్రాలను స్వీకరించాడు. రాజ్యానికి సక్రమంగా భూమి శిస్తును చెల్లిస్తామని ఇచ్చిన వాగ్దాన పత్రాలనే కబూలియత్‌లు అంటారు.
రాజ్య సంపద రైతు సంక్షేమంపైనే ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని గుర్తించిన పాలకుడు షేర్షా. కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భూమి శిస్తునుమాఫీ చేసేవాడు. రైతులకు రుణాలు మంజూరు చేశాడు. వ్యవసాయోత్పత్తులను పెంచడానికి అనేక పంట కాల్వలను తవ్వించాడు. రైతులను ఇబ్బందులకు గురిచేసే అధికారులను కఠినంగా శిక్షించాడు. అందువల్ల రైతు ఆపద్బాంధవుడిగా ఇతడిని చరిత్రకారులు పేర్కొన్నారు.

వ్యాపారాభివృద్ధికి షేర్షా అనేక పద్ధతులు అవలంబించాడు. వస్తువులపై పన్నును రెండు దఫాలు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించాడు. మొదటగా వస్తువులు రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు, తర్వాత అమ్మకం జరిగే మార్కెట్‌లో పన్ను వసూలు చేసేవారు. కొత్త రహదారులను నిర్మించడమే కాకుండా వ్యాపారస్తులకు వారి ప్రయాణాల్లో తగిన రక్షణ ఏర్పాట్లు చేశాడు. షేర్షా కాలంలో ముద్రించిన రూపాయి నాణెం 180 గ్రైనులు ఉండేది. అందులో 175 గ్రైనులు పూర్తిగా వెండి. ఇతని కాలంనాటి రూపాయే మన దేశ ఆధునిక రూపాయికి ఆధారం.

మొగల్ సామ్రాజ్యం - అక్బర్ ఆర్థిక విధానం (1556 -1605)
మధ్యయుగ భారతదేశ చరిత్రలో అక్బర్‌కు విశిష్ట స్థానముంది. ఇతడు షేర్షా విధానాలను మెరుగుపర్చి, పలు నూతన పథకాలు ప్రవేశపెట్టాడు. పరిపాలనను సమర్థంగా నిర్వహించడానికి నలుగురు మంత్రులను నియమించుకున్నాడు. వారు..
1. వకీల్ (ప్రధానమంత్రి)
2. వజీర్ (ఆర్థిక మంత్రి)
3. మీర్‌బక్షి (పెద్ద ఉద్యోగులకు జీతాలిచ్చే మంత్రి)
4. సదర్-ఉస్-సదర్ (న్యాయశాఖా మంత్రి)

అక్బర్ కాలంలో మొదటి ఆర్థిక మంత్రి ముజఫర్ ఖాన్. ఇతడు అక్బర్‌ను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల బర్తరఫ్ అయ్యాడు. తర్వాత ఇతని స్థానంలో రాజా తోడర్‌మల్ నియమితుడయ్యాడు. అక్బర్ ఆర్థిక విధానం విశిష్టమైంది. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఖరాత్, ఖామ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులను మాత్రమే పాలకుడు విధించాలి. జకాత్, జిజియా మతపరమైన పన్నులు. అయితే అక్బర్ జిజియా, తీర్థయాత్రలపై పన్నులను రద్దు చేసి పాలనలో సమన్యాయాన్ని పాటించాడు. తోడర్‌మల్ రూపొందించిన భూమిశిస్తు విధానాన్ని బందోబస్త్ అంటారు. దీనిలో మూడు ముఖ్య సూత్రాలున్నాయి. అవి..
1. భూమిని సర్వే చేయించి, సక్రమంగా కొలిపించడం;
2. భూమిని వర్గీకరించడం.
3. భూమిశిస్తును నిర్ణయించడం.

సాగుబడిలో ఉన్న భూములను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. మొదటి రకం భూమి-పోలాజ్. ఈ భూముల నుంచి ప్రతి ఏటా పంట దిగుబడి ఉంటుంది.
2. రెండో రకం భూమి-పరౌటి. రెండు పంటలకు మధ్య ఒకటి లేదా రెండేళ్లు బీడుగా ఉండేది.
3. మూడో రకం భూమి-చాచార్. రెండు పంటల మధ్య మూడు లేదా నాలుగేళ్లు బీడుగా ఉండేది.
4. నాలుగో రకం భూమి-బంజర్. ఇది అసలు సేద్యానికి పనికిరాని భూమి.

ప్రతి రకం భూమిలో సరాసరి దిగుబడి నిర్ణయించి అందులో మూడో వంతును శిస్తుగా వసూలు చేసేవారు. భూమి శిస్తును ధనం లేదా ధాన్య రూపంలో చెల్లించవచ్చు.
  • శిస్తు వసూలుకు మధ్యవర్తులు లేరు. అధికారులు శిస్తుకు మించి వసూలు చేయకూడదు.
  • కరువులు, వర్షాభావ పరిస్థితుల్లో శిస్తు వసూళ్లను నిలిపివేస్తారు.
  • రైతులకు అవసరమైన సమయాల్లో స్వల్ప వడ్డీలపై అప్పులిస్తారు. వాటిని సులభ వాయిదాల్లో వసూలు చేస్తారు.
మొగల్ సామ్రాజ్యం - షాజహాన్ - స్వర్ణయుగం (1628-1658)
 చాలామంది చరిత్రకారులు షాజహాన్ పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా వర్ణించారు. ఇతడు మున్సబ్‌దారీ విధానంలోని లోపాలను సవరించి, ప్రభుత్వ ఆర్థిక వనరులను పెంచాడు. ఇతని కాలంలో మొగల్ సామ్రాజ్యం సుభిక్షంగా ఉంది. 1630-31ల్లో గుజరాత్, దక్కన్‌లలో క్షామ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్నో పథకాలను చేపట్టాడు. దానిలో భాగంగా బుర్హాస్‌పూర్, సూరత్, అహ్మద్‌నగర్‌లలో ఉచిత భోజన శాలలు ఏర్పాటు చేశాడు. శాశ్వత కరువు నివారణ కార్యక్రమంలో భాగంగా పంట కాల్వల నిర్మాణం చేపట్టి అనేక మందికి ఉపాధి కల్పించాడు. ఇతడి సామ్రాజ్యంలో అనేక పరిశ్రమలను స్థాపించడం వల్ల ఉత్పత్తులు పెరిగాయి. ఆగ్రాలో అనేక పరిశ్రమలు నెలకొల్పాడు. వాటిలో బంగారం పనివారు,రంగులు వేసేవారు, దర్జీలు, పాదరక్షలు తయారు చేసేవారు తమ తమ వృత్తుల్లో నైపుణ్యం ప్రదర్శించారు. దేశం మొత్తంలో బెంగాల్, గుజరాత్‌లు అత్యంత సౌభాగ్యవంతమైనవిగా ఖ్యాతి గడించాయి. యూరప్, ఆసియా దేశాలతో వాణిజ్యం వల్ల రాజ్యానికి బాగా లాభం చేకూరింది.
Published date : 02 Mar 2017 04:39PM

Photo Stories