Extension of Tenth Class Fee Payment Deadline: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పార్వతీపురం: పదవ తరగతి ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పెంచిందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చి, ఏప్రిల్‌లో జరగబోయే పదవ తరగతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష ఫీజు, ఒకేషనల్, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం 5వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 అపరాధ రుసుము తో 10వ తేదీ, రూ.200 అపరాధ రుసుముతో 12వ తేదీ, రూ.500 అపరాధ రుసుముతో 14వ తేదీలోగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు.
మూడు సబ్జెక్ట్‌ల కన్నా ఎక్కువ సబ్జెక్ట్‌లు రాసే విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80, ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని వివరించారు. ఏజ్ కాండోనేషన్ కోసం రూ.300 చెల్లించాలని స్పష్టం చేశారు. పట్టణాలలో ఉండే ఎస్సీ,ఎస్టీ, బీసీ రెగ్యులర్ విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.24 వేలు, రూరల్‌లో అయితే రూ.20 వేలు మించని వారికి పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుందని అన్నారు. ఫీజులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్‌లో మాత్రమే చెల్లించాలని తెలిపారు.