TSPSC చైర్మన్‌గా మాజీ డీజీపీ!.. పరీక్షలు, ఫలితాలపై నిరుద్యోగుల ఆశలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కమిషన్‌ చైర్మన్, సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్‌ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కారు..

గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. త్వరలోనే సభ్యుల నియామ కాన్ని కూడా పూర్తిచేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 

వేగంగా దరఖాస్తుల పరిశీలన 

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను కలసి చర్చించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు వీలుగా సలహా తీసుకున్నారు. దీనికితోడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంపై సర్కారు దృష్టి పెట్టింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ పోస్టల కోసం జ‌నవ‌రి 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది.

గవర్నర్‌ తమిళిసై ఆమోదం పొందగానే.. నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మహేందర్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్‌ వరకే కొనసాగే అవకాశం ఉంది. కమిషన్‌ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. 

సభ్యుల ఎంపికపై కసరత్తు 

రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, ఇతర సభ్యులు రాజీనామాలు చేశారు. దీనితో కమిషన్‌లో పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. కమిషన్‌లో చైర్మన్‌తోపాటు పది మంది సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గవర్నర్‌ ఆ పోస్టుల్లో నియామకాలు జరుపుతారు.

అయితే చైర్మన్, సభ్యుల పోస్టులకు నామినేటెడ్‌ పద్ధతిలో కాకుండా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో చైర్మన్‌ పేరును ఖరారు చేయగా.. సభ్యుల పోస్టుల కోసం దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 

పరీక్షలు, ఫలితాలపై ఆశలు 

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలతో పలు పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వాయిదాపడ్డాయి. ప్రధానంగా గ్రూప్‌–1 మెయిన్స్, గ్రూప్‌–2, గ్రూప్‌–3 తోపాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికితోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30వేల పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించినా.. ఫలితాలు ప్రకటించలేదు.

పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకు కమిషన్‌ చైర్మన్, సభ్యుల నిర్ణయం కీలకం. త్వరగా వారి నియామకాలు పూర్తయితే.. నిలిచిపోయిన ప్రక్రియలన్నీ మొదలవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

#Tags