Skip to main content

భారత రాజ్యాంగ రచన- రాజ్యాంగ పరిషత్

రాజ్యాంగ రచనా పద్ధతులు
సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు. రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంటు రూపొందించడం ఒకటి కాగా, రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్ లేదా సంస్థను ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాంగాన్ని రచించడం రెండోది.
ప్రపంచంలో తొలిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం అమెరికా. 1787లో ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. 1789లో ఫ్రాన్స్ లో ‘కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ’ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించారు.

భారత రాజ్యాంగ రచన
భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్ అనే భావన స్వాతంత్య్రోద్యమంలో అంతర్గతంగా ఉన్న ముఖ్య డిమాండ్. భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా 1918 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో ఒక తీర్మానం చేసింది. ఇదే విషయాన్ని 1922 జనవరి 5న యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్యం అనేది బ్రిటిషర్లు ఇచ్చే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా మహాత్మాగాంధీ పేర్కొన్నారు.
1927 మే 17న బాంబే సమావేశంలో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. అందులో భాగంగా అఖిలపక్ష కమిటీ 1928 మే 19న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని రాజ్యాంగ రచనకు నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ‘నెహ్రూ రిపోర్ట్’ అంటారు. ఇది భారతీయులు సొంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నం. ఎం.ఎన్.రాయ్ 1934లోనే రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రకటించారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీపరంగా తొలిసారి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును డిమాండ్ చేసింది. 1942లో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 1946లో కేబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం
కేబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం, ఇతర ప్రక్రియలను నిర్ణయించారు. 1946 జూలై , ఆగస్టులో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.
  • ప్రతి ప్రావిన్స్ నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున ప్రాతినిధ్యం వహించారు.
  • బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మహమ్మదీయులు, సిక్కులు, జనరల్ కేటగిరీలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించారు.
  • రాజ్యాంగ పరిషత్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. వీరిని బ్రిటిష్‌పాలిత ప్రాంతాలు లేదా గవర్నర్ ప్రావిన్స్ లనుంచి ఎన్నికైన శాసనసభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకున్నారు. నాడు మొత్తం 11 ప్రావిన్స్ లు ఉండేవి. అవి మద్రాసు, బొంబాయి, యునెటైడ్ ప్రావిన్‌‌స, బిహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్, బెంగాల్, అస్సాం.
  • 93 మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. నలుగురు సభ్యులను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ నుంచి తీసుకున్నారు.
రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ 208 స్థానాలు, ముస్లిం లీగ్ 73 స్థానాలు, యూనియనిస్ట్ ఒక స్థానం సాధించాయి.

మతాలు, సామాజిక వర్గాల వారీగా సభ్యుల సంఖ్య
హిందువులు - 160
క్రిస్టియన్లు - 7
సిక్కులు - 5
ఆంగ్లో ఇండియన్లు - 3
దళితులు - 33
మహిళలు - 15
పార్శీలు - 3
ముస్లింలు - 3
ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్‌తో ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ నుంచి నిష్ర్కమించింది. తర్వాత దేశవిభజన జరగడంతో రాజ్యాంగ పరిషత్‌లో సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఇందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 229 మంది ఎన్నికైన సభ్యులు, స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది సభ్యులు కలిపి రాజ్యాంగ సభలో స్థానాలను 229కి కుదించారు.

రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన వివిధ వర్గాల ప్రముఖులు
ముస్లింలు - మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా
సిక్కులు - సర్దార్ బలదేవ్ సింగ్, హుకుంసింగ్
మైనారిటీలు - హెచ్.సి.ముఖర్జీ
యూరోపియన్లు అఖిల భారత - ఫ్రాంక్ ఆంథోని
షెడ్యూల్డ్ కులాలు - బి.ఆర్.అంబేద్కర్
కార్మిక వర్గాలు - బాబు జగ్జీవన్ రామ్
పార్శీలు - హెచ్.పి.మోడి
అఖిల భారత మహిళా సమాఖ్య - హన్సా మెహతా
హిందూ సభ - శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్

మహిళా సభ్యులు
దుర్గాబాయి దేశ్‌ముఖ్, రాజకుమారి అమృత్‌కౌర్, విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు, హన్సా మెహతా, అమ్ముస్వామినాథన్, అన్ మాస్కెర్నె నాథ్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరి, లీలా రే, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రేణుక రే, సుచిత్రా కృపలానీ.

రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన తెలుగువారు

టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముశ్, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జీ రంగా, వీసీ కేశవరావు, ఎం.తిరుమలరావు, బొబ్బొలి రాజా రామకృష్ణ రంగారావు.

రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం
  • రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. తొలి సమావేశానికి 211(9 మంది మహిళా సభ్యులు సహా) మంది హాజరయ్యారు. ఈ సమావేశం డిసెంబర్ 12 వరకు కొనసాగింది.
  • డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్‌లో సీనియర్ సభ్యుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా(ఫ్రాన్స్ లో ఈ పద్ధతి అమల్లో ఉంది), ఫ్రాంక్ ఆంథోనిని ఉపాధ్యక్షుడిగా నియమించారు. డిసెంబర్ 11న డాక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా జె.బి.కృపలానీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హెచ్‌సీ ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత వి.టి.కృష్ణమాచారిని కూడా రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
  • అంతర్జాతీయ న్యాయవాది బెనగల్ నరసింగరావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈయన బర్మా(మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు.
ఆశయాల తీర్మానం
1946 డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రతిపాదించారు. ఈ ఆశయాల తీర్మానమే రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం. ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది.

రాజ్యాంగ పరిషత్ సమావేశాలు

ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను తయారు చేసింది. రాజ్యాంగ ముసాయిదా 1948 ఫిబ్రవరి 21న ప్రచురితమైంది. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా అందులో 2,473 చర్చకు వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 115 రోజుల్లో పరిశీలించింది. ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించి చట్టంగా మార్చింది. రాజ్యాంగ రూపకల్పన కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తం 11 సమావేశాలు జరిగాయి.
భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆ రోజు సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284. ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్
ఎన్నుకుంది.

రాజ్యాంగ పరిషత్ కమిటీలు
రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు. వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలను కూడా నియమించారు. ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైంది డ్రాప్టింగ్ (ముసాయిదా) కమిటీ. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.

రాజ్యాంగ పరిషత్ ముఖ్య కమిటీలు - అధ్యక్షులు
రాజ్యాంగ పరిషత్‌లో అతి ముఖ్యమైంది ముసాయిదా కమిటీ, అతిపెద్ద కమిటీ- సలహా కమిటీ.
ముసాయిదా కమిటీ: సభ్యుల సంఖ్య 6
చైర్మన్: బి.ఆర్.అంబేద్కర్.
సభ్యులు:
  • ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
  • అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
  • డాక్టర్ కె.యం.మున్షి
  • సయ్యద్ మహమ్మద్ సాదుల్లా
  • ఎన్.మాధవరావు (అనారోగ్య కారణంగా బి.ఎల్.మిత్తల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సభ్యుడయ్యారు)
  • టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ మరణంతో ఆయన స్థానంలో వచ్చారు.)

కమిటీ పేరు

చైర్మన్

ముసాయిదా కమిటీ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

సలహా కమిటీ, హక్కుల కమిటీ, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ

సర్దార్ వల్లభాయ్ పటేల్.

సారథ్య కమిటీ, జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, రూల్స్ కమిటీ

రాజేంద్ర ప్రసాద్

కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ

జవహర్‌లాల్ నెహ్రూ

సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ

వరదాచార్య

హౌస్ కమిటీ, చీఫ్ కమిషనర్‌‌స ప్రావిన్స్ల కమిటీ

భోగరాజు పట్టాభి సీతారామయ్య

రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ

జి.వి.మౌలాంకర్

సభా వ్యవహారాల కమిటీ

కె.యం.మున్షి

రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ, ప్రుడెన్షియల్ కమిటీ

అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

భాషా కమిటీ

మోటూరి సత్యనారాయణ


రాజ్యాంగ అమలు తేది
జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ‘లాహోర్ సమావేశం’(1929 డిసెంబర్ 31) జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు.

రాజ్యాంగ పరిషత్తు ఇతర విధులు
భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనతోపాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు.
  • 1947 జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది.
  • రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947 నవంబర్ 17న సమావేశమై మొదటి స్పీకర్‌గా జి.వి.మౌలాంకర్‌ను ఎన్నుకుంది.
  • భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగును గుర్తించింది.
  • దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా 1949 సెప్టెంబర్ 14న ఆమోదించింది.
  • కామన్‌వెల్త్‌లో భారత సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది.
  • తొలి రాష్ర్టపతిగా రాజేంద్రప్రసాద్‌ను 1950 జనవరి 24న ఎన్నుకుంది (అప్పటి వరకు ఎన్నికైన పార్లమెంటు ఏర్పడలేదు కాబట్టి).
  • 1950 జనవరి 24న జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది.
సబ్ కమిటీలు

కమిటీ పేరు

చైర్మన్

ప్రాథమిక హక్కుల ఉప కమిటీ

జె.బి. కృపలాని

మైనారిటీల సబ్ కమిటీ

హెచ్.సి.ముఖర్జీ

ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ

గోపినాథ్ బోర్డోలాయ్

ప్రత్యేక ప్రాంతాల కమిటీ

ఎ.వి.టక్కర్


రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి
రాజ్యాంగ రచనలో పరిషత్తు ఏ అంశాన్నీ ఓటింగ్ ద్వారా ఆమోదించలేదు. ప్రతి ప్రతిపాదనను, సమస్యను సుదీర్ఘంగా చర్చించి సర్దుబాటు, సమన్వయం లేదా ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిష్కరించిందని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు ‘గ్రాన్‌విలె ఆస్టిన్’ పేర్కొన్నారు.

