New Zealand Post Study Work Visa: నూతన పోస్ట్ స్టడీ వర్క్ వీసా విధానం !.. భారతీయ విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు..
న్యూజిలాండ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం–ఆ దేశంలో 30 వారాల వ్యవధిలోని పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని ఆ తర్వాత మాస్టర్స్ (పీజీ) కోర్సులో ప్రవేశం పొందినవారు.. పోస్ట్ స్టడీ వర్క్‌కు అర్హత పొందుతారు. ఉదాహరణకు.. మేనేజ్‌మెంట్ విభాగంలో 30 వారాల వ్యవధిలోని పీజీ డిప్లొమా పూర్తి చేసుకుని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రవేశం పొందితే.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి అవకాశం ఉండేది కాదు. ఇప్పటి వరకు మాస్టర్ కోర్సులు (పీజీ) కోర్సులు పూర్తి చేసిన వారికే పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం ఉండేది.
చదువుకుంటూనే ఉద్యోగం
తాజాగా పీజీ బదులు పీజీ డిప్లొమా పూర్తి చేసుకున్న వారికి కూడా పోస్ట్ స్టడీ వర్క్ వీసా కల్పించడం వల్ల విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే.. మరో వైపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. పీజీ కోర్సు పూర్తయిన తర్వాత స్టూడెంట్ వీసాతో మరో 12 నెలలు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే మూడేళ్ల వ్యవధికి పోస్ట్ స్టడీ వర్క్ వీసా మంజూరు చేస్తారు.
జాబితాలోని కోర్సులు
న్యూజిలాండ్ పోస్ట్ స్టడీ వర్క్ నిబంధనలను అనుసరించి న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం–లెవల్ 7లో ఉన్న ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకోవాలి. లెవల్–7లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, టీచింగ్, కన్‌స్ట్రక్షన్, అగ్రికల్చర్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ జాబితాలో లేని కోర్సులను అభ్యసించిన వారు.. ఆ కోర్సు ముగిశాక 12 నెలలలోపు కనీసం పీజీ డిప్లొమా స్థాయిలో లెవెల్ –7లోని కోర్సులు పూర్తి చేసుకుంటే.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
చదవండి: US Embassy Announces Recruitment: 'యూఎస్ ఎంబసీ రిక్రూట్‌మెంట్' ప్రోగ్రామ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం..
జీవిత భాగస్వాములకు అవకాశం
న్యూజిలాండ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా విధానం ద్వారా ఉద్యోగం పొందిన వారు.. తమ జీవిత భాగస్వాములను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. వారు సైతం న్యూజిలాండ్ గ్రీన్ లిస్ట్‌లో ఉన్న కోర్సులను అనుసరించి.. అర్హతకు సరితూగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం లభిస్తే వారికి కూడా వర్క్ వీసా మంజూరు చేస్తారు.
వీసా ఫీజుల పెంపు
పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలను సరళీకృతం చేసిన న్యూజిలాండ్ ప్రభుత్వం.. స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజులను మాత్రం పెంచింది. ఇప్పటి వరకు 300 న్యూజిలాండ్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని.. 485 న్యూజిలాండ్ డాలర్లకు పెంచింది.
చదవండి: Foreign Education : విదేశీ విద్య కోసం ఈ పరీక్షల కోచింగ్‌కు దరఖాస్తులు
స్పాన్సర్‌షిప్ లెటర్
పోస్ట్ స్టడీ వర్క్ వీసా పొందే క్రమంలో.. విద్యార్థులు ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు ఉద్యోగం అర్హతలకు సరితూగే విభాగానికి సంబంధించినదై ఉండాలి. అదే విధంగా న్యూజిలాండ్ ప్రభుత్వం విధించిన కనీస వేతన పరిమితికి అనుగుణంగా వేతనం ఉండాలి. గంటకు 23.15 న్యూజిలాండ్ డాలర్లు, రోజుకు 185.20 న్యూజిలాండ్ డాలర్లు,వారానికి 926 న్యూజిలాండ్ డాలర్లు చొప్పున కనీస వేతనం ఉండాలి. ఆయా అర్హతలకు అనుగుణంగా వీటిని పెంచి ఇచ్చే అవకాశం ఉంటుంది.
భారత విద్యార్థులకు మేలు
న్యూజిలాండ్ తాజా విధానంతో.. భారత విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం న్యూజిలాండ్‌లో అడుగు పెడుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత విద్యార్థులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2023లో న్యూజిలాండ్‌లో 55 వేలకుపైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో భారత విద్యార్థులు 11 శాతం మేర ఉన్నారు. వీరంతా తాజా వీసా విధానంతో ప్రయోజనం పొందే వీలుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
విభిన్న కోర్సులు
న్యూజిలాండ్‌లో ప్రపంచ టాప్ యూనివర్సిటీలు, విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే ఎంఎస్, ఇంజనీరింగ్,మేనేజ్‌మెంట్‌తోపాటు కామర్స్, హ్యుమానిటీస్, మెడిసిన్, ఐటీ, ప్యూర్ సైన్సెస్ వంటి విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సులను అక్కడి ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్నాయి.
