openschool 2024 :పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు
![పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు](/sites/default/files/images/2024/03/16/jayeebhava-inter-students-1710585554.jpg)
పెనుగంచిప్రోలు: కుటుంబ, ఇతర ఆర్థిక ఇబ్బందులతో పాటు పలు కారణాలతో చదువుకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ ఒక వరంలా మారింది. సార్వత్రిక విద్యా పీటం రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు నిర్వహిస్తోంది. చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి వయస్సుతో నిమిత్తం లేకుండా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది. పరీక్షల నిర్వహణకు ఏపీ సార్వత్రిక విద్యాపీటం అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షలను మార్చి 18 నుంచి 27 వరకు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ కూడా విడుదల చేసింది.
ఎన్టీఆర్ జిల్లాలో...
ఎన్టీఆర్ జిల్లాలో పదో తరగతికి 10 పరీక్షా కేంద్రాలు కాగా 1785 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్‌కు 18 పరీక్షా కేంద్రాలు కాగా, 3110 మంది హాజరు కానున్నారు. స్టడీ సెంటర్లు పదో తరగతి, ఇంటర్‌కు కలిపి 48 ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో....
జిల్లాలో పదో తరగతికి 5 పరీక్షా కేంద్రాలు ఉండగా 973 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్‌లో 8 పరీక్షా కేంద్రాలు ఉండగా 1803 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. స్టడీ సెంటర్లు పదో తరగతి, ఇంటర్‌కు 24 ఉన్నాయి.
నేటి నుంచి హాల్ టికెట్లు పంపిణీ....
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు గతంలో హాజరై పరీక్షలు రాసి ఉత్తీర్ణత కాని వారు ఎన్టీఆర్ జిల్లాలో 200, కృష్ణా జిల్లాలో 150 మంది వరకు ఉన్నారని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్టినేటర్ నక్కా బాబూరావు తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం గం.2.30 నిమిషాల నుంచి గం.5.30 నిముషాల వరకు నిర్వహిస్తారన్నారు. ఇప్పుడు పరీక్షలు రాసే వారితో పాటు గతంలో ఉత్తీర్ణత కాకుండా తిరిగి పరీక్ష రాసేవారు అందరూ హాల్ టికెట్లను బుధవారం నుంచి స్టడీ సెంటర్ల నుంచి పొందవచ్చు.