అసఫ్‌జాహీలు

క్రీ.శ. 1707లో ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. మొగల్ రాష్ట్ర సుబేదారులు (గవర్నర్‌లు) స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. మొగల్ చక్రవర్తుల ఆస్థానంలో విశిష్టసేవలందించిన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్‌ను చక్రవర్తి ఫరూఖ్ సియర్ 7000 మందితో కూడిన సేనకు మున్సబుదారుగా చేశాడు. ఇతడిని దక్కన్‌లోని ఖాందేష్, బీరార్, తెలంగాణ, దౌలతాబాద్, అహ్మద్‌నగర్, ఆర్కాట్ ప్రాంతాలకు సుబేదారుగా నియమించాడు. ఇతడికి ‘ఫతేజంగ్’, ‘నిజాం-ఉల్-ముల్క్’ బిరుదులు ఇచ్చారు.

దక్కన్ సుబేదారుగా మీర్ ఖమ్రుద్దీన్ ఈ ప్రాంతంలో రెండేళ్లలోపే శాంతిని నెలకొల్పాడు. 1720లో నిజాం-ఉల్-ముల్క్‌ను మాల్వాకు సుబేదారుగా నియమించారు. మొగల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా ‘నిజాం-ఉల్-ముల్క్’ను వజీర్ (ప్రధానమంత్రి)గా నియమించాడు. ఇతడు మూడేళ్లలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మొగల్ రాజ్యంలో నిజాం-ఉల్-ముల్క్ ఇజారా పద్ధతిని రద్దు చేసి దేశ ఆదాయాన్ని పెంచాడు. 1724 అక్టోబర్ 11న దక్కన్ సుబేదారైన ముబారిజ్‌ఖాన్‌ను షక్కర్‌ఖేడ్ యుద్ధంలో హతమార్చి దక్కన్‌ను ఆక్రమించాడు. నిజాం ఉల్ ముల్క్ గొప్పతనాన్ని గుర్తించి మొగలు చక్రవర్తి మహమ్మద్‌షా అతడిని దక్కన్ ప్రాంతానికి శాశ్వత సుబేదారుగా నియమించాడు. ‘అసఫ్ జా’ అనే బిరుదిచ్చాడు. నిజాం-ఉల్-ముల్క్ ‘అసఫ్ జా’ బిరుదుతో పాలించడం వల్ల ‘అసఫ్ జాహి’ వంశం అనే పేరొచ్చింది. 1724 నుంచి నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలించాడు.

నిజాం-ఉల్-ముల్క్ (1724-48)
ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకొని నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని పాలించాడు. మహారాష్ట్రులతో జరిగిన మూడు యుద్ధాల్లో ఓటమిపాలై ‘చౌత్’ పన్ను చెల్లించడానికి అంగీకరించాడు. దక్కన్‌లో వచ్చిన తిరుగుబాట్లను అణచివేసి సర్కారు, కర్నూలు, ఆర్కాటు సుబాలను అదుపులోకి తెచ్చుకున్నాడు.
1739లో నాదిర్‌షా ఢిల్లీ పైకి దండెత్తి మహమ్మద్ షాను ఓడించాడు. దక్కన్ నుంచి నిజాం-ఉల్-ముల్క్ ఢిల్లీకి వచ్చి నాదిర్‌షాకు నెమలి సింహాసనం, కొహినూర్ వజ్రాన్ని ఇచ్చి మహమ్మద్ షాతో సంధి కుదిర్చాడు. నిజాం-ఉల్-ముల్క్ 1748లో మరణించాడు.
వారసత్వ సమస్య: నిజాం మరణానంతరం అతడి కుమారుడు నాసిర్‌జంగ్, మనవడు ముజఫర్ జంగ్ (బైరున్నిసా కుమారుడు) మధ్య వారసత్వ పోరాటం ప్రారంభమైంది. ముజఫర్ ఫ్రెంచివారి సహాయంతో దక్కన్ సుబేదారు కావాలని ఆశించాడు. కానీ నాసిర్‌జంగ్ ఆంగ్లేయుల సాయంతో అతణ్ని ఓడించాడు. ఫ్రెంచి వారి కుట్ర ఫలితంగా నాసర్‌జంగ్‌ను హిమ్మత్‌ఖాన్ హతమార్చాడు. ఆ తర్వాత ముజఫర్‌జంగ్ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని ఫ్రెంచివారికి ఇచ్చాడు. చివరకు హిమ్మత్‌ఖాన్ కుట్ర వల్ల ముజఫర్ జంగ్ లక్కిరెడ్డిపల్లి వద్ద హత్యకు గురయ్యాడు. దీంతో ఫ్రెంచ్ సైనిక నాయకుడు బుస్సీ నాసిర్‌జంగ్ సోదరుడైన సలాబత్ జంగ్‌ను రాజుగా చేశాడు.

