Skip to main content

సచివాలయ పరీక్షల ఉమ్మడి సిలబస్‌పై పట్టు..కొలువు కొట్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు వేస్తు ముందుకు సాగుతుంది... గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా కొలువుల భ‌ర్తీ ప్రక్రియ సాగిస్తుంది.. గ‌త ఏడాదిలో వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం ఏకంగా 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి చేసి..మళ్లీ ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి, అలాగే వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి మ‌రో సంచలనం సృష్టించింది. ఈ సచివాలయ రాత పరీక్షల‌ను సెప్టెంబ‌ర్ 20 నుంచి 26 వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిర్వహించ‌నున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సిలబస్‌పై పట్టు సాధించడంతోపాటు మాదిరి ప్రశ్నల గురించి తెలుసుకుందాం...
ఉమ్మడి సిలబస్ అంశాలు :
  • జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్.
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్.
  • ఇంగ్లిష్-తెలుగు కాంప్రెహెన్షన్
  • జనరల్ ఇంగ్లిష్
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు.
  • జనరల్ సైన్స్, దైనందిన జీవితంలో వాటి అనువర్తనాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన పరిణామాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
  • పర్యావరణం - సుస్థిరాభివృద్ధి
  • భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి
  • భారత, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు
  • భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, రాజ్యాంగ అంశాలు, 73,74వ రాజ్యాంగ సవరణలు, పబ్లిక్ పాలసీ, సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి
  • సుపరిపాలన, ఈ గవర్నెన్స్
  • సమాజం, సామాజిక న్యాయం, హక్కులు - సమస్యలు
  • భారత ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక సర్వే-2019-20, కేంద్ర బడ్జెట్-2020-21
  • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సర్వే 2019-20, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2020-21
  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు
  • మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం, స్వయం సహాయక బృందాలు, సమాజ ఆధారిత సంస్థలు-మహిళా అభ్యున్నతి.
  • జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యత గల వర్తమాన అంశాలు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ :
  • గణితంపై పట్టున్న అభ్యర్థులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ తేలికే అని చెప్పొచ్చు. హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ విభాగాల్లో మంచి మార్కులు పొందొచ్చు.
  • అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్‌‌స, పర్ముటేషన్‌‌స-కాంబినేషన్‌‌స, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్‌షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్‌‌స, నంబర్ సిరీస్ ప్రశ్నల సాధనలో సమయం ఆదా అవుతుంది.
  • జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్ టాపిక్స్‌లో ప్రాథమిక సూత్రాల ద్వారా సదరు అంశాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వీలుంది.
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్(డీఐ)లో పట్టికలు, గ్రాఫ్‌ల రూపంలో ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆయా గ్రాఫ్‌ల కింద ఇచ్చే ప్రశ్నలను పరిష్కరించాలి. ఈ డీఐ ప్రశ్నలు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్ వంటి అర్థమెటిక్ చాప్టర్ల మేళవింపుగా ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పట్టు కోసం టేబుల్స్, బార్ చార్‌‌ట్స, పై చార్‌‌ట్స మొదలైన వాటిని విస్తృతంగా ప్రాక్టీస్ చేయాలి.

మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ :
  • అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం రీజనింగ్. వివిధ సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించే నేర్పును పరీక్షించేందుకు మెంటల్ ఎబిలిటీ విభాగం ఉపయోగపడుతుంది. కోడింగ్, డీ-కోడింగ్, నంబర్ సిరీస్, పోలికలు, ర్యాంకింగ్, రక్త సంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, వెన్ చిత్రాలు, పజిల్స్, క్యాలెండర్, గడియారాలు, రేఖాచిత్రాల గణన, తీర్మానాలు(సిలాయిజమ్స్), దిక్కులు, పాచికలు, దీర్ఘఘనం, చిహ్నాలు, వర్డ్ ఫార్మేషన్, గణిత గుర్తులు, దత్తాంశ విశ్లేషణలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఇంగ్లిష్-తెలుగు కాంప్రెహెన్షన్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా భాషల్లో ఒక పేరా ఇచ్చి.. దానికింద ప్రశ్నలు అడుగుతారు. ఇచ్చిన పేరాను వేగంగా చదివి అర్థంచేసుకొని సమాధానాలు రాసే విధంగా సన్నద్ధమవ్వాలి.

