Skip to main content

మత ఉద్యమకారులు

మధ్యయుగ ప్రారంభంలో హిందూ, ముస్లిం మతాల్లో సమాంతరంగా రెండు మత ఉద్యమాలు జరిగాయి. అవి.. భక్తి, సూఫీ ఉద్యమాలు. ఈ రెండు ఉద్యమాలు సమాజంలో మూఢాచారాలను ఖండించాయి. ఈ రెండూ దేవుడి పట్ల భక్తికి తప్ప దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రేమ, స్వేచ్ఛ ఈ రెండు ఉద్యమాల్లో ముఖ్య లక్షణాలు.
భక్తి ఉద్యమం
  • భక్తి ఉద్యమం ముస్లిం పాలన వల్ల ప్రారంభమైంది అనేది నిజం కాదు. భక్తి అనే భావన చాలా ప్రాచీనమైంది. ఆర్యుల కాలంలోనే ఉపనిషత్తులు, భాగవతం మొదలైనవాటికి పెద్దపీట వేశారు.
  • ప్రాచీన యుగ చివరి దశలో ఆళ్వార్లు, నాయనార్లు భక్తి గొప్పతనాన్ని తెలియజేశారు.
  • మళ్లీ మధ్యయుగ ప్రారంభంలో శంకరాచార్యులు భక్తి ఉద్యమాన్ని దేశం నలువైపులా ప్రచారం చేశారు. తర్వాత ఎందరో భక్తి ఉద్యమకారులు వివిధ ప్రాంతాల్లో భక్తి ప్రాధాన్యతను వివరించారు.

భక్తి ఉద్యమకారులు
వీరిలో సుగుణ భక్తి, నిర్గుణ భక్తి అనే రెండు రకాల భక్తిని ప్రబోధించిన వారున్నారు.

శంకరాచార్యులు
  • కేరళలోని కాలడిలో జన్మించారు. 8వ శతాబ్దానికి చెందినవారు.
  • తండ్రి శివ గురువు, తల్లి ఆర్యాంబ.
  • గురువు గోవింద పాదాచార్యులు. శంకరులు తన 8వ ఏటనే సన్యాసం స్వీకరించారు.
  • శంకరుల సిద్ధాంతం అద్వైతం. అంటే ఉన్నది పరమాత్మ ఒక్కడే. ప్రపంచమంతా మాయ.
  • అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారిని స్మార్థులు అంటారు.
  • శంకరులు బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకు వ్యాఖ్యానాలు రచించారు.
  • శంకరులు తన సిద్ధాంతాల ప్రచారం కోసం భారత్‌లో నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలు స్థాపించారు. అవి..
    దిక్కు స్థలం రాష్ర్టం
    1. ఉత్తరం బదరీనాథ్ జమ్ముకాశ్మీర్
    2. దక్షిణం శృంగేరి కర్ణాటక
    3. తూర్పు పూరి ఒడిశా
    4. పశ్చిమ ద్వారక గుజరాత్
  • సాంప్రదాయం ప్రకారం కంచిలో కూడా శంకారాచార్యులే మఠాన్ని ఏర్పాటు చేశారని అంటారు.

రామానుజాచార్యులు
  • తమిళనాడులో శ్రీ పెరంబదూరులో క్రీ.శ. 1017లో జన్మించారు. క్రీ.శ.1137లో పరమపదించారు.
  • ఈయన సిద్ధాంతం.. విశిష్టాద్వైతం
  • బ్రహ్మసూత్రాలకు ‘శ్రీభాష్యం’ అనే వ్యాఖ్యాన గ్రంథం రచించారు.
  • వేదాంత సారం, వేదాంత దీపం, భగత్ రత్నకార్, గీతా భాష్యం తదితర గ్రంథాలను రాశారు.
  • కుళోత్తుంగుని ఆగ్రహం వల్ల చాళుక్య.. చోళ రాజ్యం విడిచి హోయసాల రాజ్యానికి వెళ్లిపోయారు.
  • ద్వైత, అద్వైత సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ బేధాబేధ సిద్ధాంతాన్ని రూపొందించిన నింబార్కుడు.. రామానుజాచార్యకు సమకాలీనుడు.

