Tenth Class Exams 2024: పది పరీక్షలకు సన్నద్ధం... ఈ జిల్లాల్లో 53 వేల మంది
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కలిపి 53 వేల మందిపై చిలుకు రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యార్థుల పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్ ఉండేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే అధికం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా 8వ తరగతి నుంచే ట్యాబ్‌లు ఇచ్చి వారికి సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తోంది. 2024లో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న వారిలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఉన్నారు. అనంతపురం జిల్లాలో 31,330 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా అందులో 21,545 మంది ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయనున్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో 22,002 మంది ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాస్తుండగా 16,134 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయనున్నారు.
Also Read : AP 10th Class Model Papers
అబ్బాయిలే ఎక్కువ...
పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో 16,092 మంది అబ్బాయిలు కాగా 15,238 మంది అమ్మాయిలు ఉన్నారు. కేవలం 854 మంది పైచిలుకు మాత్రమే అబ్బాయిలు ఎక్కువ. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో 11,484 మంది అబ్బాయిలు, 10,518 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాస్తున్న అమ్మాయిల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. 142 కేంద్రాలు ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక కేంద్రాలు లేవు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల నియామకాలు జరుగుతున్నాయి. పరీక్షలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.