జనరల్ ఇంగ్లిష్ :
హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు వొకాబ్యులరీపై అవగాహన ఉంటే జనరల్ ఇంగ్లిష్ సులువైన విభాగం. రీడింగ్ కాంప్రెహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్‌పై దృష్టిపెట్టాలి. వీటితోపాటు స్పెల్లింగ్‌‌స, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్‌‌స, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్‌‌స, రీ అరెంజ్ ది సెంటెన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నిబంధనలు ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్‌లో పట్టు కోసం మొదట బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందాలి.

ప్రభుత్వ పథకాలు :
జననేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశ్వాసంతో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు. దాంతో ఆయన ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హామీగా ఇచ్చిన ‘నవరత్నాల’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఆ దిశగా అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను రూపొందించారు. తక్కువ సమయంలోనే అనేక సంచలనాత్మక బిల్లులను ఆమోదించారు. కాబట్టి సర్కారీ ఉద్యోగాలు చేపట్టబోయే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, కొత్తగా ఆమోదించిన బిల్లులపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకే ప్రతి పథకాన్ని, ప్రతి చట్టాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బడ్జెట్‌లో ఆయా పథకాలకు కేటాయించిన నిధులు, లబ్ధి పొందుతున్న వర్గాల వివరాలు, అందుకు సంబంధించిన గణాంకాలు, ప్రముఖ సామాజిక అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిర్ణయాల గురించి అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుంది.

మాదిరి ప్రశ్నలు :
1. ‘‘వైఎస్సార్ రైతు భరోసా’’ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో కేటాయించిన మొత్తం?
1) రూ.6,444 కోట్లు
2) రూ.7,130 కోట్లు
3) రూ.8,750 కోట్లు
4) రూ.9,100 కోట్లు

2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజును ‘‘రైతు దినోత్సవం’’గా ప్రకటించింది?
1) జూలై 7
2) జూలై 8
3) జూలై 9
4) జూలై 10

3. ‘‘వైఎస్సార్ రైతు భరోసా’’ పథకం ద్వారా ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది?
1) 64.07 లక్షల మంది
2) 58.81 లక్షల మంది
3) 49.65 లక్షల మంది
4) 43.12 లక్షల మంది

4. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న కాలంలో మత్స్యకారులకు అందించే సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల నుంచి ఎంతకు పెంచనుంది?
1) రూ.6 వేలు
2) రూ.8 వేలు
3) రూ.10 వేలు
4) రూ.12 వేలు

5. తమ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ‘‘జగనన్న అమ్మ ఒడి’’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం అందిస్తుంది?
1) రూ.15,000
2) రూ.12,000
3) రూ.10,000
4) రూ.8,000

6. మధ్యాహ్న భోజన పథకంలోని ‘కుక్ కమ్ హెల్పర్’ గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి నుంచి ఎంతకు పెంచింది?
1) రూ.1,500
2) రూ.2,000
3) రూ.2,500
4) రూ.3,000

7. ‘‘జగనన్న విద్యా దీవెన’’ పథకం ద్వారా విద్యార్థులకు ఎంత శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది?
1) 70 శాతం
2) 80 శాతం
3) 90 శాతం
4) 100 శాతం

8. 18-60 ఏళ్ల మధ్యగల ఎవరైనా వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం కింద ప్రభుత్వం ఎంత మొత్తం అందిస్తుంది?
1) రూ.20 వేలు
2) రూ.50 వేలు
3) రూ.లక్ష
4) రూ.2 లక్షలు
సమాధానాలు: 1) 3; 2) 2; 3) 1; 4) 3; 5) 1; 6) 4; 7) 4; 8) 3

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 :
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 అమలు సందర్భంగా అనేక సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షల కోణంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన చట్టంలో సెక్షన్ 8ని చదవాలి. రెండు రాష్ట్రాల మధ్యనదీ జలాల పంపిణీపై వివాదాలు.. షెడ్యూల్ 9,10లో ఉన్న విభజన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురుకాబోయే ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగుల పంపకం, స్థానికత సమస్యలు, వివిధ రంగాలపై ప్రభావం, ప్రభుత్వ వనరుల కొరత, మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ప్రత్యేక హోదా తదితర అంశాలను చదవడం అభ్యర్థులకు లాభిస్తుంది.

