Schools Closed News: పాఠశాలల మూసివేత కారణం ఇదే..

School Closed

నవాబుపేట: ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మీటింగులున్నా.. ఉపాధ్యాయుడే సెలవు పెట్టినా.. బడి తాళం వేసి విద్యార్థులను ఇంటికే పరిమితం చేస్తున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదంటూ ఆరోపణలు వస్తుంటే.. ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరిం అధ్వానంగా మారుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిఽధిలోని చిట్టిగిద్దరైల్వే స్టేషన్‌, కుమ్మరిగూడ, కేషవపల్లి తదితర పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు.

గురువారం ఎక్‌మామిడి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగ్‌ ఉండడంతో మధ్యాహ్నం 12గంటలకు పాఠశాలను బంద్‌ చేసి విద్యార్థులను ఇంటికి పంపించారు. సమావేశం ఉంటే మరో ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సభలు సమావేశాల పేరిట బడులకు తాళాలు వేస్తే పిల్లల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై మండల విద్యాధికారి గోపాల్‌ వివరణ కోరగా ఈ రోజు ఎక్‌మామిడి స్కూల్‌ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులకు సమావేశం ఉండడంతో ఏకోపాధ్యాయులున్న పాఠశాలల ఉపాధ్యాయులను మద్యాహ్నం వరకు పాఠశాలను నడిపి అనంతరం సమావేశానికి హాజరు కావాలని తెలిపామన్నారు. ఉపాధ్యాయుల కొరత వల్ల వేరే ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయలేదన్నారు.

#Tags