సమ్మతి పద్ధతి (Consensus)
ఒక సమస్య లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారా దాదాపు అందరు సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతి. ఈ పద్ధతి ద్వారా సమాఖ్య వ్యవస్థ, ప్రాంతాల ప్రత్యేకత, భాషకు సంబంధించిన అంశాలను పరిష్కరించారు.

సమన్వయ పద్ధతి (Accommodation)
ఒక సమస్యపై మధ్యే మార్గాన్ని సాధించడం. పరస్పర వ్యతిరేక వాదనలు ఉన్నప్పుడు సుదీర్ఘంగా చర్చించి గుణ దోషాలపై వివేచనతో, తర్కబద్ధంగా ఒక అభిప్రాయానికి రావడం. భారత రాజ్యాంగంలోని చాలా అంశాలను ఈ పద్ధతి ద్వారానే అంగీకరించారు.

రాజ్యాంగం - ముఖ్య ఆధారాలు
భారత రాజ్యాంగ రచనపై ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది. వివిధ దేశాల్లోని రాజ్యాంగాల్లో ఉన్న ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే భారత రాజ్యాంగాన్ని ‘అతుకుల బొంత’ అంటారు. మన రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం-1935. అందుకే రాజ్యాంగాన్ని ‘1935 చట్టానికి నకలు’గా అభివర్ణిస్తారు.

ఆధారం

గ్రహించిన అంశాలు

1935 చట్టం కేంద్ర, రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ కోర్టు, రాష్ర్టపతి పాలన (ఆర్టికల్ 356), గవర్నర్ పదవి, విచక్షణాధికారాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇతర పరిపాలన అంశాలు.
బ్రిటిష్ రాజ్యాంగం పార్లమెంటు/కేబినెట్ తరహా పాలనా పద్ధతి, ద్విసభా పద్ధతి, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ మొదలైన పదవులు, రిట్లు జారీచేసే విధానం.
అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ, ఉప రాష్ర్టపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ర్టపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.
కెనడా బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ నియామక పద్ధతి. రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ఆర్టికల్ 143 ప్రకారం రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహా కోరడం.
ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశిక సుత్రాలు, రాష్ర్టపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.
వైమార్ రిపబ్లిక్(జర్మనీ) జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం మొదలైనవి. (వైమార్ అనేది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరం).
ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం (బిల్లు ఆమోదం విషయంలో వివాదం తలెత్తితే), వాణిజ్య, వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట వ్యాపారం.
దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి.
ఫ్రాన్స్ గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.
రష్యా ప్రాథమిక విధులు, దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు.
జపాన్ నిబంధన 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి.
స్విట్జర్లాండ్ ప్రధాని, మంత్రిమండలి మధ్య సమష్టి బాధ్యత.

భారత రాజ్యాంగంలో మౌలికాంశాలు
భారత రాజ్యాంగంలో కింది లక్షణాలను స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాం.
  • రాష్ర్టపతిని ఎన్నుకునే నియోజక గణం
  • పంచాయతీరాజ్ వ్యవస్థ
  • అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు.
  • రక్షిత వివక్షత
  • ఆర్థిక సంఘం, కేంద్ర, రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్, భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలు.
  • ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ
  • అఖిల భారత సర్వీసులు
  • ఏక పౌరసత్వం
రాజ్యాంగ పరిషత్తు-అదనపు, విశిష్ట సమాచారం
  • రాజ్యాంగ పరిషత్తు రచనకు అయిన ఖర్చు - రూ. 64 లక్షలు.
  • భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య - 60
  • రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య - 15. ముఖ్య నామినేటెడ్ సభ్యులు.. సర్వేపల్లి రాధాకృష్ణన్, కె.టి.షా
  • రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు - బి.యన్.రావు, ఎస్.వరదాచారియర్, హెచ్.వి.కామత్.
  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించింది- అనంత శయనం అయ్యంగార్
  • బి.ఆర్.అంబేద్కర్‌ను ‘నైపుణ్యం ఉన్న పెలైట్’గా పేర్కొంది- డాక్టర్ రాజేంద్రప్రసాద్
  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావును ‘పెట్టీ ఫోరం’ అంటారు.
  • డాక్టర్ బి.ఎన్.రావును ‘రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త’గా పేర్కొంటారు.
  • రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది -హెచ్.వి.కామత్.
  • రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా వ్యవహరించింది - హెచ్.బి.అయ్యంగార్
  • రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించినవారు - సోమనాథ్ లహరి
  • రాజ్యాంగ విధులను నిర్వర్తించే సమయంలో మాత్రమే డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు.
  • రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులు నిర్వహించినప్పుడు జి.వి.మౌలాంకర్ స్పీకర్‌గా వ్యవహరించారు. అనంత శయనం అయ్యంగార్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ మాట్లాడారు.
  • రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్ - ప్రేమ్ బెహారి నారాయిణ్ రైజ్దా. రాజ్యాంగానికి, ప్రవేశికకు ఆర్‌‌ట వర్‌‌క చేసింది - నందన్ లాల్ బోస్.
  • హన్సా మెహతా భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తులో సమర్పించారు.
  • మౌలిక రాజ్యాంగ ప్రతిని పార్లమెంట్ గ్రంథాలయంలో భద్రపరిచారు. మౌలిక రాజ్యాంగంలో 230 పేజీలు ఉన్నాయి.
రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం పనితీరుపై విమర్శ
  • రాజ్యాంగ పరిషత్తు సార్వభౌమ సంస్థ కాదు. ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం 28 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది.
  • ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి అవసరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అవరోధం కల్పించింది.
  • స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు నామినేషన్ పద్ధతి ద్వారా సభ్యత్వం పొందడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.
  • రాజ్యాంగ పద్ధతిలో ఒక వర్గం (హిందువులు) ఆధిపత్యం ఉండేదని పాశ్చాత్య రచయితల అభిప్రాయం.
రాజ్యాంగ పరిషత్ సమావేశాలు

