TGPSC News: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!

TGPSC News: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ, సన్నద్ధమవుతున్నవారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోనివారూ ఉన్నారు. 

భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా.. నోటిఫికేషన్‌ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం.. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం.. ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్‌–1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. 

ఇదీ చదవండి: TGPSC Group 2 Candidates : భారీగా త‌గ్గిన టీజీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల సంఖ్య‌.. కార‌ణం ఇదే..!

సాగదీతలు.. వాయిదాలతో.. 
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11 వేల గ్రూప్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీకాగా.. రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్‌ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే... కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరిదశకు చేరింది. ఇక గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్‌లో వెలువడ్డాయి. గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. గ్రూప్‌–2, 3 పరీక్షలు పూర్తయ్యాయి. 

ఇందులో గ్రూప్‌–2 అర్హత పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా.. గ్రూప్‌–3 పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని.. వాటికోసం వేచి చూసే బదులుగా ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: Railway Jobs 2024: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1785 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

హాజరుశాతం.. క్రమంగా పతనం.. 
గత ఏడాది జూలైలో గ్రూప్‌–4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతమే. 

ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో నుంచి.. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్‌–3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్‌–2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు. 

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి 
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ, వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. 

దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. 
                                                              – అబ్దుల్‌ కరీం, సీనియర్‌ ఫ్యాకల్టీ, హైదరాబాద్‌ 

కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు 
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్‌లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది. 

దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి. 
                                                                    – భవాని శంకర్‌ కోడాలి, నిపుణులు, కెరీర్‌ గైడ్‌ 

#Tags