షోడష మహాజనపదాలు

క్రీ.పూ. 6 శతాబ్దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితుల ప్రభావం భారతదేశ చరిత్ర మీద ప్రబలంగా ఉంది. ఈ కాలాన్ని మహాజన పదాల యుగం, బుద్ధయుగం, రెండో నగరీకరణ యుగం, మౌర్యుల పూర్వ యుగం అనే పలు పేర్లతో పిలుస్తారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా, వేదకాలపు తెగ ఆధారిత జన పదాలకు భిన్నంగా ప్రాంతం ఆధారిత మహాజనపదాలు (ప్రాదేశిక రాజ్యాలు) ఈ యుగంలోనే ఏర్పడ్డాయి. ఈ కాలంలోనే బుద్ధుడు జీవించాడు, సింధూ నాగరికత పట్టణాల తర్వాత మళ్లీ నగరాల ఆవిర్భావం జరిగింది. ఈ యుగం అంతం కాగానే క్రీ.పూ. 325లో మౌర్య సామ్రాజ్యం ఏర్పడినందున దీన్ని మౌర్యుల పూర్వ యుగం అంటారు.
మహాజనపదాల ఆవిర్భావం
క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రపంచంలోని అత్యంత సారవంతమైన మైదానాల్లో ఒకటైన గంగా మైదానం సాగులోకి వచ్చింది. ఈ కాలంలో విస్తృత స్థాయిలో ఇనుమును ఉపయోగించారు. కొత్త వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి వచ్చి వ్యవసాయంలో మిగులు ఏర్పడింది. దీనివల్ల వ్యాపార వాణిజ్యాలు, నగరాలు అభివృద్ధి చెందాయి. పన్నుల వ్యవస్థకు అవకాశం కలిగింది. ఈ పరిణామాలన్నీ కలిసి ఈ యుగంలో 16 పెద్ద ప్రాదేశిక రాజ్యాల ఏర్పాటుకు దారితీశాయి. బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయలో ఈ 16 రాజ్యాల ప్రస్తావన ఉంది.
  1. అంగ: దీని రాజధాని చంపా. బ్రహ్మదత్తుడిని అంతం చేసి బింబిసారుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
  2. కాశీ: రాజధాని వారణాసి. ఇది వరుణ, ఆసి నదుల సంగమ ప్రాంతం.
  3. కోసల: దీని తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. ఈ రాజులు కాశీని ఆక్రమించారు. రాజ్యం చివరికి మగధలో విలీనమైంది.
  4. వజ్జీ: రాజధాని వైశాలి. ఇది 8 గణ రాజ్యాలతో కూడిన సమాఖ్య. వైశాలి రాజు చేతకుని కుమార్తె చెల్లనను బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. ఈ రాజ్యాన్ని చివరికి అజాతశత్రువు అంతం చేశాడు.
  5. మల్ల: దీని రాజధానులు కుశినార, పావ. కుశినారలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. పావలో మహావీరుడు మరణించాడు. ఈ గణ రాజ్యం బుద్ధున్ని బాగా ఆదరించింది. బుద్ధుని శిష్యులు ఆనందుడు, ఉపాలి మొదలైన వారు ఈ రాజ్యానికి చెందినవారే. పావలో సాంతాగార అనే శాసన సభ ఉండేది.
  6. చేది: రాజధాని సుక్తిమతి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
  7. వత్స: దీని రాజధాని కౌశాంబి, దీని రాజు ఉదయనుడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు. హర్షుని ప్రియదర్శిక, రత్నావళితోపాటు అనేక కథల్లో ఇతడు నాయకుడు. అవంతిరాజు పలాక ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
  8. పాంచాల: దీని రాజధానులు అహిచ్ఛత్ర, కంపిల్య.
  9. శౌరసేన: దీని రాజధాని మధుర. గ్రీకు రచనల్లో ఈ రాజ్యాన్ని శౌరసేనాయ్‌గా, రాజధాని మేధోరాగా ప్రస్తావించారు.
  10. మత్స్య: దీని రాజధాని విరాటనగరం. ఈ రాజ్యమూ మగధలో కలిసిపోయింది.
  11. కురు: రాజధాని ఇంద్రప్రస్థ. ఆధునిక ఢిల్లీ పరిసరాల్లోని నగరం. రెండో రాజధాని హస్తినాపూర్
  12. అస్సక/అస్మక: రాజధాని పొదన లేదా పొటన. ఇదే నేటి బోధన్. ఇది షోడష మహాజనపదాల్లోని ఏకైక దక్షిణాది రాజ్యం. ఇది ఆంధ్ర, మహారాష్ర్టలకు విస్తరించింది.
  13. అవంతి: రాజధానులు ఉజ్జయినీ, మహిష్మతి. నంది వర్ధనుడిని ఓడించి మగధ రాజు శిశు నాగుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
  14. గాంధార: రాజధాని తక్షశిల. ఈ రాజ్యాన్ని పర్షియన్లు ఆక్రమించుకున్నారు.
  15. కాంభోజ: రాజధాని రాజాపుర.
  16. మగధ: రాజగృహ (గిరివ్రజ), పాటలీ పుత్ర రాజధానులు.
బుద్ధుని కాలానికి పైన పేర్కొన్న 16 జనపదాల్లో కేవలం నాలుగు రాజ్యాలు మాత్రమే ఉండేవి. అవి.. వత్స, అవంతి, కోసల, మగధ. మిగిలిన రాజ్యాలన్నీ ఈ నాలుగు రాజ్యాల్లో విలీనమైపోయాయి. అయితే క్రీ.పూ. 4వ శతాబ్దాల్లో ఈ నాలుగు రాజ్యాలూ విలీనమై మగధ సామ్రాజ్యం అవతరించింది.