మధ్వాచార్యులు
  • కర్ణాటకలో జన్మించారు. ఈయన పూర్వనామం.. వాసుదేవుడు.
  • శంకరుల, రామానుజుల సిద్ధాంతాలకు భిన్నంగా ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
  • ద్వైత సిద్ధాంతం ప్రకారం ఆత్మ, పరమాత్మ వేర్వేరుగా ఉంటాయి.
  • ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు.

రామానంద
  • భక్తి ఉద్యమకారుల్లో అగ్రగణ్యులు. ఈయన 15వ శతాబ్దంలో జీవించారు.
  • క్రీ.శ.1400లో జన్మించి 1470లో పరమపదించారు.
  • ఉత్తర భారతదేశ మొదటి భక్తి ఉద్యమ కారుడు.
  • కుల, మత బేధాలకు అతీతంగా వివిధ నిమ్న కులాల నుంచి ఎంతోమందిని శిష్యులుగా స్వీకరించారు.
  • రామ భక్తిని చాటారు. హిందీలో బోధనలు చేసి ప్రజలకు చేరువయ్యారు.
  • ముస్లిం అయిన కబీర్, చెప్పులు కుట్టే కులానికి చెందిన రామ్‌దాస్, మంగలి కులానికి చెందిన సైన్థాస్, రైతైన ధన, ఇలా ఎన్నో వర్గాలకు చెందినవారు రామానంద శిష్యుల్లో ఉన్నారు.

కబీర్
  • క్రీ.శ.1440-1518 మధ్య కాలంలో జీవించారు.
  • బ్రాహ్మణ వితంతువుకు జన్మించినా, ముస్లిం నేత పనివారి ఇంట్లో పెరిగారు.
  • రామ భక్తిని ప్రబోధించడమే కాకుండా హిందూ, ముస్లిం ఐక్యతకు కృషి చేశారు.
  • సమాజంలోని మూఢాచారాలను చతురతతో చిన్న చిన్న పద్యాలతో వివరించారు. వాటిని దోహాలు అంటారు.
  • కబీర్ దోహాలను ‘బిజక’ అనే పేరుతో సంకలనం చేశారు.
  • కబీర్ ఢిల్లీ సుల్తానత్‌ను పాలించిన సికిందర్‌లోడీకి సమకాలికుడు.
  • కబీర్ భార్య లోయ, కుమారుడు కమల్.
  • కబీర్ మరణానంతరం ఆయన ముస్లిం శిష్యులు మఘర్ శాఖగా ఏర్పడ్డారు.

దాదూ దయాళ్
  • కబీర్ శిష్యుల్లో ముఖ్యుడు దాదూ దయాళ్. క్రీ.శ.1544లో అహ్మదాబాద్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1603లో పరమపదించారు.
  • సమాజంలో ఉన్న వివిధ నమ్మకాలను ఒకే సిద్ధాంతంగా మార్చడానికి బ్రహ్మ సంప్రదాయ/ పరబ్రహ్మ సంప్రదాయ అనే విధానాన్ని సృష్టించారు.
  • ఇతరుల బోధనలన్నింటినీ సేకరించిన మొదటి వ్యక్తి.
  • దాదూ అంటే అన్న, దయాళ్ అంటే జాలి అని అర్థం.

గురునానక్
  • క్రీ.శ. 1469లో పంజాబ్‌లో ‘తల్వండి’లో జన్మించారు.
  • హిందూ, ముస్లింలే కాకుండా వివిధ మతాలు, కులాల మధ్య సమానత్వానికి ప్రయత్నించారు. గురుకాలంగర్ అనే సామూహిక వంటశాలలుప్రారంభించారు.
  • ఈయన బోధనలు గురు గ్రంథ సాహెబ్/ఆది గ్రంథ్‌లో సంకలనం చేశారు.
  • క్రీ.శ. 1539లో పంజాబ్‌లో కర్తార్‌పూర్‌లో మరణించారు.
  • ఇతని తదనంతరం శిష్యులు సిక్కు మతంగా రూపాంతరం చెందారు.

వల్లభాచార్యులు
  • క్రీ.శ.1479లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
  • ఈయన శుద్ధ ద్వైతాన్ని ప్రబోధించారు. భక్తి మార్గాన్ని పుష్టి మార్గం అంటారు.
  • ఈయన రాధాకృష్ణుల మధుర భక్తిని ప్రబోధించారు.
  • శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికులు. సిద్ధాంతి రహస్యం, సుబోధిని తదితర గ్రంథాలు రచించారు.
  • కృష్ణుణ్ని ‘శ్రీనాథ్‌జీ’ అనే పేరుతో పూజించారు.
  • క్రీ.శ. 1531లో పరమపదించారు.

