Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్
రాయవరం: మరో వారం రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడు తుండడంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపా ధ్యాయులతో పాటు విద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. పదవ తరగతి ఫలితాలు, నిర్వహణపైనే జిల్లా విద్యాశాఖాధికారుల పనితీరు ఆధారపడి ఉంటుంది. అందుకే జిల్లా విద్యాశాఖ మెరుగైన ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా, పరీక్షలను సమర్థంగా నిర్వ హించేందుకు కసరత్తు చేస్తోంది. మరో పక్క ఉపాధ్యా యులు విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేస్తున్నారు.
112 పరీక్ష కేంద్రాలు..
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 112 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పోలీస్‌స్టేషన్ కు సమీపంలో ఉన్న ‘బి’ కేటగిరి పరీక్షా కేంద్రాలు 61, పోలీస్‌స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్లు పైబడి ఉన్న ‘సి’ కేటగిరి పరీక్షా కేంద్రాలు 51 ఉన్నాయి. ప్రభుత్వ ఉన్న త పాఠశాలలు–6, మున్సిపల్ ఉన్నత పాఠశాలలు– 4, జెడ్పీ ఉన్నత పాఠశాలలు–85, సాంఘిక సంక్షేమ ఉన్నత పాఠశాలలు–2, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు–3, ఎయిడెడ్ పాఠశాల–1, అన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 18,992 మంది, ప్రైవేట్‌గా 2,121 మంది హాజరు కానున్నారు. 9,567 మంది బాలురు, 9,425 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ప్రైవేట్‌గా 1,304 మంది బాలురు, 817 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్‌మెంట్ అధికారుల నియామకం ఇప్పటికే చేపట్టినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నక్కా సురేష్ తెలిపారు.
జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రశ్నపత్రాలు
శని, ఆదివారాల్లో రెండు విడతలుగా ఏడు రోజుల పరీక్షలకు సంబంధించిన పేపర్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. తొలి విడత పేపర్లను పరీక్షా కేంద్రాల దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సోమవారం మలి విడత పేపర్ల తరలిస్తారు. కొద్దిరోజుల క్రితం జిల్లా కేంద్రానికి ఓఎంఆర్ షీట్లు చేరుకున్నాయి. వాటిని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు అందజేశారు. సీఎస్, డీవోలకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో అధికారులు నిమగ్నమయ్యారు.