మగధను పాలించిన రాజవంశాలు
క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి క్రీ.పూ. 4వ శతాబ్దం (మౌర్య సామ్రాజ్యం ఏర్పడే) వరకు మగధను మూడు రాజవంశాలు పాలించాయి.

హర్యాంక వంశం (544-413)
బింబిసారుడు: ఇతనితో ప్రారంభమైన మగధ సామ్రాజ్య వాదం అశోకుడి కళింగ యుద్ధం వరకు కొనసాగింది. ఇతడు అంగను జయించి తన కుమారుడు అజాతశత్రువును రాజ ప్రతినిధిగా నియమించాడు. కోసల రాజు ప్రసేనజిత్ చెల్లెలు కోసలదేవిని వివాహం చేసుకుని కాశీని పొందాడు. వైశాలీ లిచ్ఛవీ రాజు చేతకుని కుమార్తె చెల్లనను, పంజాబ్‌ను పాలించే మాద్రా రాకుమార్తె ఖేమాను వివాహం చేసుకోవడం ద్వారా పశ్చిమ, ఉత్తర దిశలో తన రాజ్య విస్తరణ మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. తన ప్రధాన శత్రువు చండ ప్రద్యోత మహాసేనుడి వద్దకు తన ఆస్థాన వైద్యుడు జీవకుడిని పంపి కామెర్ల వ్యాధి నుంచి విముక్తున్ని చేసి తన మిత్రునిగా చేసుకున్నాడు. గాంధార రాజు పుష్కర సరీన్ కూడా తన రాయబారిని పంపి బింబిసారుడితో స్నేహం చేసుకున్నాడు. ఇతడు బుద్ధుని సమకాలికుడైనా ఇతడు ఏ మతాన్ని ఆదరించాడనే దానిపై స్పష్టత లేదు. బౌద్ధ, జైన మతాలు రెండూ ఇతన్ని తమ మతానికి చెందినవాడేనని పేర్కొన్నాయి.

అజాతశత్రువు: తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. తీవ్రమైన సామ్రాజ్య వాద విధానాన్ని అవలంబించాడు. కోసలరాజు, తన మేనమామ ప్రసేనజిత్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. విజయం సాధించి కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడంతో పాటు కాశీని తిరిగి పొందాడు. వైశాలీ లిచ్ఛవుల నాయకత్వంలోని 36 రాజ్యాల కూటమికి వ్యతిరేకంగా 16 ఏళ్లు యుద్ధం చేసి విజయం సాధించాడు. ఇతడు మొదట జైనాన్ని, తర్వాత బౌద్ధాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. అందుకే బుద్ధున్ని కలిసి తన తండ్రిని చంపిన నేరాన్ని అంగీకరించాడు. వీరి సమావేశానికి సంబంధించిన ఆధారాలు బార్హుత్ శిల్పాల్లో ఉన్నాయి. ఇతని కాలంలో మొదటి బౌద్ధ సంగీతి జరిగింది. అతనికి కునిక అనే బిరుదు ఉంది.