మహిళా సాధికారత-స్వయం సహాయక బృందాలు :
రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై దృష్టిపెట్టాలి. అలాగే స్వయం సహాయక బృందాలపైనా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. మహిళా సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న చేయూత, ఆర్థిక సహాయం, ఇప్పటివరకు కేటాయించిన నిధులు తదితర సమాచారాన్ని సేకరించుకోవాలి. రాజ్యాంగపరంగా మహిళలకు ఉన్న ప్రత్యేక ఆర్టికల్స్, సంరక్షణ చట్టాలు, మహిళా రిజర్వేషన్ల వివరాలు, సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత, జాతీయ విధానాలు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, స్వయం సహాయక గ్రూపులు-రకాలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న పథకాలు, సంస్థలు-వాటి అధిపతులు మొదలైన వివరాలు తెలుసుకోవాలి.

ఆర్థిక వ్యవస్థ :
  • దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల అధ్యయనం తప్పనిసరి. ఇందులో పరీక్షల పరంగా భారత ఆర్థిక సర్వే 2019-20, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2019-20, కేంద్ర బడ్జెట్-2020-21, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2020-21 అత్యంత కీలకమైనవి. వీటి నుంచి ప్రశ్నల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
  • భారత ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయం, దాని ముఖ్య భావనలను అర్థం చేసుకోవాలి. స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయోత్పత్తి భావనలను అర్థం చేసుకోవాలి. జాతీయ ఆదాయ ధోరణులు, ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు?, రంగాలు ఏంటి, మానవాభివృద్ధి సూచీ, పేదరికం, నిరుద్యోగం-ప్రభుత్వ పథకాలు, భారతదేశ ప్రణాళికలు, ప్రణాళిక రచనలు -సంబంధించిన సంస్థలు, ప్రణాళిక సంఘం, జాతీయాభివృద్ధి మండలి, పంచవర్ష ప్రణాళికలు-వ్యూహాలు-కాలం-ప్రత్యేకతలు, నీతి ఆయోగ్ వంటి ముఖ్యమైన అంశాలను చూసుకోవాలి.
  • దేశ ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, ద్రవ్యోల్బణం, భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ-స్వరూపం, వాణిజ్య బ్యాంకులు, బ్యాంకులకు సంబంధించిన పదజాలం, ఆర్థిక సంస్థలు-వాటి అధిపతులు గుర్తించుకోవాలి. ఆర్థిక సంఘాలు, పన్ను విధానాలు, రెవెన్యూ వ్యయం, బడ్జెట్ ప్రధానాంశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు క్షుణ్నంగా చదవుకోవాలి. ప్రధానంగా భారత ఆర్థిక సర్వే 2019-20 నుంచికూడా ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువగా ఉంది.
  • దేశ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగంలో భారతదేశం సాధించిన విజయాలు, వాటికి సంబంధించిన గణాంకాలను బేరీజు వేస్తూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. బడ్జెట్ 2020-21కి సంబంధించిన ముఖ్యాంశాలను చదువుకోవాలి. వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు, బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి.
  • అలానే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన అధ్యయనం అవసరం. వ్యవసాయ రంగం, సేవారంగం, పారిశ్రామిక రంగాలు.. ఆదాయాల్లో వాటి వాటాలు, వృద్ధి రేట్లు చూసుకోవాలి. రాష్ట్రంలో అవినీతి రహిత, సుస్థిర పాలన అందించడం ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం తమ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కుల,మత రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి పథకాలను అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమాచారాన్ని ఆర్థిక సర్వేలో తెలిపింది. అలానే, సర్వేలో పేర్కొన్న వివిధ గణాంకాలను గుర్తించుకునే ప్రయత్నం చేయాలి.
సుపరిపాలన, ఈ- గవర్నెన్స్ :
  • ప్రజలు అవినీతిరహిత పాలనను కోరుకుంటున్నారు. అందుకే ప్రభుత్వాలు ప్రజలందరికి మెరుగైన సేవలందించడానికి కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలన అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుపరిపాలనకు నడుం బిగించింది. ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులు సుపరిపాలన ప్రధాన లక్షణాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు పాలనకు చట్టబద్ధత ఉండాలి, సమన్యాయం పాటించాలి, ప్రభుత్వ నిర్ణయాల్లో హేతుబద్ధత, పారదర్శకత ఉండాలి, జాప్యం, లంచగొండితనం లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలి, మానవ హక్కులపై గౌరవం ఉండాలి. జవాబుదారీతనం, భాగస్వామ్యం, పారదర్శకత, సమర్థత లాంటి సుపరిపాలన ముఖ్యాంశాలను అర్థం చేసుకోవాలి.
  • భారతదేశంలో సుపరిపాలన కోసం చేపట్టిన చర్యలు తెలుసుకోవాలి. ఆధార్‌కార్డు, సమాచార హక్కు చట్టం, పరిపాలన సంస్కరణలు మొదలైనవి ఈ కోవకు చెందినవే. అలానే ఈ గవర్నెన్స్ కూడా పరిపాలనలో మరో ముఖ్యమైన అంశం. ఈ-గవర్నెన్స్ దశలు.. కంప్యూటరీకరణ, నెట్‌వర్కింగ్ వంటివి ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి వినియోగిస్తున్నారు. ప్రభుత్వాలు ఈ-పరిపాలనతో వ్యవస్థలు, ప్రక్రియల ద్వారా ప్రజలకు ఎలక్ట్రానిక్ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నాయి. యూఐడీ, బ్యాంకింగ్, ఈ- పంచాయితీలు, ఈ-కోర్టులు, డిజిటల్ ఇండియా మొదలైన వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మంచి మార్కులు పాందవచ్చు.

