Tomorrow All School Holiday : రేపు స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌ట‌న‌... ఎల్లుండి కూడా.. ?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో వివిధ జిల్లాల క‌లెక్టర్లు అన్ని స్కూల్స్‌కు రేపు అన‌గా అక్టోబ‌ర్ 17వ తేదీ గురువారం సెల‌వు ప్ర‌క‌టించారు.

అనంతపురం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో పాఠశాల నిర్వహించకుండా చూడాలన్నారు .అదే విధంగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే రహదారుల్లో వంకలు, వాగులు ఉండే పాఠశాలలను ముందుగా గుర్తించి ఇబ్బంది పడకుండా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో 17వ తేదీన‌ అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్‌లకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫోన్ చేయాలని అన్నారు. అలాగే స‌త్యసాయి జిల్లాలో కూడా రేపు స్కూల్స్‌కు సెల‌వు ఇచ్చారు.

తిరుప‌తిలో కూడా..
తిరుపతి జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కాలేజీలకు కూడా వర్తిస్తుందన్నారు.

నెల్లూరులో కూడా...
అల్పపీడనం, తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. 0861-2331261,7995576699 , జిల్లాలోని ప్రజలు ఈ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చున్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే స్కూల్స్‌కు రేపు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

రేపు ప్ర‌కాశం జిల్లాలో అన్ని స్కూల్స్‌కు సెల‌వు..
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించారు. ముందస్తు జాగ్రత్తగా బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే గురువారం కూడా స్కూల్స్‌కు సెల‌వు ఇచ్చారు. అందరూ సెలవు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

క‌డ‌ప‌లో..
కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈక్రమంలో ఈ రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులను సిద్ధం చేశారు. రేపు కూడా కడప, అన్నమయ్య జిల్లాల్లో స్కూల్స్‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. 

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరు నగరంతో పాటు కావలి, అల్లూరు, బిట్రగుంట, గుడ్లూరు, లింగసముద్రం, వింజమూరు, వరికుంటపాడు, ఇందుకూరుపేట, కొండాపురం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగులోకి వరద ఎక్కువగా చేరుతోంది. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.

నెల్లూరులో..
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, రాజుపాలెం, కొత్తపట్నం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. తీరప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు 360 మంది పోలీసులతో 18 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.  

ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. కడప బస్టాండ్‌లోకి భారీగా వరదనీరు చేరింది. పోరుమామిళ్ల, ఒంటిమిట్టలో అత్యధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. 

తిరుమల కనుమ రహదారుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి పాదాలు, జాపాలి, ఆకాశగంగకు భక్తులను అనుమతించడం లేదు. వర్షాల కారణంగా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే.

రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తృతంగా..
వాయుగుండం వాయవ్య దిశగా గంటకు 10కి.మీ వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 440 కి.మీ, పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇది గురువారం తెల్లవారుజామున చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే... ఎల్లుండి కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చే అవకాశం ఉంది.

చెన్నై, బెంగళూరులో విద్యాసంస్థలకు సెలవు.. ఇంకా..

దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, బెంగళూరులో పాఠశాలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసివేయలని పేర్కొంది.

రేపు (గురువారం) తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పీడన ప్రాంతం పశ్చిమం నుంచి వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం అల్పపీడనంగా మారింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలలో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని నగరంలో మోహరించారు.

బెంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో బెంళూరులో హై అలర్ట్ ప్రకటించాం. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మోహరించాం. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండటానికి మరో 40 మందిని మళ్లీ నియమించాం. అగ్నిమాపక , అత్యవసర సేవలను సిబ్బందిని అందుబాటులో ఉంచాం’ అని కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.

#Tags