రైల్వే పరీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నారా.. రాణించండిలా!

కరోనా కారణంగా రైల్వే పరీక్షలు వాయిదా పడటంతో ప్రిపరేషన్‌ కోసం అభ్యర్థులకు మరికొంత సమయం దక్కినట్లయింది.

వాస్తవానికి రైల్వే పరీక్షలకు దరఖాస్తులు లక్షల సంఖ్యలో వస్తాయి. పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైల్వే పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు పక్కా ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి. రైల్వే కొలువు లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ, ఆర్‌ఆర్‌బీ జూనియర్‌ ఇంజనీర్‌(జేఈ), ఏఎల్‌పీ పరీక్షల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఈ వాయిదా ప‌డిన ప‌రీక్షలు డిసెంబ‌ర్ 15 నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా పరీక్షల్లో రాణించేందుకు ఎగ్జామ్‌ టిప్స్‌...

పరీక్షల సరళి..
పరీక్ష రాయాలంటే.. పరీక్షా విధానం గురించి ముందుగా తెలుసుకోవాలి. అంటే ఎన్ని పేపర్‌లు, ఏఏ సబ్జెక్టులు, ఎన్ని మార్కులు, పరీక్షా సమయం, ఆబ్జెక్టివ్‌ విధానమా, డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో పరీక్ష ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలి. అలాగే పరీక్ష దశలను, పరీక్షా విధానం, ఎన్ని సబ్జెక్టులు, ఎంత సిలబస్‌ ఉందో తెలుసుకోవాలి.

సిలబస్‌..
రైల్వే పరీక్షల్లో సాధారణంగా క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ వంటి అంశాలు ఉంటాయి. ఆయా సబ్జెక్టుల సబ్‌ టాపిక్స్‌ను సైతం గుర్తించి ముఖ్యమైన వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టి చదవాలి. అందుకోసం పాత ప్రశ్న పత్రాలు ఉపయోగపడతాయి.

టైం టేబుల్‌..
ఏ పరీక్షకు ప్రిపేర్‌ కావాలనుకున్నా..ముందుగా టైమ్‌టేబుల్‌ను తయారు చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ఆందోళన లేకుండా సమయానికి సిలబస్‌ పూర్తి చేసేందుకు వీలవుతుంది. ప్రిపరేషన్‌కు సమయం కేటాయించినట్లే.. విశ్రాంతికి కొంత సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజూ కనీసం ఆరేడు గంటలు చదవాలి.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌..
పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే.. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతమున్న పోటీని ఎదుర్కోవాలంటే.. కష్టపడి చదవడం కన్నా స్మార్ట్‌గా చదివితేనే విజయం సొంతమవుతుంది. సిలబస్‌ను వేగంగా అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ దోహదపడుతుంది. క్రమశిక్షణతో కూడిన సమయ పాలన వల్ల అనేకసార్లు రివిజన్‌ చేయడానికి వీలవుతుంది.

సొంత నోట్స్‌..
సిలబస్‌ను పూర్తి చేసేటప్పుడు తమకు తామే సొంత నోట్స్‌ను తయారుచేసుకోవాలి. పెద్ద పెద్ద విషయాలను గుర్తించుకోవడానికి ఒక చిన్న కథలాగ, కోడ్‌ రూపంలో సొంతంగా నోట్స్‌ రాసుకోవాలి. మర్చిపోతామని అనుకున్న కఠిన విషయాలను ఏదో ఒక కోడ్‌ రూపంలో తయారుచేసుకోవాలి.

పుస్తకాల ఎంపిక..

  • రైల్వే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకొని వాటినే పదే పదే చదవాలి.
  • కరెంట్‌ అఫైర్స్‌ కోసం ప్రతిరోజూ తప్పకుండా వార్తాపత్రికలను, టీవీ చానళ్లలో చర్చలను అనుసరించాలి.
  • పదో తరగతి వరకు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలన్నీ క్షుణ్ణంగా ప్రిపేర్‌ అవ్వాలి.
  • వీలుంటే నెలవారీ కరెంట్‌ అఫైర్స్‌ మ్యాగజైన్‌లను చదవడం మేలు చేస్తుంది.

ప్రాక్టీస్‌ చేయాలి..
మాక్‌టెస్ట్‌లను, గత ప్రశ్న పత్రాలను తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి. ప్రశ్నలు పునరావృతమవుతుం టాయి. అందువల్ల గత పరీక్షా పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం వల్ల పరీక్ష హాల్లో త్వరగా సమాధానాలు గుర్తించొచ్చు. అలాగే మోడల్‌ ప్రశ్నలను క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయం దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రైల్వేలో జాబ్‌ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నపుడు దానిని సాధించడానికి పట్టుదలతో కృషిచేయాలి.







#Tags