జనరల్ సైన్స్ :
  • జనరల్ సైన్స్.. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల మేళవింపుగా ఉంటుంది. సజీవులు, జీవశాస్త్రం, జంతుశాస్త్రం, మైక్రోబయాలజీ, ప్రోటీన్స్, విటమిన్స్, కండరాలు, రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అంతస్రావక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మజీవ ప్రపంచం, వ్యాధిశాస్త్రం, జన్యుసంబంధ వ్యాధులు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మొక్కలు-వర్గీకరణ చాప్టర్లు బయాలజీలో ముఖ్యమైనవి.
  • ఫిజిక్స్‌లో కాంతి, కొలతలు, ప్రమాణాలు, లేజర్ కిరణాలు, ధ్వని, ఉష్టం, అయస్కాంతత్వం, విద్యుత్, యాంత్రిక శాస్త్రం, ద్రవపదార్థాలు, ఆధునిక భౌతిక శాస్త్రం కీలకమైనవి.
  • కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, మిశ్రమాలు-ఉపయోగాలు అంశాలను దైనందిన జీవితానికి ముడిపెడుతూ ప్రశ్నలు అడిగే అవకాశముంది. వీటిలోనే పెంపకాలకు సంబంధించిన పేర్లు (ఉదాహరణకు ఎపికల్చర్ - తేనెటీగల పెంపకం, అక్వా కల్చర్- చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచడం); రెవల్యూషన్స్(ఉదాహరణకు నీలి విప్లవం (బ్లూ రెవల్యూషన్- చేపల ఉత్పత్తిని పెంచడం), పరికరాలు-ఉపయోగాలు (ఉదాహరణకు అమ్మీటర్-విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే పరికరం) వివరాలు సేకరించుకోవాలి.
  • శాస్త్ర సాంకేతిక రంగాల్లో చంద్రయాన్2 ప్రయోగం విశేషాలు, అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నోట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే భారత అంతరిక్ష కార్యక్రమాలు-వాటి విశిష్టతలు, ఇటీవల ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చదవాలి. క్షిపణి వ్యవస్థ, అణుశక్తి కార్యక్రమాల వివరాలు సేకరించుకోవాలి.
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా నేడు అత్యంత ముఖ్యమైన సాధనంగా మారింది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ అధికారికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ గురించి ప్రాథమిక సమాచారం, బేసిక్ కాన్ఫిగరేషన్, నెట్‌వర్కింగ్ బేసిక్స్, సెక్యూరిటీ, బేసిక్ టూల్స్‌పై కనీస అవగాహన అవసరం. కంప్యూటర్ అబ్రివేషన్స్ నేర్చుకోవాలి. కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ కంప్యూటర్ స్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్స్, డీబీఎంస్, ఎంఎస్ ఆఫీస్‌లకు సంబంధించి బేసిక్ టెర్మినాలజీపై పట్టు సాధించాలి.

