ఇక్ష్వాకులు

శాతవాహనుల అనంతరం తెలంగాణలో ఇక్ష్వాకులు రాజ్యాన్ని స్థాపించారు. ఈ రాజ్యస్థాపకుడు వాసిష్టిపుత్ర శాంతమూలుడు. ఇతడు శాతవాహనుల చివరి రాజైన మూడో పులోమావిని ఓడించి రాజ్యానికి వచ్చాడు. విజయపురి రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించాడు. (విజయపురి పట్టణాన్ని విజయశ్రీ శాతకర్ణి నిర్మించాడు).
ఇక్ష్వాకులు దాదాపు వందేళ్లు పాలించారు. వీరు ఐదుగురు రాజులని శాసనాల ద్వారా తెలుస్తుండగా, ఏడుగురు రాజులని పురాణాలు తెలుపుతున్నాయి.
జన్మస్థలంపై వాదాలు

చరిత్రకారులు రాప్సన్, బూలర్ ప్రకారం: ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు సంతతివారు.
ధర్మామృతం (జైనగ్రంథం) ప్రకారం: ఇక్ష్వాకు వంశానికి చెందిన యశోధరుడు అంగ దేశం(బెంగాల్) నుంచి తెలంగాణ ప్రాంతం వచ్చి రాజ్యాన్ని స్థాపించాడని ధర్మామృతమనే కన్నడ గ్రంథం ద్వారా తెలుస్తోంది.
చరిత్రకారుడు కాల్వేల్ ప్రకారం: వీరు ఉత్తర భారతదేశం నుంచి వలస రాలేదు. తెలంగాణలోని కృష్ణానది తీరంలోని ఇక్షు అనే స్థానిక జాతివారు.
వోగెల్ పండితుడు: కన్నడ ప్రాంతానికి చెందినవారు.
గోపాలచారి: తమిళదేశం నుంచి వచ్చారని సిద్ధాంతాల ద్వారా నిరూపించారు.
నాగార్జునకొండ శాసనం: ఇందులో ఇక్ష్వాకులు బుద్ధుడి వంశస్తులని (ఇక్ష్వాకు వంశం) పేర్కొన్నారు. వీరపురుషదత్తుడు మాత్రమే బౌద్ధం స్వీకరించాడు. కానీ ఇక్ష్వాకుల వంశమని చెప్పుకోలేదు.
వీరపురుషదత్తుడు మేనత్త కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. మేనరిక వివాహం చేసుకునే పద్ధతి ఉత్తర భారతదేశంలో లేదు. అడవిసిరి, ఖండ, కోడబలిశ్రీ అనే రాణుల పేర్లను బట్టి వీరు దక్షిణాదిలోని అనార్య తెగలకు చెందినవారని భావించవచ్చు. దక్షిణాదిలో ఇక్షు అంటే చెరకు అని అర్థం. చెరకును జాతి చిహ్నంగా స్వీకరించిన ప్రాచీన గణం(తెగ)గా వీరిని చెప్పుకోవచ్చు.
రాజకీయ చరిత్ర
శాంతమూలుడు: ఇక్ష్వాకుల రాజ్యస్థాపకుడు. ఉజ్జయినీ మహాసేనుడి(కార్తికేయుడు) భక్తుడు. శక, అబీర, యవన, గర్దభీ జాతులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడు నిర్వహించిన అశ్వమేథ యాగాలే ఇందుకు నిదర్శనం. ప్రాకృత భాషలో ఇతడు వేయించిన శాసనాలు రెంటాల, దాచేపల్లిలో లభ్యమయ్యాయి.
‘లక్షల కొద్దీ బంగారు నాణేలు దానం చేశాడు. నేటిమాలు అనే వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాడు. శ్రీశైలం మహాక్షేత్రానికి ఈశాన్య ద్వారమైన ఏలేశ్వరాన్ని పునర్నిర్మించాడు. అడవులను నరికించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడ’ని పై శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇతడు శతసహస్రహలక దాన ప్రదాత(రైతులకు లక్ష నాగళ్లను దానం చేసినవాడు) అనే బిరుదు పొందాడు.
వీరపురుషదత్తుడు: తమూలుడి తర్వాత అతడి కుమారుడైన వీరపురుషదత్తుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడి తల్లి మాధిరి. అందుకే ఇతణ్ని మాధరీపుత్ర వీరపురుషదత్తుడు అంటారు. ఇతడి నాణేలు నల్గొండ జిల్లాలోని ఫణిగిరిలో లభించాయి. ఇతడి అధికారైన ఎలిసిరి ఏలేశ్వరంలో ఆలయాన్ని నిర్మించాడు. వీరపురుషదత్తుడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన శకరాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు.
