TS CPGET 2024: పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు.. ఈ కారణంగా జూలై 7న జరిగే పరీక్ష వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ (హై దరాబాద్‌): రాష్ట్రవ్యాప్తంగా జూలై 6న ప్రారంభం కానున్న వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు జూలై 3న‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌ సీపీజీఈటీ–2024 కన్వీనర్‌ పాండురంగా రెడ్డి జులై 2న‌ తెలిపారు.

రాష్ట్రంలోని 8 వర్సిటీల్లోని 45 సబ్జెక్టులకు పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సులకు 73,566 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 50 వేల మంది బాలికలు, 23,566 మంది బాలురు ఉన్నట్లు కన్వీనర్‌ వెల్లడించారు.

జూన్‌ 26 నుంచి 30 వరకు రూ.2,000 అపరాధ రుసముతో సుమారు 100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన ఎంఏ కన్నడ, మరాఠీ, అరబిక్, పర్షియన్, థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Education Hub : ఎడ్యుకేషన్‌ హబ్‌ గా కాటారం.. ప్రత్యేకతలు ఇవే!

రాష్ట్రవ్యాప్తంగా 37 కేంద్రాల్లో జరిగే పీజీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా, జూలై 7న జాతీయ స్థాయిలో ఇతర పరీక్షలు ఉన్నందున ఎంఈడీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ స్టూడెంట్స్‌ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వలిగొండ నరసింహ సమర్పించిన వినతిపత్రానికి పాండురంగారెడ్డి స్పందించారు.

ఇతర పరీక్షల కారణంగా జూలై 7న జరిగే ఎంఈడీ ప్రవేశ పరీక్ష 16కు వాయిదా వేసినట్లు తెలిపారు. ఎంఈడీ ప్రవేశ పరీక్షను 16న ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.  

#Tags