మాదిరి ప్రశ్నలు :
1. పచ్చిగుడ్డులోని ఏ పదార్థ ప్రభావం ద్వారా మనిషి శరీరం విటమిన్ బి7/బయోటిన్‌ను వినియోగించుకోలేదు?
ఎ) ఆల్బుమిన్
బి) లెసిథిన్
సి) అవిడిన్
డి) ఏదీ కాదు
సమాధానం: సి


2. సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరముంటుంది?
ఎ) 2 మి.గ్రా.
బి) 50 మి.గ్రా.
సి) 75 మి.గ్రా.
డి) 30 మి.గ్రా.
సమాధానం: బి

3. దీర్ఘకాలిక విటమిన్ ‘ఎ’ లోపం ద్వారా కంటి కార్నియూ క్షీణించడాన్ని ఏమంటారు?
ఎ) నిక్టలోపియూ
బి) గ్జిరాఫ్తాల్మియూ
సి) కెరటో మలేసియూ
డి) ఏదీ కాదు
సమాధానం: సి

పర్యావరణం-సుస్థిరాభివృద్ధి :
గ్లోబల్ వార్మింగ్.. వాతావరణంలో మార్పులు, పర్యావరణ కాలుష్యం.. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా పోటీ పరీక్షల్లోనూ పర్యావరణం, సుస్థిరాభివృద్ధి తప్పనిసరి అంశాలుగా మారాయి. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎక్కువగా దృష్టిసారించాల్సిన సబ్జెక్టు ఇది. పర్యావరణ పరిచయం మొదలు వివిధ రకాల కాలుష్యం-దాని ప్రభావాలు, ఘనవ్యర్థాల నిర్వహణ, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పర్యావరణ ప్రభావ మదింపు(ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్), వాతావరణం-మార్పులు(క్లైమేట్ చేంజ్), గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ విచ్ఛిన్నత, పర్యావరణ ఉద్యమాలు(ఉదాహరణకు చిప్కో మూవ్‌మెంట్, సెలైంట్ వ్యాలీ ఉద్యమం), ప్రముఖ పర్యావరణ వాదులు, ఉద్యమకారులు, పర్యావరణ సంరక్షణకు ప్రపంచ దేశాల అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు-ఒప్పందాలు, ముఖ్యమైన సంస్థలు, ముఖ్యమైన రోజులు గుర్తించుకోవాలి. ఇటీవల జరిగిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి :
  • భారతదేశ చరిత్రలో ఆధునిక చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాచీన చరిత్రలో భాగంగా సింధూ నాగరికత, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, నాటి సాంస్కృతిక వ్యవహారాలు, మత ఉద్యమాలు, ఢిల్లీ సుల్తానులు, సాహిత్యం, మొగల్ సామ్రాజ్య స్థాపన, సాంస్కృతిక, మతపరమైన పరిణామాలు, యూరోపియన్ల రాక, ఈస్ట్ ఇండియా కంపెనీ-వర్తక వ్యవహారాలు, క్రిస్టియన్ మిషనరీల పాత్ర, బ్రిటీష్ పాలన, జాతీయోద్యమం, వివిధ వర్గాల స్వతంత్ర పోరాటాలు, భారత స్వాతంత్య్రం, దేశ విభజన వంటి వాటిపై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలను సామాజిక కోణంలో చదవాలి. ఆయా రాజుల కాలంలో పాలన, కవులు, వారి రచనలు, ముఖ్యమైన యుద్ధాలు, సాహిత్యం, బిరుదులు, ప్రసిద్ధ నిర్మాణాలు, ముఖ్యమైన నగరాలు, శాసనాలు చదవాలి. జాతీయోద్యమంలో తెలుగు వ్యక్తుల భాగస్వామ్యాన్ని అధ్యయనం చేయాలి.
  • భారత, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. భారతదేశంలో దీవులు, అగ్నిపర్వతాలు, పర్వత శిఖరాలు, భారతదేశ నదులు, తూర్పు కనుమలు, ఎకనామిక్ సర్వే ప్రకారం వివిధ ఆహార పంటల ఉత్పత్తిల్లో భారత్ స్థానం; ముఖ్యమైన ఖనిజాలు, విద్యుత్ ప్రాజెక్టులు, మృత్తికలు, జనాభా, హిమాలయాలు, శక్తి సంపద, రవాణా వ్యవస్థ, బహుళార్థక సాధక ప్రాజెక్టులు తెలుసుకోవాలి. అలానే ఏపీపరంగా చూసుకుంటే సరిహద్దు రాష్ట్రాలు, నదులు, ప్రాజెక్టులు, చారిత్రక, సాంస్కృతిక అంశాలు, రాష్ట్ర ఉనికి-విస్తరణ, నైసర్గిక స్వరూపం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పర్యాటక ప్రాంతాలు, పీఠభూములు, అడవులు, జిల్లాలు-ప్రత్యేకతలు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ప్రాజెక్టుల వివరాలను తెలుసుకోవాలి.

1. శాతవాహనుల కాలంలో నాటి శాసనాలను ఏ భాషలో లిఖించారు?
ఎ) సంస్కృతం
బి) తెలుగు
సి) ప్రాకృతం
డి) కన్నడ
సమాధానం: సి

2. శాతవాహనులు తమ పరిపాలనా సౌలభ్యం కోసం నగరాలను ఏమని పిలిచేవారు?
ఎ) గ్రామిణులు
బి) నిగమాలు
సి) శ్రేణులు
డి) రాష్టాలు
సమాధానం: బి

3. ఆంధ్రదేశంలో తొలిసారి బౌద్దగుహాలయాలను నిర్మించిన రాజవంశం?
ఎ) ఇక్ష్వాకులు
బి) విష్ణుకుండినులు
సి) శాతవాహనులు
డి) శాలంకాయనులు
సమాధానం: సి

73, 74 రాజ్యాంగ సవరణలు :
  • భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, రాజ్యాంగ అంశాలు; 73, 74వ రాజ్యాంగ సవరణలు, పబ్లిక్ పాలసీ, సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పరీక్షల పరంగా కీలకమైనవి. ప్రధానంగా అధిక శాతం ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థపై అడిగే అవకాశముంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ, నిర్మాణం, విధులు, 73,74వ రాజ్యాంగ సవరణలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఈ-గవర్నెన్‌‌స, రెవెన్యూ పరిపాలన, వివిధ స్థారుుల్లో ఉన్న అధికారులు- అధికారాలు-విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
  • అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశం 73వ రాజ్యాంగ సవరణ. ఇది స్థానిక సంస్థలకు ఊతమిచ్చిన రాజ్యాంగ సవరణ. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ పరమైన హోదాను ఇచ్చింది. పంచాయతీరాజ్ సంస్థలకు న్యాయరక్షణ కల్పించింది. క్షేత్రస్థారుులో ప్రాంతీయ ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టానికి దేశ ప్రజాస్వామ్యవ్యవస్థలో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఈ చట్టంలో 243 నుంచి 243 ఓ వరకు ఉన్న అధికరణాలపై అవగాహన అవసరం. నిర్వచనాలు, గ్రామసభ, రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికారాలు-విధులు, ఆదాయ వనరులు, అర్హతలు-అనర్హతలు, సీట్ల రిజర్వేషన్లు తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే వీలుంది. బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోకమెహతా కమిటీ, జి.వి.కె.రావ్ కమిటీ, ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ, సర్కారియా కమీషన్ నివేదికలు సిఫారసులపై సంపూర్ణ అవగాహన అవసరం.
  • 1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటైంది. మొదటి అంచె-నగర పంచాయతీ, రెండో అంచె-పురపాలక సంస్థలు, మూడో అంచె-నగరపాలక సంస్థలు. ఇలా పట్టణ స్థానిక సంస్థలు-నిర్మాణం రూపుదిద్దుకున్నాయి.

మాదిరి ప్రశ్నలు :
1. కింది వాటిలో సరైంది?
ఎ) 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది
బి) రాజ్యాంగం తొమ్మిదో భాగం ప్రకరణలు 243, 243ఎ నుంచి 243ఓ (16ప్రకరణలు) వరకు పంచాయతీరాజ్ సంస్థల గురించి తెలియజేస్తారుు
సి) అశోక్ మెహతా కమిటీ 1978లో చేసిన సిఫారసుల ఆధారంగా 1986లో ఉమ్మడి ఆధ్రప్రదేశ్ 330 పంచాయతీ సమితుల స్థానంలో 1096 మండల పరిషత్‌లను ఏర్పాటు చేసింది
డి) మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం 1950, హైదరాబాద్ గ్రామ పంచాయతీల చట్టం 1956లను రద్దు చేసి 1964లో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం చేశారు
1) ఎ, బి, సి మాత్రమే
2) బి, సి, డి మాత్రమే
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి, డి మాత్రమే
సమాధానం: 3