14 నెలల నుంచి 24 నెలల వరకు
న్యూజిలాండ్‌లో కోర్సుల వ్యవధి అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ను అనుసరించి యూనివర్సిటీ నిబంధనల మేరకు 14 నెలల నుంచి 24 నెలల వరకు ఉంటోంది. ఈ సమయంలో యూనివర్సిటీలు అప్పటికే పలు పరిశ్రమలతో కుదుర్చుకున్న ఇండస్ట్రీ ఎక్సే్ఛంజ్ కొలాబరేషన్స్ ఆధారంగా సదరు సంస్థల్లో రియల్ టైం ఎక్స్‌పోజర్ లభించే విధంగా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా అందుబాటులో ఉంది.
ఫీజుల భారం
న్యూజిలాండ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు 20 వేల నుంచి 40 వేల న్యూజిలాండ్ డాలర్లుగా; పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు 20 వేల న్యూజిలాండ్ డాలర్ల నుంచి 45 వేల న్యూజిలాండ్ డాలర్ల మధ్యలో ఉంటుంది.
స్కాలర్‌షిప్స్ తోడ్పాటు
విద్యార్థులకు ఫీజుల విషయంలో ఆర్థిక తోడ్పాటును కూడా అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. విదేశీ విద్యార్థులను ఆకర్షించాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్ సర్కారు యూనివర్సిటీల ఫీజుల నుంచి మినహాయింపు లభించేలా స్కాలర్‌షిప్ పథకాలను అందిస్తోంది. ప్రైవేటు ఎన్‌జీఓలు సైతం విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ఇలా ఏటా వందకు పైగా స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. వీటికోసం అభ్యర్థులు తమ డిపార్ట్‌మెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పాపులర్ కోర్సులు
న్యూజిలాండ్‌లో ప్రస్తుతం పీజీ స్థాయిలో ఆదరణ పొందుతున్న కోర్సులు.. ఎంబీఏ(వ్యవధి: 14 నెలల నుంచి 24 నెలలు), ఇంజనీరింగ్(వ్యవధి రెండేళ్లు), ప్రొఫెషనల్ అకౌంటింగ్ (12 నెలల నుంచి 18 నెలలు), పీజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సైన్స్ (12 నెలల నుంచి 16 నెలలు), మాస్టర్ ఆఫ్ టూరిజం (18 నెలల నుంచి 24 నెలల వ్యవధి).
స్టాండర్ టెస్ట్ స్కోర్స్
న్యూజిలాండ్‌లోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుల ఆధారంగా స్టాండర్ టెస్ట్ స్కోర్లు తప్పనిసరి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోల్చుకుంటే.. ఇక్కడి యూనివర్సిటీలు నిర్దేశించే స్కోర్లు కొంత తక్కువగా ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మేనేజ్‌మెంట్ పీజీ విద్యార్థులు జీమ్యాట్ 600 స్కోర్‌తో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల విద్యార్థులు 250 నుంచి 300 స్కోర్‌తో అడ్మిషన్ ఖరారు చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీలు ఈ స్థాయి స్కోర్లు లేకున్నా.. అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి.
డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్
న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం–ప్రస్తుతం ఇమ్మిడియేట్ స్కిల్ షార్టేజ్ లిస్ట్‌లో.. ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్, అగ్రికల్చర్, హెల్త్ అండ్ సోషల్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టూరిజం, హాస్పిటాలిటీ విభాగాలు ముందంజలో ఉన్నాయి.
ముఖ్యాంశాలు
- తాజాగా పోస్ట్ స్టడీ వర్క్ నిబంధనల
- సరళీకృతం.
- 30 వారాల వ్యవధిలో పీజీ డిప్లొమా అర్హతగా మాస్టర్స్ చేస్తే పోస్ట్ స్టడీ వర్క్ వీసా.
- కోర్సు పూర్తయ్యాక 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ అవకాశం.
- ఉద్యోగం సొంతమయ్యాక మూడేళ్లపాటు పోస్ట్ స్టడీ వర్క్, తర్వాత దానిని పొడిగించుకునే అవకాశం
- విదేశీ విద్యార్థుల్లో రెండో స్థానంలో భారత విద్యార్థులు
- ఉపయోగపడే వెబ్‌సైట్స్: www.immigration.govt.nz/newzealandvisas/visas/visa/poststudyworkvisa