Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షల్లో 237 పరీక్ష కేంద్రాలు... 50,946 మంది విద్యార్థులు

Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షల్లో 237 పరీక్ష కేంద్రాలు... 50,946 మంది విద్యార్థులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శశాంక తెలిపారు. రాజేంద్రనగర్‌ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్‌, భూపాల్‌రెడ్డి, డీఆర్‌ఓ సంగీత, జిల్లా విద్యాధికారి సుశీందర్‌ రావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరీక్షలను సజావుగా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని సూచించారు.

237 పరీక్ష కేంద్రాలు.. 50,946 మంది విద్యార్థులు

ఈనెల 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 237 పరీక్ష కేంద్రాల్లో 50,946 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు 37 పోలీస్‌ స్టేషన్లను గుర్తించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్‌, వాచ్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించ కూడదని అన్నారు. ప్రతి కేంద్రంలో మొబైల్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయించాలని సూచించారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

పరీక్ష కేంద్రం వద్ద అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎంలు, సిబ్బంది నియమించాలని వైద్యాధికారికి సూచించారు. ఫర్నిచర్‌, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష సమ యాలను దృష్టిలో పెట్టుకొని బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సరైన సమయంలో చేరుకునేలా ఉదయం గంట ముందు బస్సులు నడపాలని, పరీక్ష రాసిన తర్వాత ఇళ్లకు చేరుకునేలా చూడాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు.

సమన్వయంతో పనిచేయాలి

పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు వీలుగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించినట్టు చెప్పారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు చూడాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మహిళా కానిస్టేబుల్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

#Tags