ఉదయనుడు: ఇతడు పాటలీ గ్రామంలోని గంగ, సోన్ నది సంగమ స్థానంలో కోటను నిర్మించాడు. కాబట్టి ఇతడిని పాటలీ పుత్ర నగర నిర్మాతగా భావిస్తారు.

శిశునాగ వంశం (413-364)
శిశునాగుడు:
ఉదయనుడి తర్వాత నలుగురు పితృ హంతకులు రాజులుగా వచ్చారు. వీరితో విసిగిపోయిన ప్రజలు కాశీలో రాజప్రతినిధిగా ఉన్న శిశునాగున్ని రాజుగా చేసినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు రాజధానిని వైశాలికి మార్చాడు. అవంతి రాజు ప్రద్యోతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగధలో కలిపేయడం ఇతని గొప్ప విజయంగా పేర్కొంటారు. దీంతో ఈ రాజ్యాల మధ్య వంద సంవత్సరాలుగా సాగిన వైరం అంతమైంది.

కాలాశోకుడు: ఇతడు రాజధానిని పాటలీపుత్రానికి తిరిగి మార్చాడు. ఇతని కాలంలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. ఇతడిని సేనాపతి మహా పద్మనందుడు హత్య చేసి నంద వంశాన్ని స్థాపించాడు.

నందవంశం (364-321)
మగధను పాలించిన అత్యంత బలమైన వంశం నందవంశం.
మహాపద్మనందుడు: ఇతడు శూద్ర మహిళకు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అనేక క్షత్రియ రాజు కుటుంబాలను రూపుమాపి రెండో పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఖారవేలుని హాథిగుంఫ శిలాశాసనం ప్రకారం ఇతడు కళింగను జయించి విజయ చిహ్నంగా అక్కడి నుంచి జైన తీర్థంకరుని విగ్రహం తెచ్చినట్లు తెలుస్తుంది. ఇతడు ఏకరాట్ అనే బిరుదును ధరించాడు.
ధననందుడు: మహా పద్మనందుడి తర్వాత అతని ఎనిమిది మంది కుమారులు పాలించారు. వారిలో చివరివాడు ధననందుడు. ఇతనికి రెండు లక్షల పదాతి దళం, 20 వేల అశ్విక దళం, 3వేల గజ దళం, 2వేల రథబలం ఉండేది. అలెగ్జాండర్ సేనలు బియాస్‌ను దాటి భారత్‌పై దండెత్తకపోవడానికి వీరి బలసంపత్తి కూడా ఒక కారణం. అయితే ఇతనికి మితిమీరిన ధనకాంక్ష ఉండేదని దానివల్ల ప్రజలను పీడించి వారి మద్దతు కోల్పోవడం వల్ల, ఈ పరిస్థితులను అనువుగా చేసుకొని చంద్రగుప్త మౌర్యుడు ఇతన్ని అంతమొందించి మౌర్య వంశ స్థాపన చేశాడు.

బుద్ధయుగంలోని గణతంత్ర రాజ్యాలు
ఈ కాలం నాటి పాలి గ్రంథాల్లో ఆనాడు మనుగడలో ఉన్న కొన్ని గణతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉంది. ఈ రాజ్యాల్లో కొన్ని షోడష మహాజనపదాల్లోనూ కనిపిస్తాయి.
  • నాటి గణరాజ్యాల్లో ప్రధానమైనవి కపిలవస్తు, కుశినార, పావ, వైశాలి మొదలైనవి.
  • కపిలవస్తును శాక్యవంశం పాలించేది. ఇది భారత్-నేపాల్ సరిహద్దు రాజ్యం. బుద్ధు డు ఈ వంశానికి చెందినవాడు. కోసల రాజు విరుధకుడు ఈ రాజ్యాన్ని అంతం చేసి శాక్యలను ఊచకోత కోశాడు.
  • కుశినార, పావ రాజధానులుగా మల్ల వం శం పాలించేది. అజాతశత్రువు ఈ రాజ్యా న్ని అంతం చేశాడు.
  • వైశాలి రాజధానిగా లిచ్ఛవీలు పరిపాలించారు. వీరు స్వేచ్ఛా పిపాసులు, యుద్ధ పిపాసులు. అందుకే అజాతశత్రువుకు ఈ రాజ్యాన్ని ఆక్రమించేందుకు 15 సంవత్సరాలు పట్టింది. అజాతశత్రువు ఈ యుద్ధం లో విజయం సాధించినా లిచ్ఛవీలు తీవ్రనష్టాన్ని కలిగించారు. వీరి సమావేశ మందిరం పేరు సాంతాగార, ఇందులో 7707 మంది ప్రతినిధులు పాల్గొనేవారు.
భారతదేశంపై విదేశీ దండయాత్రలు
షోడష మహా జనపదాల్లోని 16 రాజ్యాల్లో అత్యధిక రాజ్యాలు భారత్‌లోని ప్రధాన భూ భాగంలో ఉన్నాయి. వాయవ్య భారతదేశంలో కాంభోజ, గాంధార, మాద్రా రాజ్యాలుండేవి. వీరి మధ్య ఉన్న రాజకీయ అనైక్యత.. పర్షియాను పాలించే ఆకియేనియన్ రాజులు భారత్‌ను ఆక్రమించేందుకు పురిగొల్పింది.

