Rajarshi Shah, IAS: ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు.. ఉపాధ్యాయురాలి వద్దకు వెళ్లి అవార్డు ప్రదానం

ఆదిలాబాద్‌ టౌన్‌: ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఎంపికై న 79 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సెప్టెంబర్ 5న‌ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు.

శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే గౌరవం ఉంటుందన్నారు. ఎక్కువ సమయం గురువుల వద్దనే విద్యార్థులు గడుపుతారన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సర్కారు బడుల బలోపేతం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
కేరళ రాష్ట్రంలో సమాజాన్ని భాగస్వామ్యం చేయడంతో ఆ ప్రాంతం విద్య పరంగా అభివృద్ధి చెందిందన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. సైన్స్‌ఫేర్‌లో నూతన ఆవిష్కరణలు తయారు చేసేలా ప్రోత్సహించాలన్నారు. తనకు బోధించిన గురువుల కృషితోనే ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నారు.

చదవండి: Kavita Teacher: ఆటపాటలతో పాఠాలు.. కవిత టీచర్‌ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం
ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాలన్నారు. ఇటీవల జరిగిన బదిలీల సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలను విడిచివెళ్తున్న సమయంలో విద్యార్థులు కంటతడి పెట్టారని, వారికి నాణ్యమైన బోధన చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు.
అంతకుముందు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యమే కీలకమన్నారు. పేద ప్రజలు తమ పిల్లల్ని లక్షలు వెచ్చించి కార్పొరేట్‌ బడుల్లో చదివించే స్థితిలో లేరని, సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు హక్కులతో పాటు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి తనవంతుగా కృషి చేస్తానన్నారు.

చదవండి: National Teachers Award: తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన ఏకైక వ్య‌క్తి ఈమెనే..

దివ్యాంగ ఉపాధ్యాయురాలి వద్దకు వెళ్లి అవార్డు ప్రదానం

గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న దివ్యాంగురాలు పద్మ సమావేశ మందిరంలో కూర్చున్న చోటికి వెళ్లి కలెక్టర్‌, ఎమ్మెల్యే, డీఈవో అవార్డు అందజేశారు. ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.
తలమడుగు మండలంలోని పల్లి(బి) పాఠశాలలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంఈవో సోమయ్య, సూపరింటెండెంట్‌ రమణ, సెక్టోరియల్‌ అధికారులు ఉదయశ్రీ, సుజాత్‌ ఖాన్‌, ఓపెన్‌స్కూల్‌ కోఆర్డినేటర్‌ అశోక్‌, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కుడాల రవీందర్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, శ్రీకాంత్‌, సోగల సుదర్శన్‌, బి.రవీంద్ర, వలభోజు గోపికృష్ణ, పార్థసారథి, అశోక్‌, నరేందర్‌, వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.
 

#Tags