సలాబత్ జంగ్ ఫ్రెంచివారికి కొండవీడు, నిజాంపట్నం, నరసాపురం మండలాలను ఇచ్చాడు. 1751-58 మధ్య కాలంలో బుస్సీ హైదరాబాద్‌కు మకాం మార్చి సలాబత్ జంగ్‌కు పదవిని సుస్థిరం చేసుకోవడంలో సాయపడ్డాడు. మహారాష్ర్టుల దాడుల నుంచి కాపాడినందుకుగాను ఫ్రెంచివారికి ఉత్తర సర్కార్లను, బుస్సీకి గుంటూరును సలాబత్ స్వాధీనం చేశాడు. మూడో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచివారిని ఆంగ్లేయులు ఓడించడంతో సలాబత్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని వారికి ఉత్తర సర్కార్లను ఇచ్చాడు.

నిజాం అలీఖాన్ (1761-1803)
నిజాం ఉల్ ముల్క్ నాలుగో కుమారుడు నిజాం అలీఖాన్. ఇతడు తన సోదరుడైన సలాబత్ జంగ్‌ను బంధించి రెండో అసఫ్ జా బిరుదుతో దక్కన్‌కు రాజయ్యాడు. నిజాం అలీ ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్‌కు తరలించాడు. 1765లో రాబర్‌‌ట క్లైవ్ మొగల్ చక్రవర్తి షా ఆలం నుంచి ఉత్తర సర్కారులను బ్రిటిషర్లకు ఇచ్చినట్లుగా ఫర్మానా పొందాడు. కానీ నిజాం అలీఖాన్ ఈ ఫర్మానాను అంగీకరించలేదు. దుబాసీ అయిన కాండ్రేగుల జోగి పంతులు సహాయంతో బ్రిటిషర్లు ఉత్తర సర్కారులను రూ. 15 లక్షలకు గుత్తకు తీసుకున్నారు. చివరకు 1766లో కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాం అలీఖాన్ గుంటూరు మినహా సర్కారు జిల్లాలన్నింటినీ ఈస్టిండియాకు ఇచ్చేశాడు.
నిజాం అలీ ఫ్రెంచి సేనాని రేమండ్ సహయంతో తుపాకుల కర్మాగారాన్ని నిర్మించాడు. 1790లో మూడో మైసూర్ యుద్ధం ప్రారంభమైంది. టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా నిజాం అలీ, మరాఠాలతో ఈస్టిండియా కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ కూటమి టిప్పు సుల్తాన్‌ను ఓడించి రాజ్యాన్ని, మూడు కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా పొందింది.
1795లో మరాఠాలు నిజాం అలీని ‘ఖార్థా’ వద్ద ఓడించి మూడు కోట్ల రూపాయల చౌత్‌ను, రూ. 2 కోట్ల నష్ట పరిహారాన్ని పొందారు. మరాఠాలు నిజాం అలీని ఓడించిన కొద్ది కాలానికే అతడి కుమారుడు ‘అలీజా’ తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటుకు మెతుకు (మెదక్) జమీందారైన సదాశివరెడ్డి మద్దతు ఇచ్చాడు. ఫ్రెంచి సేనాని రేమండ్ సహాయంతో నిజాం సైన్యం ఈ తిరుగుబాటును అణచివేసింది. అలీజాను బంధించారు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
1799లో గవర్నర్ జనరల్ వెల్లస్లీ భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనికి అంగీకరించి, సంతకం చేసిన మొదటి భారతీయ రాజు నిజాం అలీఖాన్ (1798). సైన్య సహకార సంధి ప్రకారం నిజాం అలీఖాన్‌కు బ్రిటిష్ సైనికదళం సహాయంగా వచ్చింది. వీరు హైదరాబాద్‌లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సైన్యం నిర్వహణ కోసం నిజాం అలీఖాన్ మూడో మైసూర్ యుద్ధం ఫలితంగా పొందిన దత్త మండలాలను బ్రిటిషర్లకు ఇచ్చేశాడు.

