Inter Exam Fee 2024: నేడే చివరి తేదీ... రేపటి నుంచి అపరాధ రుసుముతో...

Inter Exam Fee 2024: నేడే చివరి తేదీ... రేపటి నుంచి అపరాధ రుసుముతో...

విద్యారణ్యపురి: ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లించాలని హనుమకొండ డీఐఈఓ గోపాల్‌ విద్యార్థులను సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రెగ్యులర్‌, ఫెయిల్‌ అయినవారు (జనరల్‌, అండ్‌ ఒకేషనల్‌), అటెండెన్స్‌ మినహాయింపుతో ప్రైవేట్‌ అభ్యర్థులు (వితౌట్‌ కాలేజీ స్టడీస్‌) పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఈనెల 14వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. రూ.100 అపరాధ రుసుముతో 23వతేదీ వరకు, రూ.500ల అపరాధ రుసుముతో డిసెంబర్‌ 4 వరకు, రూ.1,000 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 13వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 20వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కాగా.. మొదటి సంవత్సరం జనరల్‌ కోర్సుల విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.510, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు రూ.730, సెకండియర్‌ జనరల్‌ కోర్సులకు (ఆర్ట్స్‌) విద్యార్థులకు రూ.510, సెకండియర్‌ జనరల్‌ సైన్స్‌, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు రూ.730 చెల్లించాల్సి ఉంటుందని గోపాల్‌ తెలిపారు.

వాయిదా పడిన పరీక్షలు - 15 నుంచి నిర్వహణ

కేయూ క్యాంపస్‌: దీపావళి నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన పరీక్షలను ఈనెల 15న నిర్వహించనున్నారు. 13న నిర్వహించాల్సిన ప్రత్యేక బ్యాక్‌లాగ్‌ డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షల్ని ఈనెల 15న నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి సోమవారం తెలిపారు. అదేవిధంగా ఈనెల 13న జరగాల్సి న బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు కూడా ఈనెల 15న నిర్వహించనున్నట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు.
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల (అటానమస్‌)లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ మూడో సంవత్సరం, 5వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 14 నుంచి, డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బన్న అయిలయ్య సోమవారం తెలిపారు. ఐదో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 14, 16, 18, 21, 23, 25, డిసెంబర్‌ 1, 5, 7 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 15, 17, 20, 22, 24, 28, డిసెంబర్‌ 2, 4, 6, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15, 17 తేదీల్లో పరీక్షలు మాత్రమే మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మిగతా ఈనెల 20 నుంచి జరిగే పరీక్షలన్నీ ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని ప్రిన్సిపాల్‌ తెలిపారు.
 

డిగ్రీ ప్రయోగ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో డిగ్రీ మూడేళ్ల సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి తెలిపారు. కేయూ డిగ్రీ మొదటి సంవత్సరం ప్రయోగ పరీక్షలు ఈనెల 21, 22 తేదీల్లో, ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు ఈనెల 18, 20 తేదీల్లోనూ, మూడో సంవత్సరం ప్రయోగ పరీక్షలు ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాకు చెందిన విద్యార్థులు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఖమ్మం జిల్లా విద్యార్థులకు ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాలలో, ఆదిలాబాద్‌కు చెందిన విద్యార్థులకు ఆదిలాబాద్‌ ప్రభుత్వ బాలురు పరీక్ష కేంద్రంలో ఈప్రయోగ పరీక్షలకు హాజరుకావాలని వారు కోరారు. అందుకు సంబంధించిన జాబితాలను కేయూలోని పరీక్షల విభాగంలో అందించాలని వారు కోరారు.

ఇంటర్నల్‌ పరీక్షలు 23, 24 తేదీల్లో

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అంతర్గత (ఇంటర్నెల్‌) పరీక్షలు ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి తెలిపారు. అందుకు సంబంధించిన మార్కులను ఈనెల 25 వరకు కేయూ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని వారు కోరారు. పూర్తి వివరాలను కాకతీయ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు.
 

#Tags