Inter Exams 2024 : ఇంటర్మీడియెట్ పరీక్షలకు హెల్ప్‌లైన్ నంబర్
విశాఖ విద్య: ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ తనిఖీ అధికారి(ఆర్‌ఐవో) పి.మురళీధర్ పేర్కొన్నారు. బుధవారం విశాఖ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి పరీక్షల వివరాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్ థియరీ పరీక్షలకు 40,873 మంది, సెకండియర్ పరీక్షలకు 41,806 మంది విద్యార్థులు హాజరు కానున్నారని చెప్పారు. ప్రాక్టికల్స్‌కు ఎంపీసీ కోర్సు విద్యార్థులు 32,982 మంది, బైపీసీ కోర్సు విద్యార్థులు 4,945 మంది హాజరుకానున్నారన్నారు. థియరీ పరీక్షలకు జిల్లాలో 93 పరీక్షా కేంద్రాలు, ప్రాక్టికల్స్‌కు 150 కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఆయా రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయన్నారు. థియరీ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Also Read: Mathematics I-B Study Material
హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు
విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఐవో మురళీధర్ చెప్పారు. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 0891– 2567561 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా హాల్‌టికెట్ మంజూరు చేయాలన్నారు. ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేక రుసుం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం 0891– 2567561 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఈవో ఎల్.చంద్రకళ, డీవీఈవో రాధ, ఆర్‌ఐవో కార్యాలయ సూపరింటెండెంట్ గణేష్, డీఎంహెచ్‌వో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్ ఆర్టీసీ, పోస్టల్, పోలీస్, విద్యా శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags
- ap inter public exam schedule 2024
- ap inter public exams date
- Intermediate Annual exams2024
- Helpline number for Intermediate Public Exams
- Good news for AP Intermediate students
- Intermediate News
- Latest Intermediate News
- sakshieducation latest news
- Intermediate Board
- Final examinations
- Technical Support
- Helpline centers