10th Class Public Exams 2024: ఈ టిప్స్ ఫాలో అవ్వండి... పరీక్షలో విజయం సాధించండి
ఒంగోలు సెంట్రల్: పదో తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను ఏకాగ్రతగా చదవటంతో పాటు పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు తగినట్లు జవాబులు కచ్చితంగా రాయటం ఎంతో ముఖ్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో మంగళవారం ఒంగోలు, కొండపి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని పదో తరగతి చదువుతున్న సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాల పట్ల అవగాహన పెంచుకుని వాటిని జవాబులు రూపంలో సక్రమంగా వ్యక్తపరచటం కీలకమని అన్నారు. రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యమని అన్నారు. పబ్లిక్ పరీక్షలు 88 రోజుల గడువు ఉన్నందున ఇప్పటి నుంచి ప్రతి రోజు కనీసం 15 నిముషాల పాటు వివిధ ప్రశ్నలకు జవాబులు రాయటం సాధన చేయాలని సూచించారు. చిత్ర పటాలు, మ్యాపింగ్‌పై కూడా అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఒక అంశానికి సంబంధించి ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ముందుగానే గుర్తించి ఆ విధంగా జవాబులు రాసేలా విద్యార్థులను సమాయత్తం చేయాలని ఉపాధ్యాయులను కోరారు.
చదవండి: AP 10th Class Study Material
డీఈవో వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ మెరుగైన ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రణాళికను సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. పరీక్షల్లో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సిన విధానాలను సూచించారు. ముందుగా అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి అధికారులు నివాళులర్పించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సురేష్ కన్నా, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి, సంక్షేమ వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.