సికిందర్ జా (1803-1829)
నిజాం అలీఖాన్ మరణం (1803) తర్వాత హైదరాబాద్ రాజ్యానికి మూడో అసఫ్ జా బిరుదుతో సికిందర్ జా రాజయ్యాడు. ఇతడి కాలంలో మీర్ ఆలం దివాన్‌గా, రాజా చందులాల్ పేష్కార్‌గా నియమితులయ్యారు. మీర్ ఆలం హైదరాబాద్ - మద్రాస్, బొంబాయి రహదారులు మరమ్మతు చేయించాడు. 1808లో తన పేరు మీద మీర్ ఆలం చెరువును నిర్మించాడు. 1814లో విలియం పామర్ హైదరాబాద్‌లో పామర్ అండ్ కో బ్యాంకు ప్రారంభించాడు.
1811లో హైదరాబాద్‌లో బ్రిటిష్ ప్రతినిధిగా హెన్రీ రస్సల్ నియమితుడయ్యాడు. 1816లో హైదరాబాద్ రాజ్యంలో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి హెన్రీ రస్సల్ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సైన్యం సహాయంతో పిండారీలు, భిల్లులు, స్థానిక జమీందారుల తిరుగుబాటులను అణచివేసి హైదరాబాద్ రాజ్యంలో శాంతి నెలకొల్పారు. తర్వాతి కాలంలో రస్సల్‌కు సైన్యం నిర్వహణ భారంగా మారింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొనడంతో అతడు పామర్ కంపెనీ నుంచి అప్పు తీసుకున్నాడు.
1820లో హైదరాబాద్‌లో బ్రిటిష్ ప్రతినిధిగా మెట్కాఫ్ వచ్చాడు. ఇతడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి పామర్ కంపెనీకి కట్టాల్సిన అప్పును నిజాం తీర్చేలా కృషి చేశాడు. చార్లెస్ మెట్కాఫ్ కాలంలోనే కోఠిలోని రెసిడెంట్ (ప్రస్తుత మహిళా కళాశాల) భవనాన్ని నిర్మించారు.

నాసీరుద్దౌలా (1829-57)
నాలుగో అసఫ్ జా బిరుదుతో నాసీరుద్దౌలా అధికారంలోకి వచ్చాడు. ఇతడి కాలంలో హైదరాబాద్ రాజ్య ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. 1848లో గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్‌‌డ డల్హౌసీ దేశంలోని స్వదేశీ సంస్థానాలను ఆక్రమించుకున్నాడు. హైదరాబాద్ రాజ్యం 1850 నాటికి ఈస్టిండియా కంపెనీకి రూ. 64 లక్షలు బాకీ పడింది. ఈ బాకీని 1850 డిసెంబర్ 31 లోగా తీర్చాలని డల్హౌసీ కోరాడు.
నాసీరుద్దౌలా కాలంలో దేశంలో రెండు ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

మొదటిది వహాబీ ఉద్యమం: పంజాబ్ నుంచి సిక్కులను, దేశం నుంచి బ్రిటిషర్లను పంపించాలనే లక్ష్యానికి సంబంధించింది. హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి నసిరుద్దౌలా సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా నాయకత్వం వహించాడు. కర్నూలు నవాబ్ గులాంఖాన్ వహాబీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1838లో ముబారిజ్‌ను అరెస్ట్ చేసి గోల్కొండ జైల్లో పెట్టారు. అతడు 1854 జూన్ 25న జైల్లోనే మరణించాడు.