ఇతడి పరిపాలనా కాలాన్ని బౌద్ధమతానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ఇతడు పర్నిక అనే వర్తక శ్రేణులను(కూటములను) నియమించి విదేశీ వ్యాపారం కోసం కృషి చేశాడు. ఇతడు విదేశీ వ్యాపారం జరిపి, తోటలను అభివృద్ధి చేసి గొప్పరాజుగా పేరు గడించాడని విశపట్టి శాసనం ద్వారా తెలుస్తోంది. ఇతడి రాజలాంఛనమైన సింహం గుర్తే ఇక్ష్వాకుల రాజచిహ్నంగా మారింది. వీరపురుషదత్తుడి ఆస్థానంలో భావవివేకుడు ఉండేవాడు. ఇతడు గొప్ప బౌద్ధ తత్త్వవేత్త. నాగార్జునకొండలో సిథియన్ సైనికుడి శిల్పం చెక్కడంలో భావవివేకుడు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాడు.
ఏహబల శాంతమూలుడు: ఇతడు రాజ్యానికి వచ్చిన 11 ఏళ్ల తర్వాత అతని సోదరి కోడబలిశ్రీ నాగార్జునకొండలో బౌద్ధ విహారం నిర్మించింది. తొలిసారిగా శాసనాలను సంస్కృతంలో వేయించాడు. విజయపురిలో కార్తికేయ, పుష్పభద్ర ఆలయాలు నిర్మించాడు. ఇతడి కాలంలో నాగార్జునకొండలో నవగ్రహ, కుబేర ఆలయాలను నిర్మించారు. గుమ్మడుర్రులో ఇతడి శాసనం బయల్పడింది. ఇందులో బౌద్ధ విద్యాలయానికి సంబంధించిన వివరాలున్నాయి.
రుద్ర పురుషదత్తుడు: ఇతడి శాసనాలు గురజాలలో లభించాయి. ఇతడు పల్లవుల రాజ్యాన్ని ఆక్రమించాడని సింహవర్మ వేయించిన మంచికల్లు శాసనం ద్వారా తెలుస్తోంది.
పరిపాలన
సామాజిక, ఆర్థిక రంగాలు, శిల్పకళల అభివృద్ధిలో, పరిపాలనలో వీరు శాతవాహనులను అనుసరించారు. రాజ్యాన్ని ఆహారాలుగా, పథాలుగా విభజించారు. మహాతలవరులు గవర్నర్లుగా వ్యవహరించారు. ప్రధాన న్యాయాధికారిని మహాతలవరి అనేవారు. కాలక్రమంలో తలవరి పదం తలారిగా మారింది. ఇక్ష్వాకులు కూడా శాతవాహనుల్లాగే మాతృసంజ్ఞలు ధరించారు.
ఆర్థిక వ్యవస్థ
గ్రామాలు స్వయం పోషకాలు. వ్యాపారం, పరిశ్రమలు, గ్రామాల్లోని వివిధ వృత్తుల వారు ఆర్థిక వ్యవస్థకు పునాదులు. సాహసికులైన వర్తకులు సముద్రయానం చేసేవారు. వీరు గ్రీక్, రోమ్, ఈజిప్ట్ దేశాలతోనే కాకుండా బర్మా, జీవ, చైనా, సుమత్రా, ప్రాగ్దేశాలతోనూ వ్యాపారం చేసి విశేషంగా ధనం ఆర్జించారు. వ్యవసాయాభివృద్ధికి కాలువలు, తటాకాలను తవ్వించారు.
సమాజం
స్త్రీకి అత్యున్నత స్థానం కల్పించారు. కానీ ఈ కాలంలో సతీసహగమనం అమల్లో ఉన్నట్లు శిల్పాల ద్వారా తెలుస్తోంది.
మతవిధానం
ఇక్ష్వాకులు వైదికమతాన్ని అవలంబించి యజ్ఞాలు చేశారు. శాంతమూలుడు అశ్వమేథయాగం చేశాడు. బౌద్ధమతం ఉచ్ఛ దశను చేరుకుంది.
ఇక్ష్వాకులు ప్రధానంగా వైదిక మతస్థులు. కానీ వీరు బౌద్ధమతాన్ని కూడా విశేషంగా ఆదరించారు. శాంతమూలుడి సోదరి అయిన శాంతసిరి నాగార్జునకొండలో మహాచైత్యం, పారావత మహాచైత్యాలను నిర్మించింది. ఏహబల శాంతమూలుడి కాలంలో అష్టభుజనారాయణ దేవాలయాన్ని నిర్మించారు. ఇది తొలి వైష్ణవాలయం. వీరపురుషదత్తుడి అధికారైన ఎలిసిరి ఏలేశ్వరాలయాన్ని నిర్మించాడు.
బౌద్ధ శిల్పకళ

ఇక్ష్వాకులు బౌద్ధమతాన్ని విశేషంగా ఆదరించారు. వీరపురుషదత్తుడి పరిపాలనా కాలాన్ని బౌద్ధమతానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. నాగార్జునకొండ మహాయానానికి కేంద్ర స్థానంగా విలసిల్లింది. ఇక్ష్వాకులు ఈ ప్రాంతంలో 20 స్తూపాలు, విహారాలను నిర్మించారు. నాగార్జునకొండలో అపరశైలి వ్యాప్తి చెందింది.

