Intermediate Exams 2024: ప్రతి మండలంలోనూ రెండు ఇంటర్మీడియెట్ కళాశాలలు ఉండాలని ఉత్తర్వులు
కంకిపాడు: పేద, మధ్య తరగతి వర్గాలకు ఇంటర్మీడియెట్ విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. జూనియర్ కళాశాల అందుబాటులో లేక చదువులకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తకూడదనే భావనతో ప్రతి మండలంలోనూ ఇంటర్మీడియెట్ విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా పరిషత్ పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్‌లను ఏర్పాటుచేసి ఇంటర్ విద్యను అందిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి మండలంలోనూ రెండు
ఇంటర్మీడియెట్ కళాశాలలు ఉండాలని పాఠశాల విద్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. రెండింటిలో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగానూ, మరొకటి సహ విద్య (కోఎడ్యుకేషన్) ఉండాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో కోఎడ్యుకేషన్ లేని 18 మండలాలను గుర్తించారు. మండలానికి ఒక సహ విద్యను ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇంటర్మీడియెట్ విద్య అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
18 మండలాల్లో ప్రారంభానికి చర్యలు...
2022–23 విద్యా సంవత్సరానికి బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైస్కూల్ ప్లస్ కేంద్రాలను కొనసాగిస్తూ పాఠశాల విద్య సంచాలకులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటితో పాటుగా 2024–25 విద్యా సంవత్సరానికి మండలానికి రెండు ఇంటర్మీడియెట్ కళాశాలలు ఉండేలా కో ఎడ్యుకేషన్‌ను ప్రారంభించాలని సూచించారు. వీటికి హైస్కూల్ ప్లస్‌గా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని అవనిగడ్డ, బంటుమిల్లి, మొవ్వ క్షేత్రయ్య జూనియర్ కాలేజ్, నందివాడ, పామర్రు, పెడన, ఉయ్యూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సహ విద్య అమల్లో ఉంది.
వీటితో పాటుగా వీరవల్లి జెడ్‌పీహెచ్‌ఎస్, చల్లపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్, దావాజిగూడెం జెడ్‌పీహెచ్‌ఎస్, శ్రీకాకుళం జెడ్‌పీహెచ్‌ఎస్, ఎస్‌జివిఎస్‌జి బేతవోలు ఎంపిఎల్ హైస్కూల్, కౌతవరం జెడ్‌పీహెచ్‌ఎస్, గూడూరు జెడ్‌పీహెచ్‌ఎస్, కంకిపాడు జెడ్‌పీహెచ్‌ఎస్, వి.కొత్తపాలెం జెడ్‌పీహెచ్‌ఎస్, సంగమూడి జెడ్‌పీహెచ్‌ఎస్, చిన్నాపురం జెడ్‌పీహెచ్‌ఎస్, పెద్దకళ్లేపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్, తలగడదీవి జెడ్‌పీహెచ్‌ఎస్, చోరగుడి జెడ్‌పీహెచ్‌ఎస్, వెంట్రప్రగడ జెడ్‌పీహెచ్‌ఎస్, కానూరు జెడ్‌పీహెచ్‌ఎస్, పెనమకూరు జెడ్‌పీహెచ్‌ఎస్, ఉంగుటూరు పాఠశాలలను హైస్కూల్‌ప్లస్ సహవిద్యకు ఎంపికచేశారు.
జూన్ 1 నుంచి తరగతులు....
హైస్కూల్‌ప్లస్‌లలో ఈ ఏడాది జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో ఏవైనా రెండు గ్రూపులను ఏర్పాటుచేసుకోవాలని, ఒక్కో గ్రూపునకు 40 మంది విద్యార్థులు ఉండాలని పేర్కొంది.
జిల్లాలో బాలికల హైస్కూల్‌ప్లస్ కేంద్రాలు....
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బాలికల హైస్కూల్‌ప్లస్ కేంద్రాలు ఆయా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నడుస్తున్నాయి. అవనిగడ్డ, పెద్ద తుమ్మిడి, బాపులపాడు, చల్లపల్లి, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, అంగలూరు, మల్లవోలు, పునాదిపాడు, స్వతంత్రపురం, పోడు, ఎల్ ఎల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (మచిలీపట్నం), మోపిదేవి, నిడుమోలు, నాగాయలంక, నందివాడ, అడ్డాడ, పమిడిముక్కల, చెన్నూరు, పెదపారుపూడి, పెనమలూరు, నార్త్ వల్లూరు, తేలప్రోలు, కాటూరులో బాలికలకు విద్య అందుతోంది.
పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అందుబాటులో ప్రతి మండలానికి రెండు ఇంటర్మీడియెట్ కళాశాలల ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్య సంచాలకులు కృష్ణా జిల్లాలో ఈ ఏడాది నుంచి మరో 18 హైస్కూల్ ప్లస్‌ల ఏర్పాటు
లక్ష్యాలను అధిగమించాలి
ప్రతి మండలంలో రెండు ఇంటర్మీడియెట్ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. ఇప్పటికే బాలికల హైస్కూల్ ప్లస్‌కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సహ విద్య కేంద్రాలు కూడా అందుబాటులోకి తెస్తే బాలురకు సైతం ఉన్నత విద్య సమర్థంగా అందుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా, ఎంపిక చేసిన కోర్సులు అమలు జరిగేలా ప్రతి ఒక్కరూ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి.