Tenth Class Exams: ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి.. పరీక్షలకు సన్నద్ధం.

పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు లక్ష్యంగా జగిత్యాల జిల్లా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది.

పరీక్షలకు మరో 42 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రైవేట్‌కు ధీటుగా సర్కారు బడుల్లో ఫలితాలు సాధించేందుకు నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతే పునాది కావడంతో విద్యార్థులు మా నసిక ఒత్తిడికి గురికాకుండా ప్రత్యే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నిత్యం రెండు గంటలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాకుండా.. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సబ్జెక్టుల వారిగా తర్ఫీదు అందిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వందశాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.

జిల్లాలో ఇలా..
జిల్లాలో ప్రభుత్వ హైస్కూళ్లు 187 ఉన్నాయి. ఇందులో మొత్తంగా 24,239 మంది చదువుతున్నారు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో పరిశీలిస్తే.. గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, వెల్గటూర్‌, బుగ్గారం, ఎండపల్లి మండలాల్లో 47 హైస్కూళ్లు, మోడల్‌ స్కూళ్లు, నాలుగు, కేజిబీవీలు నాలుగు, మైనార్టీ పాఠశాల ఒకటి, జ్యోతీరావుబాపూలే ఒకటి చొప్పున మొత్తం 58 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 10వ తరగతి చదివే విద్యార్థులు 1,658 మంది ఉన్నారు. అన్ని సర్కారు బడుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ సన్నద్ధం చేస్తున్నారు. 

ఒత్తిడిని అధిగమించాలి.. 
ఉపాధ్యాయులు పాఠ్యాంశభోదనే కాకుండా వారికి ప్రేరణ కలిగే విషయాలను చెబుతూ ఉత్తేజ పరుస్తున్నారు. ఈ ఏడాది ఎవరు పదికి పది గ్రేడ్‌ సాధిస్తారో వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని ఆసక్తి కల్పిస్తున్నారు. ఆయా విద్యార్థులు సామర్థ్యాలను బట్టి వారికి తగిన సలహాలు, సూచనలు కూడా అందిస్తున్నారు. పరీక్షలపై భయం వీడి పాఠ్యంశాలపై ఎలా దృష్టి సారించాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

భవిష్యత్‌కు పునాది..
విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించేది పదో తరగతి. గతంలో పది పరీక్షలకు 11 పేపర్లు ఉండగా రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఏడు పేపర్లకు కుదించింది. ఒక్కో పేపరు పరీక్ష నిర్వహణ సమయం 3గంటలు ఉంటుంది. ఇందులో బయాలజీ, ఫిజిక్స్‌, కె మిస్ట్రీకి మాత్రమే గంటన్నర చొప్పున ఉంటుంది.

ప్రత్యేక తరగతులు ఇలా..
విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 9.30 గంటలపాటు ఒక సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి.. మధ్యాహ్నం 3గంటలకు ఆ సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 నుంచి 6 వరకు రోజుకు మొత్తంగా రెండున్నర గంటలపాటు ప్రత్యేక స్టడీఅవర్స్‌ నిర్వహించి సబ్జెక్టులపై తర్ఫీదు ఇస్తున్నారు.

ప్రత్యేక క్లాస్‌లు..
పదో తరగతి చదువుతున్న మేము ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు రోజుకు రెండున్నర గంటలు ప్రత్యేక స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పరీక్షలు పెడుతూ వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తున్నారు. వంద శాతం ఫలితాలు సాధించేలా చొరవ తీసుకుంటున్నారు. – అస్మిత, పదో తరగతి

చొరవ బాగుంది..
ఉదయం, సాయంత్రం స్పెషల్‌ క్లాసుల్లో పాల్గొంటున్న వారికి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. దాతలు సహకారం అందిస్తున్నారు. మాలాంటి విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ప్రత్యేక చొరవ తీసుకుని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రేరణ కలిగిస్తున్నారు. – విగ్నేష్‌, పదో తరగతి

లక్ష్యం చేరుకోవాలి..
మండలంలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఒక లక్ష్యాన్ని నిర్ణయించాం. ఆ మేరకు చేరుకోవాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. అందుకు తగ్గట్టుగానే ఉపాధ్యాయులు తమ ప్రయత్నాలు చేస్తూ ప్రత్యేక తరగతులపై దృష్టి సారిస్తున్నారు. – జమునాదేవి, ఎంఈవో గొల్లపల్లి

#Tags