Anganwadi Workers Problems : మా అంగన్‌వాడీల స‌మ‌స్య‌ల‌కు దారేది..? మా బ‌తుకులు ఇంతేనా..?

మేము చేసేది చిరుద్యోగం. చాలీచాలని జీతం.. అన్నీ ముందస్తుగా చెల్లిస్తూ ఎప్పటికో కానీ వచ్చే బిల్లుల కోసం ఎదురుచూసే తెలంగాణ‌లోని అంగన్‌వాడీలకు కరెంట్‌ బిల్లులు మరింత భారం అవుతున్నాయి. తిరిగి వచ్చే విధానం అమల్లో లేకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లు సొంతంగానే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది.

ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండగా.. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాగే, కాలం వెళ్లదీస్తున్నారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం హయాంలో జీతాలు ఎప్పడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేకపోయినా కరెంట్‌ బిల్లుల విషయంలోనూ కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

మా అవస్థలు ఎవ‌రికి చెప్పాలి..?
అంగన్‌వాడీ టీచర్లు కేంద్రాలకు సంబంధించి ప్రతినెల కరెంట్‌ బిల్లు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఏడు ప్రాజెక్టులకు గాను 1,837 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అద్దె భవనాల్లో, ఇంకొన్ని సొంత భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. భవనం ఏదైనా విద్యుత్‌ బిల్లుల సమస్య మాత్రం అంతటా ఉంది. కరెంట్‌ బిల్లులు చెల్లించేందుకు ఏ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో జీతంలో నుంచే చెల్లించాల్సి వస్తోందని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు.
పట్టించుకోని గత ప్రభుత్వం

సమస్యలపై ఎన్నిసార్లు పాలకులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని టీచర్లు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరవై రోజుల పాటు అందోళన చేసినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కాగా శాఖలన్నింటికీ ప్రభుత్వం ఇతర ఖర్చుల కింద(మిస్‌లేనియస్‌) కొంత మేర నిధులు కేటాయిస్తుంది. కానీ గర్భిణులు మొదలు శిశువుల ఆలనాపాలన చూసే అంగన్‌వాడీలకు తక్కువ జీతాలు అందుతుండగా.. విద్యుత్‌ బిల్లులు, ఇతర ఖర్చులకు సైతం గ్రాంట్‌ అందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇప్పుడైనా పరిష్కారమయ్యేనా..?
జిల్లాలోని 1,837 అంగన్వాడీ కేంద్రాలకు నెలనెలా రూ.250 నుంచి రూ.300 మేర విద్యుత్‌ బిల్లు వస్తుంది. అంటే జిల్లాలో రూ.4 లక్షల మేర బిల్లులను అంగన్‌వాడీ టీచర్లే ఏళ్ల తరబడి చెల్లిస్తున్నారు. తద్వారా ఒక్కో టీచర్‌ ఏటా రూ.3వేలు కరెంట్‌ బిల్లుకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ప్రభుత్వం ఈ సమస్యకు దారి చూపలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమ ఆవేదను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.

బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వ గ్రాంట్‌ లేదు..
తెలంగాణ‌లో అంగన్‌వాడీల్లో విద్యుత్‌ బిల్లుల సమస్య ఉంది. బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వ గ్రాంట్‌ లేదు. కొన్ని కేంద్రాల్లో మీటర్లు లేకపోవడంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా రూ.20 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. ఇప్పటికే మీటర్లు ఉన్న కేంద్రాలతో పాటు కొత్తగా మీటర్లు అమర్చే చోట బిల్లుల చెల్లింపు సమస్యను కలెక్టర్‌కు విన్నవిస్తాం.
                                       – టి.సుమ, జిల్లా సంక్షేమ అధికారి

#Tags