Free Coaching for Polycet-2024: ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో ఉచిత కోచింగ్ .....ఏప్రిల్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంబం
పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరి సాంకేతిక విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఏప్రిల్ 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సి.నాగరాణి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో ఉచిత కోచింగ్ అందిస్తామని తెలిపారు.
Also Read : 20 Best Polytechnic Colleges in Andhra Pradesh
పదో తరగతి పాసైన వారితోపాటు పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి ఈ నెల 28 నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే కోచింగ్‌కు అవకాశమిస్తామని తెలిపారు. పెందుర్తి, భీమిలి ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలతోపాటు కంచరపాలెం కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ (గైస్)లో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.