Inter Exams: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రశ్నపత్రాలు ఇలా..

భూపాలపల్లి: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు.

 ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై జ‌నవ‌రి 29న‌ సంబంధిత అధికారులతో తన చాంబర్‌లో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ధేశించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వరకు (ప్రాక్టికల్స్‌) ప్రయోగ పరీక్షలు, ఫిబ్రవరి 28నుంచి మార్చి 19వరకు ఇంటర్‌ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

మొదటి సంవత్సరం 2,161మంది, రెండవ సంవత్సరం 1,764మంది మొత్తంగా 3,925 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఇందుకు గాను 8 సెంటర్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని సూచించారు.

ప్రతీ పరీక్ష కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏఎన్‌ఎం స్థాయిలో వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ చేసేందుకు పోలీస్‌స్టేషన్‌లలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

సెంటర్లలో మాస్‌ కాపీయింగ్‌, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు ధైర్యం చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌ కుమార్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి దేవరాజు, డీపీఆర్‌ఓ వి.శ్రీధర్‌, డీఈఓ రాంకుమార్‌, డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

#Tags