Skip to main content

AP EAPCET 2022: ‘బీ’ కేటగిరీ సీట్లు ముందే భర్తీ చేయొద్దు

రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 30 శాతం ‘బీ’ కేటగిరీ సీట్లను AP EAPCET అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ కంటే ముందుగా భర్తీ చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
k hemachandra reddy
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి

ఈ సీట్ల భర్తీపై గతంలో జారీ చేసిన జీవో 48కి సంబంధించి పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అందువల్ల అప్పటివరకు కాలేజీలు ఆ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదని తెలిపారు. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర సంస్థల్లో తొలివిడత ప్రవేశాల అనంతరం ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని, అప్పటివరకు ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్లను భర్తీ చేపట్టకూడదన్నారు. బుధవారం ఈసెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

 College Predictor 2021 → AP EAPCET  TS EAMCET 

ప్రభుత్వానికి లేఖ రాశాం..

గతంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు ‘ఏ’ కేటగిరీ కింద 70 శాతం కన్వీనర్‌ ద్వారా, ‘బీ’ కేటగిరీ కింద 30 శాతం యాజమాన్యాల ద్వారా భర్తీ అయ్యేవన్నారు. అయితే ‘బీ’ కేటగిరీ సీట్లను యాజమాన్యాలు నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి భర్తీ చేయడం లేదని దాఖలైన వ్యాజ్యాలపై న్యాయస్థానం తీర్పు మేరకు అప్పటి ప్రభుత్వం జీవో 66 ఇచ్చిందన్నారు. దీన్ని అనుసరించి 30 శాతం సీట్లు కూడా కన్వీనర్‌ ద్వారానే కాలేజీల వారీగా భర్తీ చేయాల్సి ఉందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బీ కేటగిరీపై విడుదల చేసిన జీవో 48 ప్రకారం గతేడాది నుంచి సగం సీట్లను (15 శాతం) ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఆయా కాలేజీలు భర్తీ చేసుకోగా మిగిలిన సగం సీట్లను నాన్‌ ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కన్వీనర్‌ ద్వారా భర్తీ చేయించామన్నారు. ఇలా కన్వీనర్‌ ద్వారా భర్తీ చేసే బీ కేటగిరీ సీట్లకు మూడు రెట్ల వరకు ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటును కాలేజీలకు కల్పించినట్లు చెప్పారు. అయితే ‘ఏ’ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాకే ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ చేపడుతున్నందున జాప్యం జరిగి బీ కేటగిరీ సీట్లకు తగినంత మంది విద్యార్ధులు ఉండడం లేదని ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలికి యాజమాన్యాలు నివేదించాయన్నారు. ఈ నేపథ్యంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఈ విద్యా సంవత్సరంలో జీవో 48 అనుసరించాలా? వద్దా అనే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఛైర్మన్‌ వివరించారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉన్నందున అప్పటివరకు కాలేజీలు ఆ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

చదవండి: ఐఐటీల్లో 4,500 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ

ఈ ఏడాదీ 35% సీట్లు కన్వీనర్‌ ద్వారా భర్తీ

2022–23లో కూడా ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 35 శాతం బీఈ, బీటెక్‌ సీట్లను ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏడు ప్రైవేట్‌ వర్సిటీలుండగా ఐదు వర్సిటీల్లో 2,100 సీట్లను గతేడాది కౌన్సెలింగ్‌లో ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు కేటాయించామని చెప్పారు. ఆ వర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్ధులకు ప్రభుత్వమే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తోందన్నారు. రాష్ట్రంలో బ్రౌన్‌ ఫీల్డ్‌ వర్సిటీ అయిన మోహన్‌బాబు వర్సిటీలో అది వర్సిటీగా ఏర్పడక ముందు కాలేజీగా ఉన్న సమయంలో ఉన్న కోర్సులకు సంబంధించిన సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేస్తామని మండలి ఛైర్మన్‌ వివరించారు. వర్సిటీగా మారిన తరువాత కొత్తగా ఏర్పాటైన కోర్సులు, విభాగాల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ అవుతాయని చెప్పారు. ప్రైవేట్‌ వర్సిటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో డిప్లొమో పూర్తి చేసిన విద్యార్ధులకు లేటరల్‌ ఎంట్రీపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

చదవండి: డ్రైవర్‌ లేకుండా వాహనాలపై ఐఐటీహెచ్‌ ప్రయోగాలు

Published date : 11 Aug 2022 03:58PM

Photo Stories