Skip to main content

గెలుపు గమ్యానికి..ఆత్మవిశ్వాసంతో వెళ్లండి..!

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ప్రణాళిక, ప్రిపరేషన్, రివిజన్ దశలను దాటి ఇప్పుడు అసలు పరీక్షను ఎదుర్కోవాల్సిన సమయం రానే వచ్చింది. పరీక్ష గదిలో రెండున్నర గంటల్లో వ్యవహరించే తీరే విజయావకాశాలను నిర్దేశిస్తుంది. అందువల్ల వ్యూహాత్మకంగా వ్యవహరించి గెలుపు గమ్యాన్ని అందుకునేందుకు కృషిచేయాలి.
  • ఏదైనా అధికారిక గుర్తింపు కార్డు (పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు తదితర), బ్లూ/బ్లాక్ పెన్నులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • ఓఎంఆర్ షీట్‌లో అవసరమైన అన్ని వివరాలను తప్పులు లేకుండా ఒకటికి రెండుసార్లు చూసుకొని పూర్తిచేయాలి.
  • ఓఎంఆర్ షీట్‌లో బుక్‌లెట్ కోడ్‌ను సరిగా నమోదు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సమాధానాలు గుర్తించాలి.
  • మొదటి రౌండ్‌లో మొత్తం ప్రశ్నల్లో పూర్తిగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రెండో రౌండ్‌లో ఆప్షన్స్ ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి ప్రశ్నలను అటెంప్ట్ చేయాలి. రెండు ఆప్షన్స్‌ను తొలగించగా, మిగిలిన రెండింట్లో ఏది దగ్గరగా ఉందో దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇలా మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు. పూర్తిగా తెలియని ప్రశ్నలను వదిలేయడం మంచిది.
  • డేటా ఇంటర్‌ప్రెటేషన్(డీఐ), రీజనింగ్ అంశాల నుంచి వచ్చే ప్రశ్నలను అటెంప్ట్ చేసేటప్పుడు కొద్దిపాటి స్టెప్‌లతో సరైన సమాధానం రాకుంటే.. సమయాన్ని వృథా చేయకుండా తర్వాతి ప్రశ్నకు వెళ్లాలి. ఇలాంటి వాటికి చివర్లో సమయం ఉంటే సరైన సమాధానం గుర్తించేందుకు ప్రయత్నించాలి.
  • రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబం ధించిన ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు బాగా చదివి సమాధానాలు గుర్తించాలి. ముఖ్యంగా పథకాల లక్ష్యాలు/లక్షిత వర్గాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు ఆలోచించి సమాధానాలివ్వాలి.
  • సంక్షేమ పథకాల లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు పూర్తి దృష్టి ప్రశ్నపైనే నిలిపి సమాధానాలు గుర్తించాలి.
  • మొత్తం 150 ప్రశ్నల్లో 90 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం ద్వారా విజయావకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు. అసలు ఏమీ తెలియకుండా ప్రశ్నలను అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రమాదంలో పడినట్లే!
  • అభ్యర్థులు బయట జరిగే ప్రచారాలను పట్టించుకోవద్దు. పరీక్ష కేంద్రం వద్ద అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరై, విజయసాధనకు కృషిచేయాలి.
- డా. గోపాల్‌రెడ్డి, నిపుణులు, విజయనగరం.
Published date : 04 Sep 2019 05:04PM

Photo Stories