విదేశీ వాణిజ్య విధానం

భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానాన్ని నాలుగు దశలుగా విభజించొచ్చు. మొదటి దశ (1952–53 నుంచి 1956–57), రెండో దశ (1956–57 నుంచి జూన్‌ 1966), మూడో దశ (రూపాయి మూల్యహీనీక రణ తర్వాత), నాలుగో దశ (1975–76 తర్వాత).
మొదటి దశ వాణిజ్య విధానంలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సరళీకరణ చర్యలను అమలు చేశారు. తద్వారా దిగుమతుల్లో పెరుగుదల సంభవించింది. అయితే ఎగుమతుల్లో పెరుగుదల.. దిగుమతుల్లో పెరుగుదలకు అనుపాతంగా లేనందువల్ల వాణిజ్య లోటు పెరిగింది.

రెండో దశలో ప్రణాళిక అవసరానికి అనుగుణంగా వాణిజ్య విధానాన్ని పునర్వ్యవస్థీకరించారు. దిగుమతుల నియంత్రణ, దిగుమతి ప్రత్యామ్నాయ చర్యలను అమలుచేస్తూ.. ఎగుమతుల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా ఎగుమతుల విస్తృతీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఈ దశలో వాణిజ్య విధానాన్ని మొదలియార్‌ కమిటీ సమీక్షించింది.

ప్రభుత్వం 1966, జూన్‌లో దిగుమతుల నియంత్రణ, ఎగుమతుల ప్రోత్సాహానికి మూల్యహీనీకరణ చేపట్టడం వల్ల మూడో దశలో ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రారంభంలో మూల్యహీనీకరణ వల్ల ఆశించిన ఫలితాలు రాకపోయినా, నాలుగో ప్రణాళిక నుంచి ఇది విదేశీ వాణిజ్యంపై ధనాత్మక ప్రభావాన్ని చూపింది. ఈ స్థితి 1975–76 వరకు కొనసాగింది.