పర్షియన్ దండయాత్రలు
సైరస్
: క్రీ.పూ. 6వ శతాబ్దంలో పర్షియారాజు సైరస్ భారత్‌పై దండెత్తి సింధూ నదికి పశ్చిమంలోని కాబూల్ వరకు ఉన్న ప్రాంతాన్నంతా ఆక్రమించాడు. భారత దేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీ పాలకుడు సైరస్. ఇతడు కపీసా అనే నగరాన్ని ధ్వంసం చేసినట్లు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది.
డేరియస్- 1: సైరస్ మనవడు. ఇతడు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఈ దండయాత్రలో పాల్గొన్న ఇతని సేనాని స్కైలస్. హిరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు పర్షియన్ సామ్రాజ్యంలోని 28 సాత్రపిల్లో(రాష్ట్రాల్లో) సింధూ రాష్ర్టం 20వ సాత్రపిగా ఉందని తెలిపాడు.
జెక్జెస్: ఇతని కాలంలో భారత సేనలను గ్రీసులోని తన ప్రత్యర్థులతో పోరాడేందుకు నియమించారు.
డేరియస్-3: అలెగ్జాండర్‌తో పోరాడేందుకు భారతీయ సైనికుల్ని తన సైన్యంలో చేర్చుకున్నాడు.
భారత్‌పై పర్షియన్ దండయాత్రల వల్ల భారత్‌కు పర్షియాకు మధ్య వ్యాపార వాణిజ్యాలకు గొప్ప ఊపు లభించింది. పర్షియన్ ప్రభావం వల్లనే భారతీయులు ఖరోష్టి అనే ఒక నూతన లిపిని నేర్చుకున్నారు. మౌర్యుల శిల్పకళ మీద కూడా ఆకియేనియన్ శిల్పకళ ప్రభావం ప్రబలంగా ఉంది. ఇరానియన్ల ద్వారా భారత సంపద గురించి తెలుసుకున్న గ్రీకులు చివరికి అలెగ్జాండర్ నాయత్వంలో భారత్‌పై దాడి చేశారు.

మాసిడొనియన్ దండయాత్రలు
పర్షియన్ల తర్వాత భారత్‌పై దండెత్తిన రెండో విదేశీయులు గ్రీకులు. అలెగ్జాండర్ 20 ఏళ్ల వయసులో క్రీ.పూ. 334లో మాసిడొనియాకు రాజయ్యాడు. 329 నాటికి 3వ డేరియస్‌ను అంతంచేసి పర్షియా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. 328లో కాబూల్‌ను ఆక్రమించాక 327లో కైబర్ కనుమల ద్వారా హిందూకుష్ పర్వతాలను దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. అలెగ్జాండర్ బాక్ట్రియాలో ఉండగా తక్షశిల రాజకుమారుడు అంభి ఆహ్వానం లభించింది. జీలం, చినాబ్ ప్రాంతాల్లోని రాజైన పోరస్‌కు తక్షశిల రాజులకు మధ్య ఉన్న వైరం ఈ ఆహ్వానానికి కారణం. అలెగ్జాండర్ ఓహింద్ వద్ద సింధూ నదిని దాటాడు. క్రీ.పూ. 326కు జీలం నదిని (హైడాస్పస్) చేరాడు. అప్పటికీ తక్షశిలకు రాజుగా ఉన్న అంభి తన మద్దతును అందించాడు. ఇరు సేనలకు కార్సీ మైదాన ప్రాంతంలో భీకర యుద్ధం జరిగింది. పోరస్ ఓడినా అతని ధైర్య సాహసాలు మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. ఈ విజయానికి గుర్తుగా యుద్ధం జరిగిన ప్రదేశంలో బుకెషాలా, నికేయా నగరాలు నిర్మించాడు. ఈ విజయం తర్వాత అలెగ్జాండర్ బియాస్ నది ఒడ్డుకు చేరుకున్నాడు. బియాస్‌ను దాటి మగధపై దాడి చేయాలని భావించాడు. అప్పటికే సుదీర్ఘ కాలం మాతృభూమికి దూరంగా ఉన్న సేనలు అలెగ్జాండర్ ఆదేశాలను నిరాకరించాయి. దాంతో అలెగ్జాండర్ తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని నియార్కస్ నాయకత్వంలో సముద్ర మార్గం ద్వారా, మరో భాగాన్ని తన స్వీయనాయకత్వంలో భూమార్గం ద్వారా వెనుతిరిగాడు. మార్గమధ్యమంలో బాబిలోనియా వద్ద క్రీ.పూ. 323 జూన్‌లో 33 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించాడు.