రెండో అంశం బీరార్ ఒడంబడిక: బ్రిటిషర్లకు చెల్లించాల్సిన అప్పును నిజాం 1853 వరకు కూడా తీర్చలేకపోయాడు. దీంతో డల్హౌసీ ఒత్తిడి మేరకు బీరారుతో పాటు, ఉస్మానాబాద్, రాయ్‌చూర్ జిల్లాలను ఈస్టిండియా కంపెనీకి ఇచ్చేశాడు. 1853 మే 21న బీరారు ఒడంబడికపై సంతకం చేసిన దివాన్ సిరాజ్ - ఉల్ - ముల్క్ అవమానంతో మరణించాడు. అతడి అల్లుడు మీర్ తురాబ్ అలీఖాన్ సాలార్‌జంగ్ బిరుదుతో దివాన్ పదవిని అలంకరించాడు. చాదర్‌ఘాట్ బ్రిడ్జిని నాసీరుద్దౌలా కాలంలోనే నిర్మించారు. 1854లో కింగ్ ఎడ్వర్‌‌డ మెమోరియల్ ఆస్పత్రి (గాంధీ ఆస్పత్రి) నిర్మించారు.

అఫ్జలుద్దౌలా (1857-1869)
నసీరుద్దౌలా మరణించిన తర్వాత అతడి పెద్ద కుమారుడు అఫ్జల్ - ఉద్ - దౌలా (అఫ్జలుద్దౌలా) అయిదో అసఫ్ జా బిరుదుతో రాజ్యాధికారానికి వచ్చాడు. 1857 తిరుగుబాటు ప్రభావం హైదరాబాద్‌పై కూడా పడింది. 1857 జూలై 17న సైన్యంలో జమేదారైన తుర్రేబాజ్ ఖాన్ 5000 మందిని పోగుచేసి హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్ కార్యాలయంపై దాడి చేశాడు. సాలార్‌జంగ్ సహాయంతో బ్రిటిష్ ప్రతినిధి కల్నల్ డేవిడ్‌సన్ ఈ తిరుగుబాటును అణచివేశాడు. తుర్రేబాజ్ ఖాన్‌ను కాల్చి చంపి సుల్తాన్ బజార్‌లో శవాన్ని వేలాడదీశారు. తుర్రేబాజ్ ఖాన్‌కు సహాయం చేసిన మౌల్వీ అల్లావుద్దీన్‌ను అరెస్ట్ చేసి అండమాన్ జైలుకు పంపించారు.
కౌలస జాగీర్దారు రాజా దీప్‌సింగ్ కొంత మంది జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీలను కూడగట్టి కౌలస కోటను గెరిల్లా శిక్షణ కేంద్రంగా చేసి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభించాడు. దీంతో రాజు కౌలస జాగీర్దార్‌ను రద్దు చేసి అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించాడు. కౌలస పట్వారీ రంగారావును అండమాన్‌కు పంపడంతో 1859 నాటికి ఈ తిరుగుబాటు పూర్తిగా సద్దుమణిగింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు తోడ్పడినందుకుగాను అఫ్జలుద్ధౌలాకు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదును ఇచ్చారు.

మహబూబ్ అలీఖాన్ (1869-1911)
ఇతడు మూడేళ్ల వయసులో రాజ్యానికి వచ్చాడు. ఇతడి ప్రతినిధిగా మొదటి సాలార్‌జంగ్ పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. మహబూబ్ అలీఖాన్ కాలంలోనే సాలార్‌జంగ్ సంస్కరణలు తీసుకువచ్చాడు. 1884 ఫిబ్రవరి 5న మహబూబ్ అలీఖాన్ మేజర్ కావడంతో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్‌‌డ రిప్పన్ స్వయంగా వచ్చి అధికారాన్ని అందజేశాడు. ఇతడి కాలంలో పర్షియన్ స్థానంలో ఉర్దూను రాజభాషగా చేశారు.

మాదిరి ప్రశ్నలు

















































#Tags