నాలుగో దశలో ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం దిగుమతుల సరళీకరణ విధానాన్ని అవలంబించింది. జనతా ప్రభుత్వ కాలంలో ద్రవ్యోల్బణ విరుద్ధ దిగుమతుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం దిగుమతుల సరళీకరణ విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వ దిగుమతి ఎగుమతి విధానం లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి.
  • ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలను అందించడం.
  • సంప్రదాయ పరిశ్రమల వృద్ధికి తగిన మద్దతివ్వడం.
  • వనరుల అభిలషణీయ వినియోగం.
  • సాంకేతిక పరిజ్ఞానం పెంపు.
  • ఎగుమతికి సంబంధించిన పరిశ్రమలకు తగిన మద్దతివ్వడం.
  • విదేశీ కరెన్సీని పొదుపు చేసేందుకు అనవసర (Non-essential) దిగుమతులపై నియంత్రణ విధింపు.
సంస్కరణలకు ముందు కాలంలో ప్రభుత్వం అవలంబించిన ఎగుమతి ప్రోత్సాహక విధానాలు.. లక్ష్యసాధనలో వైఫల్యం చెందడానికి కింది అంశాలు కారణమయ్యాయి.
  • దీర్ఘకాల ఎగుమతి వ్యూహం పూర్తిగా లోపించడం.
  • ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులను నిరుత్సాహపరచిన అంతర్గత, బహిర్గత సమస్యలు.
  • సాంకేతిక ప్రగతి తక్కువగా ఉండటం వల్ల ఎదురైన ఉత్పత్తి సమస్యలు.
  • స్వదేశీ విధానాలు లోపభూయిష్టంగా ఉండటంతోపాటు ఎగుమతుల పెంపునకు తగిన కృషి జరగకపోవడం.
  • వినిమయ రేటులో పెరుగుదల వల్ల దిగుమతుల్లో పెరుగుదల, ఎగుమతుల్లో క్షీణత ఏర్పడటం.
సంస్కరణల కాలంలో వాణిజ్య విధానాలు
  • ఉత్పత్తి, వాణిజ్య సంబంధిత సమస్యలను అధిగమించడం ద్వారా సంస్కరణల కాలంలో భారత ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి కింది విధానాలను అవలంబించింది.
  • 1991, జూలైలో ఎగుమతులను ప్రోత్సహించడానికి విదేశీ కరెన్సీతో పోల్చి రూపాయి విలువను 18% కుదించారు.
  • వాణిజ్యానికి సంబంధించి 1993, మేలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రాష్ట్రాలకు ప్రత్యేక నిధుల పంపిణీని ప్రతిపాదించింది.
  • టారిఫ్‌ నిర్మాణతపై చెల్లయ్య కమిటీ తన తుది నివేదికను 1993, జనవరిలో సమర్పించిన తర్వాత దిగుమతి సుంకాలను తగ్గించారు.
  • ట్రేడ్‌ అకౌంట్‌లో రూపాయి పూర్తి మార్పిడి 1993–94
  • కరెంట్‌ అకౌంట్‌లో రూపాయి మార్పిడి –1994, ఆగస్టు.
  • విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు 2000, ఏప్రిల్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • ఎగుమతి, దిగుమతి విధానం–2001 ద్వారా వ్యవసాయ ఎగుమతుల జోన్‌లు ఏర్పాటు చేశారు.
  • నూతన ఎగుమతి వ్యూహాన్ని ప్రభుత్వం 1998, జనవరి 2న ప్రకటించింది. మధ్యకాలిక ఎగుమతి వ్యూహంలో భాగంగా అవస్థాపనాపరమైన సమస్యల తొలగింపు, పరపతి వ్యయం తగ్గింపు, ప్రత్యేక మార్కెట్లు, రంగాల అభివృద్ధికి తగిన చర్యలను చేపట్టడం ద్వారా వార్షిక ఎగుమతుల పెంపు.
  • మార్కెట్‌ అందుబాటు ప్రోత్సాహక పథకాన్ని 2001–02లో ప్రారంభించారు. తద్వారా విదేశాల్లో ఉత్పత్తుల మార్కెటింగ్‌ పెంపునకు చర్యలు చేపట్టారు.
  • 2004–09 వాణిజ్య విధానంలో వ్యవసాయం, హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్, వజ్రాలు, ఆభరణాలు, తోలు (లెదర్‌), ఫుట్‌వేర్‌ రంగాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాలను రూపొందించారు. అలాగే స్వేచ్ఛా వాణిజ్యం, వేర్‌హౌస్‌ జోన్లకు సంబంధించి నూతన పథకం ప్రారంభించారు.
2009–14 వాణిజ్య విధానం ద్వారా కింది చర్యలను తీసుకున్నారు.
ఎ) ఫోకస్‌ మార్కెట్‌ పథకం కింద అందించే ప్రోత్సాహకాలను 2.5 శాతం నుంచి 3 శాతానికి పెంచారు.
బి) ఫోకస్‌ మార్కెట్‌ పథకం కింద 26 నూతన మార్కెట్లను గుర్తించాలని నూతన వాణిజ్య విధానం నిర్దేశించింది. వీటిలో 16 లాటిన్‌ అమెరికా, 10 ఆఫ్రికా, కామన్‌వెల్త్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ స్టేట్స్‌ (CI)కు సంబంధించిన మార్కెట్లు ఉన్నాయి.
సి) వాణిజ్య విధానం ద్వారా పన్ను ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ వద్ద బ్యాంకు పరపతి, డ్యూటీ ప్రోత్సాహకాలు, నూతన మార్కెట్లను గుర్తించడం, విదేశీ మార్కెట్లలో భారత వస్తు, సేవల డిమాండ్‌ పెంపునకు వ్యూహాలు వంటి విధానాలను ప్రకటించారు.
విదేశీ వాణిజ్య విధానం 2015–20
  • బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2015, ఏప్రిల్‌ 1న ‘విదేశీ వాణిజ్య విధానం 2015–20’ను ప్రకటించింది. ప్రధానమంత్రి విజన్‌.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను దృష్టిలో పెట్టుకుని ఎగుమతిదారులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని యూనిట్లు, వస్తు, సేవల ఎగుమతుల పెంపు, ఉపాధికల్పన వంటి అంశాలపై నూతన వాణిజ్య విధానం దృష్టి సారించింది.
  • తయారీ, సేవారంగానికి తగిన మద్దతునివ్వడంతోపాటు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మెరుగుపరచడంపై వాణిజ్య విధానం 2015–20 దృష్టిసారించింది. 2020 నాటికి ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ ప్రధాన పాత్ర పోషించగలదని ప్రభుత్వం భావిస్తోంది.
2015–20 వాణిజ్య విధాన లక్ష్యాలు
  • 2013–14లో 465.9 బిలియన్‌ డాలర్లు ఉన్న వస్తు, సేవల ఎగుమతుల విలువను 2019–20 నాటికి 900 బిలియన్‌ డాలర్లకు పెంచడం.
  • ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటాను 2 నుంచి 3.5%కి పెంచడం.
  • ఎగుమతులను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ ఏర్పాటు.
  • రక్షణ, వ్యవసాయ, పర్యావరణహిత, హైటెక్‌ వస్తువులకు సంబంధించిన ఎగుమతులకు అదనపు ప్రోత్సాహకాలు.
  • ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)పై ఉన్న ఎగుమతి నిబంధనల తగ్గింపు, సెజ్‌లను MEIS, SEIS పథకాల పరిధిలోకి తేవడం ద్వారా వాటిని పెట్టుబడి కేంద్రాలుగా తీర్చిదిద్దడం.
  • మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ వాణిజ్య విధానం అమలు.
  • ఈ–కామర్స్‌ను ప్రోత్సహించడంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పరిశ్రమలను ఎంపిక చేస్తుంది. ఈ–కామర్స్‌ ఎగుమతుల్లో హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులు, బుక్స్, పీరియాడికల్స్, లెదర్‌ ఫుట్‌వేర్, ఆట వస్తువులు, ఫ్యాషన్‌ గార్మెంట్స్‌ భాగంగా ఉంటాయి.
  • గతంలో ఉన్న వార్షిక వాణిజ్య విధాన సమీక్షకు భిన్నంగా, రెండున్నరేళ్ల తర్వాత సమీక్షించడం.
నూతన విదేశీ వాణిజ్య విధానంతోపాటు FTP Statement ను విడుదల చేశారు. ఇందులో విజన్, లక్ష్యాలు, విదేశీ వాణిజ్య విధానంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో ఎదురయ్యే అవరోధాలు, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ పాత్రకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను వివరించారు. మార్కెట్, ఉత్పత్తి వ్యూహం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, వాణిజ్య ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి విదేశీ వాణిజ్య విధాన ప్రకటనలో పొందుపరిచారు. విదేశీ వాణిజ్య విధానం 2015–20 కి అనుకూలంగా పారిశ్రామిక వర్గాలు స్పందించాయి.





#Tags