చైతన్యుడు
  • క్రీ.శ.1486లో బెంగాల్‌లో నవద్వీపంలో జన్మించారు. విశ్వంభర అనేది ఇతని పూర్వనామం.
  • భక్తి ఉద్యమకారులందరిలో విశిష్టుడు.
  • శచి, జగన్నాధ మిశ్రాలు ఇతని తల్లిదండ్రులు.
  • ఈయన తన చదువును పూర్తిచేసిన తర్వాత విద్యాసాగరుడు అని ప్రజలు పిలిచేవారు.
  • ఈశ్వరపురి అనే గురువు ద్వారా సన్యాసం స్వీకరించారు.
  • పూరిలో నివసించారు. ఇక్కడే క్రీ.శ.1533లో పరమపదించారు.
  • ఈయన మరణానంతరం శిష్యులు గౌడ వైష్ణవశాఖగా ఏర్పడ్డారు.

మీరాబాయి
  • మీరాబాయి క్రీ.శ. 1498-1557 మధ్య జీవించింది.
  • ఈమె ఓ రాజపుత్ర యువరాణి. మేవార్‌ను పాలించిన రతన్‌సింగ్ కుమార్తె.
  • ఈమెకు రాణా సంగ్రామ సింహా పెద్ద కుమారుడైన భోజ రాజుతో క్రీ.శ. 1516 లో వివాహం జరిగింది.
  • భర్త అకాల మరణం తర్వాత కృష్ణుణ్ని మధుర భక్తితో ఆరాధించింది. ఈమె బ్రిజ్ భాష, గుజరాతీ, రాజస్థానీ తదితర భాషల్లో ఎన్నో పద్యాలు రచించింది.

సూరదాసు
  • 16వ శతాబ్దానికి చెందినవారు.
  • రాధా, కృష్ణ భక్తిని అనుసరించారు.
  • సూర్ సారవళి, సాహిత్య రత్న, సూర్ సాగర్ తదితర గ్రంథాలు రచించారు.
  • కృష్ణుణ్ని చిన్న కృష్ణుడిగా ఎక్కువగా ఆరాధించారు.
  • అంధుడు. ‘ఆగ్రా అంధకవి’ అని ఈయనను పిలిచేవారు.
  • వల్లభాచార్య శిష్యులను ‘అష్టచివ’ కవులంటారు. వారందరిలోనూ సూరదాస్ అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు.

తులసీదాసు
  • ఈయన క్రీ.శ. 1532-1623 మధ్య కాలంలో జీవించారు.
  • రామభక్తిని ప్రబోధించారు.
  • రామచరితమానస్ అనే ప్రముఖ గ్రంథంతోపాటు గీతావళి, కవితావళి, వినయపత్రిక తదితరాలు ఆయన రచనలు.
  • ఇతను అక్బర్ సమకాలికుడు.

జ్ఞానదేవ్
  • 13వ శతాబ్దానికి చెందిన మహారాష్ర్ట భక్తి ఉద్యమకారుడు.. జ్ఞానదేవ్
  • విఠలుని భక్తుడు. భగవద్గీతపై ‘జ్ఞానేశ్వరి’ పేరుతో మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాశారు.
  • అమృతానుభవ, చెంగదేవ ప్రశస్తి అనే ఇతర గ్రంథాలు కూడా రచించారు.
  • వర్ణ వ్యవస్థ, మూఢాచారాలను ఖండించారు.

నామ దేవుడు
  • 14వ శతాబ్దానికి చెందిన మహారాష్ర్ట భక్తి ఉద్యమకారుడు.
  • పండరీపురం కేంద్రంగా భక్తిని ప్రబోధించారు. ‘విఠోభాకేశర’ అనే గురువు నుంచి సన్యాస దీక్ష తీసుకున్నారు.
  • మరాఠీ భాషలో ఎన్నో పద్యాలు రాయడమే కాకుండా, పరకాఠీ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • నామదేవుడి రచనలను అభంగములు అంటారు.
Published date : 19 Aug 2016 12:33PM

Photo Stories