భారతదేశం- పేదరికం
పేదరికం నిర్వచనాలు
- ఎవరైతే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేక పోతున్నారో వారిని పేదలుగా పరిగణించవచ్చు.- ప్రపంచ బ్యాంకు.
- ‘పేదరికం అనుభవించేవారి బాధను గుడ్డివారు కూడా చూడగలరు’’ - ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్
- ‘పేదరికమనే సముద్రపు దీవుల్లో మనం ఎంతమాత్రం సంతోషంగా జీవించలేం’-ఎం.ఎస్. స్వామినాథన్
- పేదరికం అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన - జస్టిస్. కె.జి. బాలక్రిష్ణన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
పేదరికాన్ని కేవలం ఆర్థికపరమైన సమస్యగానే కాకుండా సాంఘిక సమస్యగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. మానవాభివృద్ధి నివేదిక ప్రకారం.. ‘దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలు, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం కొరవడటమే పేదరికం’. ‘అధిక పేదరికం, అధిక సంపదలు సమాజంలో వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకి అవుతాయి, ప్రపంచంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులంతా మధ్య తరగతి నుంచివచ్చినవారే. అందుకే ఆర్థిక శక్తులు సమానంగా, సంతులితంగా సమాజంలో సర్దుబాటు కావాలి’ అని స్వామి వివేకానంద పేర్కొన్నారు.
పేదరికాన్ని రెండు రకాలుగా పేర్కొనొచ్చు. అవి..
1. నిరపేక్ష పేదరికం (Absolute Poverty)
2. సాపేక్ష పేదరికం (RelativePoverty)
1. నిరపేక్ష పేదరికం: దేశంలోని ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని, జీవనాధార వ్యయాన్ని కూడా చేయలేని పరిస్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమైన పేదరికం ఉంటుంది.
2. సాపేక్ష పేదరికం: వివిధ వ్యక్తులకు లేదా గ్రూపులకు అందుబాటులో ఉన్న వనరులు, వేతనం, సంపద తదితర అంశాల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. సమాజంలో 5% నుంచి 10% మంది సంపన్న వర్గాల ప్రజల జీవన ప్రమాణంతో పోల్చితే కింది స్థాయిలోని 5% నుంచి10% ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. సంపన్న వర్గంలోని ప్రజల ఆదాయాలతో పోల్చితే దిగువ వర్గంలోని వారి ఆదాయాలు తక్కువగా ఉన్నప్పటికీ వారు దారిద్య్రాన్ని అనుభవిస్తున్నవారు కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రకమైన పేదరికం ఉంటుంది. దీన్ని లారెంజ్ వ్యతిరేక లేదా గిని గుణకం ద్వారా లెక్కిస్తారు.
భారతదేశం పేదరికం - అంచనాలు
స్వాతంత్య్రానికి పూర్వం దాదాబాయ్ నౌరోజీ తన గ్రంథమైన "Poverty and Unbritish Rule in India‘ లో జైళ్లలోని ఖైదీల కనీస పౌష్టికాహారం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. స్వాతంత్య్రానంతరం అనేక మంది ఆర్థికవేత్తలు పేదరికాన్ని అంచనా వేశారు. వారిలో పి.డి. ఓఝా, దండేకర్, నీలకంఠ రాథ్, మిన్హాస్, పీకే బర్దన్, మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియా, గౌరవదత్, రావెల్లిస్, లక్డవాలా (D.T. Lakdawala- Expert Group Chairman 1989) తదితరులు ముఖ్యులు.
1960 పూర్వం పేదరికానికి సంబంధించిన అంచనాల్లో వ్యత్యాసాలున్నాయి. ఆయా అంచనాలు వరుసగా.. మిన్హాస్ 37.1% , ఆహ్లూవాలియా 56.5%, పీకే బర్దన్ 54%, దండేకర్, నీలకంఠ రాథ్ 40% (1968-69). ఈ వ్యత్యాసాలకు ప్రధాన కారణం వారు తీసుకున్న గణాంకాల్లో తేడా లేనప్పటికీ వారు గణించే పద్ధతుల్లో తేడా ఉండడమే.
పేదరిక రేఖ (Poverty Line): ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సినకనీస జీవన వ్యయం ఆధారంగా పేదరిక రేఖను నిర్ణయిస్తారు. దీని కోసం ప్రణాళికాసంఘం 1989,సెప్టెంబర్‌లో డి.టి.లక్డవాలా అధ్యక్షతన నిపుణుల సంఘాన్ని నియమించింది. ఆ కమిటీ 1993 జూలైలో తమ నివేదికను సమర్పించింది. పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు లభ్యమయ్యే కేలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీలను ప్రాతిపదికగా తీసుకొన్నారు.