భారతదేశాన్ని జయించాలనే అలెగ్జాండర్ కోరిక పూర్తిగా నెరవేరకపోయినా అనేక అంశాల్లో ఈ దండయాత్ర ప్రభావం ఉంది. ఈ దండయాత్ర వల్ల పంజాబ్, దాని పరిసర ప్రాంతాల్లోని ఆటవిక తెగలు బలహీన పడ్డాయి. దాంతో చంద్రగుప్త మౌర్యుడు సులువుగా ఆ తెగలను జయించి తన సామ్రాజ్య విస్తరణ చేయగలిగాడు. ఈ దండయాత్ర వల్లనే భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్య భూ, సముద్ర మార్గాలకు అవకాశం కలిగింది. భారత దేశ చరిత్ర రచనలోనూ అలెగ్జాండర్ చరిత్రకారుల రచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.

మాదిరి ప్రశ్నలు

1. షోడష మహాజనపదాల్లోని ఏకైక దక్షిణ భారత రాజ్యం ఏది?
1) అవంతీ రాజ్యం
2) అస్మక
3) కాంభోజ
4) శౌరసేన
2. కింది వాటిలో గణతంత్ర రాజ్యం కానిది?
1) కపిలవస్తు
2) కుశినార
3) వైశాలి
4) అవంతి
3. కింది వారిలో అజాతశత్రువుకు సమకాలీనులు కానివారు?
1) బుద్ధుడు
2) మస్కరి గోషల పుత్రుడు
3) మహావీరుడు
4) నాగసేనుడు
4. అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసిన సంవత్సరం?
1) 327 బి.సి.
2) 303 బి.సి.
3) 302 బి.సి.
4) 298 బి.సి.
5. భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీ
పాలకుడు?
1) సైరస్
2) డేరియస్-1
3) జెక్జెస్
4) డేరియస్-3
6. కింది వాటిలో సరికానిది?
1) బింబి సారుడు - శ్రేణిక
2) అజాతశత్రువు - కూనిక
3) కాలాశోకుడు - కాకవరిన్
4) మహా పద్మనందుడు - అగ్రామ్స్
7. అలెగ్జాండర్‌కు భారతీయ రాజు పౌరవునికి (పోరస్) ఏ నది ఒడ్డున యుద్ధం జరిగింది?
1) జీలం
2) చినాబ్
3) రావి
4) బియాస్
8. భారతదేశ చరిత్రలో తొలి పితృ హంతకుడిగా పేరున్న రాజు?
1) బింబిసారుడు
2) అజాతశత్రువు
3) ధననందుడు
4) అశోకుడు
9. రెండో పరశురాముడిగా పేరొందిన భారతీయ రాజు?
1) బిందుసారుడు
2) అశోకుడు
3) మహాపద్మనందుడు
4) అజాతశత్రువు
10. రెండో బౌద్ధ సంగీతి ఏ రాజు పాలనా కాలంలో జరిగింది?
1) శిశునాగుడు
2) అజాతశత్రువు
3) కాలాశోకుడు
4) అశోకుడు

సమాధానాలు
1) 2 2) 4 3) 4 4) 1 5) 1 6) 4 7) 1 8) 2 9) 3 10) 3












































#Tags