శైలి

ప్రసిద్ధ కేంద్రం

అపరశైలి

నాగార్జునకొండ

పూర్వశైలి

అమరావతి

రాజగిరిక

గుంటుపల్లి

ఉత్తరశైలి

జగ్గయ్యపేట

సిద్ధార్థక శైలి

గుడివాడ

బహుశృతి శైలి

చేజెర్ల

మహావినయ శైలి

భట్టిప్రోలు

మహాశాసక శైలి

ఫణిగిరి

శాంతమూలుడి సోదరి శాంతసిరి. ఈమె నాగార్జునకొండలో మహాచైత్యం, పారావత మహాచైత్యాలను నిర్మించింది. వీరపురుషదత్తుడి ఆరో రాజ్యకాలంలో బౌద్ధ ఆచార్యుడైన భవంత ఆనందుడు ఈ చైత్యానికి మరమ్మతులు చేయించాడు. ఈ సమయంలోనే శాంతసిరి ఒక స్తంభాన్ని ప్రతిష్టించి 170 దీవారమాషకాలను దానం చేసింది. బోధిశర్మ మేనకోడలైన ఉపాసిక బోధిశ్రీ బౌద్ధమతాభిమాని. ఈమె మహాదమ్మగిరి వద్ద విహారాన్ని, పారావత విహారం ఎదురుగా శిలా మండపాన్ని నిర్మించింది. పూర్వశైలిలో ఒక తటాకాన్ని తవ్వించింది.
హిందూ దేవాలయాలు
దేశంలో తొలిసారిగా ఇక్ష్వాకుల కాలంలోనే దేవాలయాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ నిర్మాణాల్లో రాజులే కాకుండా స్త్రీలు కూడా పాల్గొనేవారు. రాతవశ్య అనే మహిళ అంతఃపుర స్త్రీలతో కలిసి నోదగిరిపై నోదగిరేశ్వరాలయాన్ని నిర్మించింది. ఏహబల శాంతమూలుడి కాలంలో అష్టభుజనారాయణ దేవాలయాన్ని నిర్మించారు. తొలి వైష్ణవాలయంగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ దేవాలయాన్ని శకసేనుడు నిర్మించాడు. ఇతడు అభీరవసు సేనుడి సేనాధిపతి.
నెమలిపురి వద్ద పంచవీరుల రాతిఫలకం లభించింది. ఈ ఫలకం మధ్యలో విష్ణువును నరసింహుని రూపంలో చిత్రీకరించారు. ఈ శిల్పాన్ని హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో భద్రపరిచారు.
ఇక్ష్వాకుల కాలంలోనే గజపృష్ట ఆకారంలో పుష్పభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. కుమారస్వామి సర్వదేవాదివాసాన్ని ఎలిసిరి నిర్మించాడు. ఇతడు ఏహబల శాంతమూలుడి సేనాధిపతి. ఇక్ష్వాకుల కాలంలో మాతృదేవతారాధన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీరు హారతి దేవాలయాన్ని నిర్మించి, సప్తమాతృకలను చెక్కించారు. సంతానం కోసం సప్తమాతృకలను పూజించేవారు.
ఇక్ష్వాకులు వాస్తుశాస్త్ర ప్రకారం దేవాలయంలో హంగులు కల్పించినట్లు తెలుస్తోంది. గోపురం, ద్వారం, ధ్వజస్తంభం, ప్రాకారం, గర్భగుడి లాంటి వాటిని క్రమానుసారంగా నిర్మించి దేవాలయానికి పూర్ణ స్వరూపాన్ని కల్పించింది వీరే.
శిల్పకళ
  1. ఆకుపచ్చని రాతితో శిల్పాలు చెక్కించడం వీరి ప్రత్యేకత.
  2. హారితీ దేవాలయం: చిన్నపిల్లల ఆరాధ్యదేవత
  3. సప్తమాతృకా దేవాలయం: నాగార్జునకొండలో ప్రత్యేకతను పొందింది. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేసేవారు.
  4. అద్భుత విగ్రహాలు చెక్కించారు. వీటిలో సింథియన్ అనే గ్రీకు సైనికుడి విగ్రహం ప్రముఖమైంది.
ముఖ్యాంశాలు
స్థాపకుడు: శ్రీశాంతమూలుడు
రాజధాని: విజయపురి, రాజభాష: ప్రాకృతం
రాజచిహ్నం: సింహం
రాజలాంఛనం: హారతిపుత్రులు - శ్రీపర్వతీయులు (ఆంధ్రభృత్యులుగా ప్రసిద్ధి)
వంశం, జన్మస్థలం - సిద్ధాంతాలు
రాస్పన్ - బూలర్: అయోధ్యను పాలించిన ఇక్ష్వాకుల వంశానికి చెందిన వారని అభిప్రాయపడ్డారు.
వోగెల్: కర్ణాటక ప్రాంతం నుంచి వలస వచ్చి సైన్యంలో చేరారు.
గోపాలాచారి: ఇక్ష్వాకులు తమిళనాడు ప్రాంతం వారని పేర్కొన్నారు.
కాల్డ్‌వెల్: ఆంధ్ర ప్రాంతం (కృష్ణానది తీరం) వారని తెలిపారు.

































#Tags