Skip to main content

Tabs: 4.72లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,72,472 మంది విద్యార్థులకు రూ.606.18 కోట్లతో ట్యాబ్‌లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Tabs
4.72లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు

ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే 50,194 మంది ఉపాధ్యాయులకు సైతం రూ.64.46 కోట్లతో ట్యాబ్‌ల పంపిణీకి పచ్చ జెండా ఊపింది. ఇందుకు సుమారు రూ.670.64 కోట్లు ఖర్చవుతుందని అంచనా. నవంబర్‌లో వీటిని విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ప్రతి ట్యాబ్‌లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ, అదనంగా 64 జీబీ మెమొరీ కార్డ్, మూడేళ్ల వారంటీ ఇవ్వనున్నారు. మార్కెట్‌లో రూ.16,446 విలువున్న ట్యాబ్‌ను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.12,843కే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మొత్తంగా రూ.187.84 కోట్లు ఆదా అవుతోంది. ట్యాబ్‌తో పాటు రూ.24 వేల విలువైన బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేసి ఇవ్వనుంది. మొత్తంగా ఒక్కో విద్యార్థికి రూ.36,843 లబ్ధి కల్పించనుంది. తద్వారా ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025లో పదో తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ విధానంలో రాయాలన్న లక్ష్యానికి అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 7న సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. 

చదవండి: Times of India Awards : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు.. దేశంలోనే అత్యుత్తమ..

ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు పెద్దపీట

  • ప్రతి ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • విశ్వవిద్యాలయాలకు సంబంధించి పలు చట్టాల సవరణకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదన బిల్లుకు, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియమాకంలో నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ఖచ్చితంగా పాసవ్వాలన్న నిబంధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థల్లో నాణ్యతను మెరుగు పరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుతో పాటు ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం. కొత్తగా ఏర్పాటు కానున్న డిగ్రీ కళాశాలలో 24 మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, ఆవుట్‌ సోర్సింగ్‌ విధానంలో మరో ఆరుగురు బోధనేతర సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది.
  • పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 80 మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, ఆరుగురు రెగ్యులర్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, మరో 48 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించడానికి అనుమతి.
  • ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్‌ విధానంలో 25 మంది బోధనా సిబ్బంది, ఆరుగురు బోధనేతర సిబ్బంది ఔట్‌æ సోర్సింగ్‌ విధానంలో నియామకానికి మంత్రివర్గం ఆమోదం.
  • రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో వివిధ కేడర్లలో 85 అదనపు పోస్టుల మంజూరు.
  • పటిష్టమైన నిర్వహణ, పర్యవేక్షణ కోసం మున్సిపల్‌ స్కూళ్ల పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
  • ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో స్టాఫింగ్‌ పేట్రన్‌ను మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి,  రహదారులు– భవనాల శాఖలోని స్టేట్‌ ఆర్కిటెక్ట్‌ విభాగాన్ని బలోపేతం చేస్తూ వివిధ విభాగాల్లో 8 పోస్టుల మంజూరుకు నిర్ణయం.
  • గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో హార్టికల్చర్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
Published date : 08 Sep 2022 04:23PM

Photo Stories