2. అశోక్ మెహతా కమిటీ సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) పంచాయతీ అంచెల్లో ఎన్నికై న అధిపతుల పదవీకాలం 4 ఏళ్లు ఉండాలి
బి)ఙ్ట్చఛగ్రామ సభలను ప్రోత్సహించాలి
సి) జిల్లా పరిషత్‌లో ఆరు రకాల సభ్యులు ఉండాలి, వీరంతా జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకోవాలి
1) ఎ, బి, సి
2) బి, సి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) పైవేవీ కాదు
సమాధానం: 1

3. స్థానిక సంస్థలపై మహాత్మా గాంధీ భావాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) వికేంద్రీకరణ ఆర్థిక విషయాలకే పరిమితం కాకుండా రాజకీయ పరిపాలన విషయాల్లో కూడా రావాలి
బి) రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సాధ్యమైనంత తక్కువగానూ, అనివార్య విషయాలకే పరిమితమై ఉండాలి
సి) గ్రామాలు సమష్టి భావనను, స్వావలంబనను పెంచి, బయట ప్రపంచం మీద ఆధారపడే అవసరం లేకుండా చేయాలి
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) సి మాత్రమే
సమాధానం: 3

4. 1970 దశకంలో పంచాయతీ సంస్థలు చాలా బలహీన పడ్డాయి. దీనికి కారణం?
ఎ) సరైన నిధులు ఇవ్వకపోవడం
బి) సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడం
సి) మితిమీరిన నియంత్రణ
డి) వీటిని రద్దుచేసి ప్రభుత్వ అధికారుల (స్పెషల్ ఆఫీసర్స్) అజమాయిషీలో ఉంచడం
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) బి, సి, డి మాత్రమే
సమాధానం: 1

5. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) మొదటి తరం పంచాయతీ వ్యవస్థ: 1960-85
బి) రెండో తరం పంచాయతీ వ్యవస్థ: 1986-93
సి) మూడో తరం పంచాయతీ వ్యవస్థ: 1994 నుంచి
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ మాత్రమే
సమాధానం: 3

కరెంట్ అఫైర్స్ :
  • పోటీ పరీక్షల్లో వర్తమాన వ్యవహారాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లోనూ దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతాయనడంలో సందేహం లేదు.
  • జాతీయ చలనచిత్ర అవార్డులు; 370, 35ఏ ఆర్టికల్స్ రద్దు, బడ్జెట్ ప్రధానాంశాలు, వరల్డ్‌కప్ విశేషాలు, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు-విజేతలు మొదలైన వాటిని అప్‌డేట్ చేసుకోవాలి.
  • సమాచార సేకరణ వనరులుగా దినపత్రికలు, టెలివిజన్, ఇంటర్నెట్, ఆర్థిక, సామాజిక వ్యవహార పత్రికలు, రేడియోలను పరిగణించవచ్చు. ఇంటర్నెట్ విషయంలో సాధ్యమైనంతవరకూ అధికారిక వెబ్‌సైట్లు అనుసరిస్తే మంచిది. వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలకు వేర్వేరుగా వెబ్‌సైట్లు ఉన్నాయి. అలానే, సబ్జెక్టులను సమకాలీన అంశాలతో కలుపుకొని చదవాలి. వీటిలో ముఖ్యంగా జాతీయ, రాష్ట్రీయ ప్రాముఖ్యమున్న అంశాలపై దృష్టిసారించాలి. జనరల్ సైన్స్, సైన్స్ - టెక్నాలజీ,ఎకానమీ, పాలిటీ తదితర సబ్జెక్టుల్లో ఈ తరహా ప్రిపరేషన్ ముఖ్యం.

మాదిరి ప్రశ్నలు :
1. 2019 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ)లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
ఎ) స్విట్జర్లాండ్
బి) స్వీడన్
సి) నార్వే
డి) డెన్మార్క్
సమాధానం:

2. 2019 జులైలో భారత్‌లోని ఏ నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది?
ఎ) లక్నో
బి) జైపూర్
సి) హైదరాబాద్
డి) కోల్‌కతా
సమాధానం: బి
Published date : 22 Aug 2019 12:37PM

Photo Stories