Skip to main content

AP Students Visits white house: వైట్‌ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ

సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సెప్టెంబ‌ర్ 28న అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను సందర్శించారు.
AP Students Visits white house,Indian Students Explore White House,SDG Conference Delegates in Washington, D.C
వైట్‌ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ

ఇప్పటి వరకు వైట్‌హౌస్‌ను బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు.

విద్యార్థులను వైట్‌ హౌస్‌ భద్రత సిబ్బంది శ్వేత సౌధం మొత్తం తిప్పారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పని విధానాన్ని అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా భవనంలో కలియదిరిగారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది.

చదవండి: AP Students: అమెరికా వైట్‌హౌజ్‌లో ఏపీ విద్యార్థులు.. అరుదైన అవకాశం (ఫొటోలు)

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసమని భావించిన ప్రభుత్వం.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో యునైటెడ్‌ నేషన్స్‌లోని స్పెషల్‌ కన్సల్టేటివ్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌ కుమార్‌ సమన్వయంతో, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం సెప్టెంబ‌ర్ 14న అమెరికాకు వెళ్లింది.

ఈ బృందంలో మాల శివలింగమ్మ, (తండ్రి సోమనాథ్‌ రైతు కూలీ, తల్లి గంగమ్మ), మోతుకూరి చంద్రలేఖ (ఏఎస్‌ఆర్‌ జిల్లా,తండ్రి రామారావు ఆటో డ్రైవర్‌), గుండుమోగుల గణేష్‌ అంజన సాయి (పశ్చిమ గోదావరి జిల్లా, తండ్రి గోపీ, కౌలు రైతు), దడాల జ్యోత్స్న (కాకినాడ జిల్లా, తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు), చాకలి రాజేశ్వరి (నంద్యాల జిల్లా, తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్‌), పసుపులేటి గాయత్రి (ఏలూరు జిల్లా, తండ్రి రమేష్, తల్లి కూలీలు), అల్లం రిషితారెడ్డి (విజయనగరం జిల్లా, తండ్రి రామకృష్ణారెడ్డి మెకానిక్‌), వంజివాకు యోగేశ్వర్‌ (తిరుపతి జిల్లా, తండ్రి నాగరాజు కేబుల్‌ ఆపరేటర్‌), షేక్‌ అమ్మాజన్‌(శ్రీ సత్యసాయి జిల్లా, తల్లి షేక్‌ ఫాతిమా వ్యవసాయ కూలీ), సామల మనస్విని (పార్వతీపురం మన్యం జిల్లా, తల్లి కృష్ణవేణి) ఉన్నా­రు.

ఈ నెల 15 నుంచి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జరిగే సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్‌ స్కూల్స్‌ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’, విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించారు. న్యూయార్క్‌లోని జాన్‌ జే కాలేజ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌లో నిర్వహించిన ఎస్‌డీఎస్‌ సర్విస్‌ సదస్సు, ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో సైతం పాలుపంచుకున్నారు. వరల్డ్‌ బ్యాంక్, ఐఎంఎఫ్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాలను సందర్శించి భారత్‌కు తిరుగుపయనమయ్యారు.  

సీఎంకు విద్యార్థుల కృతజ్ఞతలు 

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం రాష్ట్రం తరఫున బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపికైనందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తమను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్, కమిషనర్‌ సురేష్‌కుమార్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. 

Published date : 29 Sep 2023 12:52PM

Photo Stories