సమావేశాలు

కాలం

పని విధానం - దశలు

మొదటి సమావేశం

రెండో సమావేశం

మూడో సమావేశం

నాలుగో సమావేశం

అయిదో సమావేశం

ఆరో సమావేశం

1946 డిసెంబర్ 09-23

1947 జనవరి 20-25

1947 ఏప్రిల్ 28-మే 02

1947 జూలై 14-31

1947 ఆగస్టు 14-30

1948 జనవరి 27

I. ఈ దశలో రాజ్యాంగ రచన విధుల్ని నిర్వర్తించింది.

ఏడో సమావేశం

ఎనిమిదో సమావేశం

తొమ్మిదో సమావేశం

పదో సమావేశం

1948 నవంబర్ 4 నుంచి

1949 మే 16 - జూన్ 16

1949 జూలై 30 - సెప్టెంబర్ 18

1949 అక్టోబర్ 6-17

II. రాజ్యాంగ రచన విధులతో పాటు 1949 జనవరి 08 తాత్కాలిక పార్లమెంటు విధులను కూడా నిర్వర్తించింది.

పదకొండో సమావేశం

1949 నవంబర్ 14-26

III. 1949 నుంచి 1952 వరకు కేవలం తాత్కాలిక పార్లమెంటు విధులను మాత్రమే నిర్వర్తించింది.


ముఖ్య ప్రపంచ రాజ్యాంగాల రచనా కాలం- తులనాత్మక పరిశీలన

దేశం

ప్రకరణల సంఖ్య

రచనకు పట్టిన కాల వ్యవధి

అమెరికా

7

నాలుగు నెలల కంటే తక్కువ కాలం

కెనడా

147

2 సంవత్సరాల 6 నెలలు

ఆస్ట్రేలియా

126

9 సంవత్సరాలు

దక్షిణాఫ్రికా

153

1 సంవత్సరం

భారతదేశం

395

2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు

 
రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు
  • భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినవారు -హెచ్.వి.కామత్
  • భారత రాజ్యాంగం ప్రజల అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది. పరిషత్తుకు సార్వభౌమాధికారం లేదనే వాదనను తిరస్కరిస్తున్నా. - జవహర్‌లాల్ నెహ్రూ
  • భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది - సర్ ఐవర్ జెన్నింగ్స్
  • అతుకుల బొంత. రాజ్యాంగ పరిషత్తులో గ్యాంగ్ ఆఫ్ ఫోర్: నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్ - గ్రాన్‌విల్ ఆస్టిన్
  • భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు; రాజ్యాంగం వైఫల్యం చెందితే దాన్ని నిందించరాదు. అమలు చేసే వారినే నిందించాలి - బి.ఆర్.అంబేద్కర్
  • రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. - లార్డ్ సైమన్
  • రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. - విన్‌స్టన్ చర్చిల్
గతంలో వచ్చిన ప్రశ్నలు

1. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది?
ఎ) రూల్స్ కమిటీ - రాజేంద్రప్రసాద్
బి) అడ్వయిజరీ కమిటీ - పటేల్
సి) స్టీరింగ్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం - జె.బి.కృపలాని

Published date : 16 Oct 2015 07:08PM

Photo Stories