1973-74ను ఆధార సంవత్సరంగా తీసుకొని నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని (Monthly Per capita Consumption Expenditure - MPCE) గ్రామీణ ప్రాంతానికి రూ.49, పట్టణ ప్రాంతానికి రూ.56 నిర్ణయించారు. 2004-05కు గానూ గ్రామీణ ప్రాంతానికి రూ.356.30, పట్ణణ ప్రాంతానికి రూ.538.60, 2009-10 నాటికి గ్రామీణ ప్రాంతానికి (రోజుకు-రూ. 22.42) రూ. 672.80, పట్టణ ప్రాంతానికి (రోజుకు- రూ.28.65) రూ.859.60 నెలసరి తలసరి వినియోగ వ్యయాలుగా ఉన్నాయి. దీన్ని గమనిస్తే కాలానుగుణంగా నెలసరి తలసరి వినియోగ వ్యయం పెరుగుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ Large Sample Survey ద్వారా కుటుంబం వ్యయాన్ని అంచనా వేస్తున్నారు.
నిపుణుల సంఘం 1973-74 నుంచి 1987-88 వరకు 14 ఏళ్ల కాల వ్యవధిలో రూపొందించిన పేదరిక అంచనాలు కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
సంవత్సరం | గ్రామీణ పేదరికం | పట్టణ పేదరికం మిలియన్లలో | మొత్తం పేదరిక శాతం | గ్రామీణ పేదరిక శాతం | పట్టణ పేదరికం శాతం | మొత్తం పేదరికం శాతం |
1973-74 | 261.3 | 60.3 | 321.6 | 56.4 | 49.2 | 54.9 |
1977-78 | 264.3 | 67.7 | 332.0 | 53.1 | 47.4 | 51.8 |
1983 | 251.7 | 75.3 | 327.0 | 45.6 | 42.2 | 44.8 |
1987-88 | 229.4 | 83.3 | 312.7 | 39.1 | 40.1 | 39.3 |
కింద టేబుల్‌ను పరిశీలిస్తే గ్రామీణ పేదరికం 56.4% నుంచి 39.1% నికి తగ్గగా, పట్టణ పేదరికం 49.2% నుంచి40.1% నికి మాత్రమే తగ్గింది. 1987-88 నాటికి గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికమే ఎక్కువగా ఉంది. ఈ 14 ఏళ్ల కాలంలో మొత్తం పేదరికం 54.9% నుంచి 39.3% నికి తగ్గింది. అంటే పేదరికం 15.6% తగ్గగా సాలీనా ఇది 1.2% తగ్గింది.
1993లో లక్డవాలా అధ్యక్షతన పేదరికంపై నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్రాల మధ్య ఉండే ధరల వ్యత్యాసాన్ని బట్టి ఆయా రాష్ట్రాల ప్రత్యేక వినియోగ ధరల సూచీ ఆధారంగా పేదరికాన్ని లెక్కించాలని సూచించింది.
నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్.. వివిధ రౌండ్‌ల్లో ఇచ్చిన జనాభా శాతం, పేదరిక జనాభా వివరాలు..
- 50వ రౌండ్ (1993-94) పేదరికం 36% , పేదల జనాభా 32 కోట్లు
- 55వ రౌండ్ (1999-2000) పేదరికం 26%, పేదల జనాభా 26 కోట్లు
- 61వ రౌండ్ (2004-05) పేదరికం 27.5%, పేదల జనాభా 30 కోట్లు
- 66వ రౌండ్ (2009-10) పేదరికం 29.8%, పేదల జనాభా 35 కోట్లు
2004-05లో NSSO 61వ రౌండ్లో పేదరికాన్ని రెండు రకాలుగా లెక్కించారు. అవి..
- URP (Uniform Recall Period): దీనిలో అన్ని వస్తువులపై చేసే వ్యయాన్ని 30 రోజుల రీకాల్ పద్ధతిలో తీసుకుంటారు. అంటే మొదటి నెలలో చేసిన వ్యయాన్ని ప్రతి నెలా చేస్తారని భావించి లెక్కిస్తారు.
- MRP (Mixed Recall Period): ఇందులో తరచుగా కొనుగోలు చేయని వస్తువులైన వస్త్రాలు, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య, ఆరోగ్యం తదితర 5 రకాలవాటిపై చేసే వ్యయాన్ని 365 రోజులు ప్రాతిపదికపైన, మిగిలినవాటిని 30 రోజుల ప్రాతిపదికపైన పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేశారు. 2004-05లో URP పద్ధతి ప్రకారం పేదరికం 27.5% కాగా, MRP పద్ధతి ప్రకారం 21.8%.
2012, మార్చి 19న ప్రణాళికా సంఘం NSSO 66వ రౌండ్ గణాంకాలను విడుదల చేసింది. పేదరిక రేఖ నిర్ధారణకు గ్రామీణ ప్రాంతంలో రూ. 672.80 నెలసరి వినియోగ వ్యయం (రోజుకు రూ. 22.40 ) కాగా, పట్టణ ప్రాంతంలో నెలసరి వినియోగ వ్యయం రూ. 859.60 (రోజుకు రూ.28.60)గా నిర్ణయించారు. దీని ప్రకారం 2009-10లో మన దేశంలో 29.8% జనాభా పేదరికంలో ఉంది. ఇందులో గ్రామీణ పేదరికం 33.8% కాగా, పట్టణ పేదరికం 20.9%గా నమోదైంది.