Skip to main content

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్టోబర్‌ 15, 2019 న వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు.
ఎందుకు..?
రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి ఆర్ధికంగా చేయూతనివ్వడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పంట దిగుబడిని పెంచాలనే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

అర్హులెవరు..?
భూ యజమానులతోపాటు, ఎటువంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలురైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) రైతులకూ రైతు భరోసా వర్తిస్తుంది. రైతు కుటుంబంలో అవివాహ కుమారుడికి కానీ, కుమార్తెకు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆ రైతుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి ప్రస్తుత మరియు పదవీకాలం ముగిసిన మంత్రులు, ఏంపీలు, ఎంఎల్‌ఏలు, ఎమ్మెల్సీలు తప్ప మిగతా పౌరులందరూ అర్హులే.

ఆర్థికసాయం ఏ విధంగా అందుతుంది?
ఈ పథకం కింద ప్రతి రైతు కుంటుంబానికి ఏడాదికి రూ.13,500 చొప్పున వ్యవసాయానికి పెట్టుబడిగా అందిస్తున్నారు. కేంద్రప్రభుత్వ పథకమైన పీఎమ్‌ కిసాన్‌ కింద వచ్చే రూ. 6000 రూపాయలతోపాటు, రాష్ట్రప్రభుత్వం సాగు భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి మూడు వాయిదాలలో ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రూ. 13,5000 లను సాయంగా అందిస్తుంది. అలాగే గిరిజన రైతులకు రూ.11,500 చొప్పును పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ విధంగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 లు అందుతుంది. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను లాండ్‌ఓనర్‌షిప్‌ డేటాబేస్‌ ద్వారా గుర్తించి, వారి ఖాతాల్లోకే నేరుగా జమ చేయడం జరుగుతుంది.

ప్రతి ఏడాది ఈ కింద సూచించిన మూడు విడతలుగా ప్రభుత్వం సాయం అందిస్తుంది..
  • మే నెలలో మెదటి విడత: రూ. 7500/– (పీఎమ్‌ కిసాన్‌ పధకంలోని రూ. 2000/–లతో కలిపి)
  • అక్టోబర్‌ నెలలో రెండో విడత: రూ. 4000/– (పీమ్‌ కిసాన్‌ పధకంలోని రూ. 2000/–లతో కలిపి)
  • జనవరి నెలలో మూడో విడత: పీమ్‌ కిసాన్‌ పధకంలోని రూ. 2000/–

అంతేకాకుండా ఈ పథకం కింద రైతులకు సున్నా వడ్డీకే ఋణాలు, రోజుకు 9 గంటల చొప్పున ఉచిత కరెంటు, ఉచితంగా బోర్లు వేయించడం, రైతులకు సంబంధించిన ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌నుంచి మినహాయింపు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో పంట నష్టాన్ని అంచనా వేసి నెలరోజుల్లోపే పరిహారం చెల్లిస్తారు.

వైఎస్సార్‌ రైతు భరోసా హెల్ప్‌లైన్‌ నెంబర్‌:
ఏదైనా కారణం చేత ఈ ఫథకం అందనివారు హెల్ప్‌లైన్‌ నెంబర్‌– 1902ను సంప్రదించవచ్చు.

రైతు భరోసా కేంద్రాలు:
మే 30, 2020న రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు నుంచి పంట అమ్మకం వరకు సూచనలు, సలహాలు అందిస్తాయి. పంటరుణాలు, ఇన్య్సూరెన్స్, గిట్టుబాటు ధరలు కల్పించేలా పనిచేస్తాయి. రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ మేగజైన్లు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. వైఎస్సార్‌ రైతు భరోసా అనే మాస పత్రిక కూడా రైతులకు సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆర్‌బీకే చానల్‌ కూడా రైతుల్లో సాగు నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రారంభించారు. దీనిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు యూట్యూబ్‌ ద్వారా నేరుగా మొబైల్‌ ఫోన్లలో లైవ్‌ టెలికాస్ట్‌ అవుతాయి.

రైతు భరోసా కేంద్రాల కాల్‌సెంటర్‌ నెంబర్‌:
కాల్‌సెంటర్‌ నెంబర్‌– 155251 ద్వారా రైతు భరోసా కేంద్రాలు రైతులకు సూచనలు సలహాలు అందిస్తాయి.
Published date : 12 Jun 2021 03:34PM

Photo Stories